హైదరాబాద్, అక్టోబర్ 9(నమస్తే తెలంగాణ): బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ కుట్రలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ముందే ఊహించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీ బిల్లుకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా జరిగిన చర్చలో కేటీఆర్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ చిత్తశుద్ధిని ప్రశ్నించారు. పార్లమెంటులో చేయాల్సిన చట్టాన్ని ఇక్కడ చేస్తే అది బీసీలకు లాభం చేసినట్టు ఎలా అవుతుందో, బీసీలకు న్యాయం ఎలా జరుగుతుందో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. బీసీ బిల్లుపై ప్రభుత్వం ఐదు గొంతుకలు, ఐదు నాలుకలతో మాట్లాడుతున్నదని విమర్శించారు.
ఒకసారి రాజ్యాంగ బద్ధంగా చేస్తామంటారని, మరోసారి పార్టీ పరంగా, ఇంకోసారి ఆర్డినెన్స్ ద్వారా, ఇప్పుడు బిల్లు, దీనిని జీవో ద్వారా అమలు చేస్తామని చెప్తున్నారని తూర్పారబట్టారు. తాము మద్దతునిస్తున్నాం కాబట్టే బిల్లు పాస్ అవుతున్నదని, కానీ, ఆర్డినెన్స్‌పై సంతకం చేయని గవర్నర్ బిల్లుపై ఎలా సంతకం చేస్తారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 30 లోపు రిజర్వేషన్లు చేసి ఎన్నికలు ఎలా పూర్తిచేస్తారని, గవర్నర్‌తో సంతకం ఎలా చేయిస్తారని నిలదీశారు. ఎవరిని మోసం చేయడానికి ఇదంతా చేస్తున్నారని కేటీఆర్ దుయ్యబట్టారు. నాడు కేటీఆర్ చెప్పినట్టుగానే బీసీ రిజర్వేషన్లపై ఇచ్చిన జీవోపై హైకోర్టు స్టే విధించింది.