– ఖమ్మం బాట పడుతున్న రూరల్ ప్రజలు
– సర్కారు భూములపై కొరవడిన పర్యవేక్షణ
ఖమ్మం రూరల్, జూలై 28 : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ శాఖల్లో ఉన్న వీఆర్ఏలను జీపీఓలుగా నియామకం చేస్తూ గ్రామ పాలన అధికారులుగా బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసింది. అందులో భాగంగానే ఖమ్మం రూరల్ మండలంలోని క్లస్టర్ల వారిగా, గ్రామాల వారిగా జీపీఓలను నియమించారు. గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి అవసరమైన సేవలు అందించడంతో పాటు. సర్కారు భూములు అన్యాక్రాంతం కాకుండా, భూ పంచాయతీలకు, భూ బదిలీలు, విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలు, ఫ్యామిలీ సర్టిఫికేషన్ ఇలా అనేక విధులు వారు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఖమ్మం రూరల్ తాసీల్దార్ కార్యాలయానికి ఖమ్మం రూరల్ మండల గ్రామాలు సుదూర ప్రాంతంలో ఉంటాయి. జాన్ బాగ్ తండా, తనగంపాడు, మంగళగూడెం, కస్నాతండా, ఆరెకోడు తండా అనేక గ్రామాల ప్రజలు తాసీల్దార్ కార్యాలయానికి రావాలంటే దాదాపు 20 నుంచి 30 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది.
ఆయా గ్రామాల జిపిఓ లు నిరంతరం తాసిల్దార్ కార్యాలయానికి పరిమితం కావడంతో వారిని కలుసుకునేందుకు గ్రామాల ప్రజలు ఖమ్మం నగరంలోని రూరల్ తాసీల్దార్ కార్యాలయానికి నిత్యం రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. జీపీఓలకు అవసరం ఉంటేనే గ్రామాలకు వస్తున్నారు. ఎప్పుడు వస్తున్నారో, ఎప్పుడు పోతున్నారో గ్రామ ప్రజలకు తెలియని పరిస్థితి నెలకొంది. ఏదైనా పత్రం మీ సేవలో దరఖాస్తు చేసుకున్న తర్వాత, ఆఫ్లైన్లో ధ్రువీకరణ పత్రాలు జీపీఓకి ఇవ్వాలంటే ఖమ్మం నగరంలోని తాసీల్దార్ కార్యాలయానికి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని స్థానిక ప్రజలు వాపోతున్నారు. ఇక సర్కారు భూములను పర్యవేక్షణ నిరంతరం చేయాల్సిన జిపిఓలు అందుబాటులో ఉండకపోవడంతో సదరు భూములను పలువురు వ్యక్తులు కబ్జాలకు పాల్పడుతున్నారని విమర్శలు తీవ్రంగా ఉన్నాయి.
బాధ్యత గల వ్యక్తులు ఎవరైనా జీపీఓలకు సమాచారం అందజేస్తే తప్ప ఫీల్డ్ మీదికి రావడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం రోజుకు ఒక గంట పాటు అయినా గ్రామ పంచాయతీ కార్యాలయంలో అందుబాటులో ఉండాల్సిన జీపీఓలు వారానికి, లేదా పక్షానికి ఒకసారి చుట్టపు చూపుగా పల్లెబాట పడుతున్నారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. భూ కబ్జాలకు పాల్పడిన వ్యక్తులు నిర్మాణాలు పూర్తి చేసుకున్న తర్వాత కూడా జీపీఓలకు తెలియని పరిస్థితి ఖమ్మం రూరల్ లో చోటుచేసుకుంటుందని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని జీపీఓలకు గ్రామాల్లో కొంత సమయం కేటాయించే విధంగా షెడ్యూల్ ఖరారు చేయాలనే డిమాండ్ బలంగా వినపడుతుంది.