KTR | బతికున్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ కోసం కష్టపడిన ఓ ఇంటి ఆడబిడ్డ పెండ్లికి పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. గంభీరావుపేట మండలం నర్మాల గ్రామానికి చెందిన ధ్యానబోయిన నర్సింహులు, ఆయన కుమారుడు నరేశ్ ఇద్దరూ బీఆర్ఎస్ పార్టీ కోసం అంకితభావంతో పనిచేశారు. కానీ ఇద్దరూ కొన్నేండ్ల వ్యవధిలోనే అకాల మరణం చెందారు. ఇప్పుడు ఆ కుటుంబానికి ఆధారంగా ఉన్న ఒకే ఒక ఆడబిడ్డ పెళ్లి జరుగుతుందని ఆహ్వానం అందడంతో ఆయన వేడుకకు హాజరై ఆశీస్సులు అందించారు. ఈ మధుర క్షణాన్ని ట్విట్టర్ (ఎక్స్) ద్వారా పంచుకున్న కేటీఆర్.. ‘ఈ రోజు ఒక ప్రత్యేకమైన ఆహ్వానం అందింది…నాకు ఇదొక ప్రత్యేకమైన అనుభూతి’ అని తెలిపారు.
‘ ప్రతి అమ్మాయి తన వివాహానికి నాన్న ఆశీర్వాదం, అన్నయ్య అండ కావాలని కోరుకుంటుంది. కానీ నా చెల్లి తన నాన్న, అన్నయ్యను కోల్పోయిన తర్వాత ఆ లోటును తీర్చమని నన్ను పిలిచింది. ఆమె ఆహ్వానం నాకు కేవలం ఆహ్వానం కాదు…అది నా మీద ఉంచిన నమ్మకం, ఒక అన్నయ్యపై ఉంచిన ఆశ.’ అని కేటీఆర్ తెలిపారు. ఆ ఆడబిడ్డ ఆహ్వానం నా మనసును కదిలించింది. ఆమె కోరికను గౌరవించడం నా బాధ్యతగా, కర్తవ్యంగా భావించానని పేర్కొన్నారు.
” నికార్సయిన తెలంగాణ బిడ్డలే బీఆర్ఎస్ బలం, బలగం. గంభీరావుపేట మండలం నర్మాల గ్రామానికి చెందిన ధ్యానబోయిన నర్సింలు జీవితకాలం బీఆర్ఎస్ పార్టీ అభ్యున్నతి కోసం కృషిచేశారు. కరోనా విపత్తు సమయంలో వారు మరణించారు. ఆ తర్వాత ఆ ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న వారి కుమారుడు ధ్యానబోయిన నరేష్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. తాను చనిపోయిన తన అవయవాలు జీవన్ దాన్ కు దానం చేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. ” అని కేటీఆర్ తెలిపారు. చెల్లెలు నవిత ఆనందంలో భాగస్వామి కావడం, ఆమెకు అండగా నిలవడం అన్నగా, ఆత్మీయుడిగా నా బాధ్యత అని భావించానని తెలిపారు. ప్రజలతో ఉన్న అనుబంధం రాజకీయాలకు మించినది. మనందరికీ ఒకటే కుటుంబం అని ఇలాంటి సందర్భాలు నాకు ఎప్పుడూ గుర్తు చేస్తూనే ఉంటాయని చెప్పారు. చెల్లెలు నవిత-సంజయ్ దంపతుల కొత్త జీవిత ప్రయాణం సంతోషం, ప్రేమ, ఆశీర్వాదాలతో నిండిపోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నానని తెలిపారు. వారికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.