రేగొండ, జూలై 5 : రైతులు నిరుత్సాహపడొద్దని, రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభయమిచ్చారు. రైతుల బాగు కోసం కేసీఆర్ ముందుచూపుతో ఆలోచిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలను ఆర్థికంగా ఎలా దెబ్బతీయాలో కుట్ర చేస్తున్నదని విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే కాళేశ్వరం ప్రాజెక్టును మరింత అభివృద్ధి చేసి ఈ ప్రాంతానికి ఎస్సారెస్పీ కాలువల ద్వారా సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ఆదివారం కేటీఆర్ కన్నెపల్లి పర్యటనకు వెళ్లివస్తున్న క్రమంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాకలో రైతు పైడిపల్లి బొందయ్య సాగు చేస్తున్న ఆయిల్‌పామ్ తోటను హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితో కలిసి పరిశీలించి, రైతులతో మాట్లాడారు.
ఆయిల్‌పామ్ సాగుతో రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని, కేసీఆర్ ముందుచూపుతో ఆలోచించి, సబ్సిడీ ఇచ్చి సాగుకు ప్రోత్సహించిన విషయాన్ని గుర్తుచేశారు. కేసీఆర్ పిలుపుతో రైతులు ముందుకొచ్చి ఆయిల్‌పామ్ తోటలను సాగు చేశారని, ఇప్పుడు అవి పంటదశకు చేరుకున్నాయని తెలిపారు. ఒకప్పుడు ఆంధ్రా ప్రాంతంలోనే ఈ పంటను సాగు చేసేవారని, తెలంగాణ రైతులు కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో కేసీఆర్ ఈ తోటల సాగుకు సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహించినట్టు పేర్కొన్నారు. ఆయిల్‌పామ్ సాగుతో రైతులు ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందుతారని చెప్పారు. రానున్న రోజుల్లో కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అవుతారని, రైతులు ఎవరూ అధైర్యపడొద్దని సూచించారు.