హైదరాబాద్, జూన్ 7(నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘నీట్’ పేపర్ లీకేజీకి కేంద్ర ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు. లోపభూయిష్టమైన వ్యవస్థ కారణంగా నష్టపోయిన విద్యార్థులకు భరోసా కల్పించేందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించాలని ప్రధాని మోదీని డిమాండ్ చేశారు. తప్పుచేసిన పెద్దలపై చర్యలు తీసుకుంటేనే, భవిష్యత్తులో పొరపాట్లు పునరావృతం కాకుండా ఉంటాయనే బలమైన సందేశం అధికారుల్లోకి వెళ్తుందని స్పష్టంచేశారు. మలేషియా పర్యటనకు వెళ్లే ముందు, జూన్ 4న సాయంత్రం హైదరాబాద్‌లో నీట్ బాధితులు, లాంగ్ టర్మ్ విద్యార్థులతో కేటీఆర్ ప్రత్యేకంగా సమావేశమై ముఖాముఖి నిర్వహించారు.
నిర్వహణలో ప్రభుత్వం ఫెయిల్
రాత్రింబవళ్లు కష్టపడి చదివి 520కి పైగా మారులు సాధించినా, పేపర్ లీకేజీతో తమ శ్రమ వృథా అయ్యిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖాముఖిలో విద్యార్థులు పాల్గొని తాము ఎదురొంటున్న మానసిక క్షోభను కేటీఆర్ ముందు ఏకరువుపెట్టారు. ఎగ్జామ్ హాల్ లోకి వెళ్లే ముందు తమను అణువణువూ తనిఖీ చేసిన అధికారులు, పేపర్ లీక్‌ను ఎందుకు అడ్డుకోలేకపోయారని నిలదీశారు. తప్పు ఎన్టీఏ బోర్డు చేసి, విద్యార్థులను మళ్లీ మళ్లీ పరీక్షలకు కూర్చోబెట్టడం ఏరకంగా న్యాయమని వారు ప్రశ్నించారు. విద్యార్థుల ఆక్రోశంపై స్పందించారు. ‘మీ కోపంలో 100శాతం న్యాయం ఉన్నది. పరీక్ష నిర్వహణలో కేంద్ర సర్కార్ ఫైయిలైంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఎన్టీఏ ఘోరంగా విఫలమైంది. తప్పు చేసిన పెద్దలను వదిలేసి, మిమ్మల్ని మళ్లీ పరీక్షకు కూర్చోబెట్టడం ముమ్మాటికీ అన్యాయమే. కానీ, ఇదొక తాతాలిక స్పీడ్ బ్రేకర్ లాంటిది. మీ కసిని, ఎనర్జీని సరైన దిశలో పెట్టి మళ్లీ ఫోకస్ చేయండి’ అని వారిలో ధైర్యం నింపారు.
గ్రేస్ మారుల వెనుక మాయాజాలం
గతంలో(2024) గ్రేస్ మారుల పేరిట జరిగిన అవకతవకలను, కటాఫ్‌లు అసాధారణంగా పెరిగిపోవడాన్ని ఒక విద్యార్థి ప్రస్తావించగా, కేటీఆర్.. ఎన్టీఏ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ‘గ్రేస్ మారులు ఎందుకు కలిపారో చెప్పడానికి ఎన్టీఏ వద్ద ఇప్పటికీ ఎలాంటి తారిక సమాధానం లేదు. చాలా బాధ్యాతారాహిత్యంగా వ్యవహరించి లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారు. కొంతమందికి అడ్డదారిలో మారులు కలిపి, కష్టపడ్డ విద్యార్థులకు అన్యాయం చేయడం ఘోరమైన నేరం. వ్యవస్థలోని లోపాలపై పార్లమెంట్, అసెంబ్లీలో గట్టిగా నిలదీస్తాం.. చట్టపరంగా కఠిన శిక్షలు పడేలా చట్టసభ సభ్యులుగా మా బాధ్యత నెరవేరుస్తాం’ అని హామీ ఇచ్చారు.
పాలకులకు భయం ఉండాలి
‘మంత్రి రాజీనామా చేస్తే సమస్య పరిషారమవుతుందా?’ అని ఒక విద్యార్థి అడిగిన ప్రశ్నకు కేటీఆర్ తనదైన శైలిలో బదులిచ్చారు. ‘మంత్రి రాజీనామా ఒక హెచ్చరిక లాగా పనిచేస్తుంది. ప్రధాని గనుక మంత్రిని తొలగిస్తే.. తప్పు జరిగితే బాధ్యత వహించక తప్పదనే భయం అధికారుల్లో వస్తుంది. లేకపోతే వ్యవస్థలో నిర్లక్ష్యం పెరుగుతుంది. సూల్ బంక్ కొడితేనే పనిష్మెంట్ ఉన్నప్పుడు, వ్యవస్థను నాశనం చేసిన పెద్దలకు శిక్ష ఉండాలి’ అని పేరొన్నారు.
దేశవ్యాప్తంగా రీ-నీట్ నిర్వహించాల్సిందేనా?
పేపర్ లీక్ అయిన రాష్ట్రాల్లోనే పరీక్ష పెట్టాలా? లేక దేశవ్యాప్తంగా నిర్వహించాలా? అనే ప్రశ్నకు కేటీఆర్ బదులిస్తూ.. ‘ప్రస్తుత కనెక్టెడ్ ప్రపంచంలో లీకైన పేపర్ మిగతా రాష్ట్రాలకు వెళ్లలేదని చెప్పలేం. ఒక కోచింగ్ సెంటర్లో పలు రాష్ట్రాల విద్యార్థులు ఉంటారు. ఎకడో ఒకచోట 1% లీక్ అయినా అది అందరికీ పాకుతుంది. కాబట్టి లీక్ పరిధిపై 100% స్పష్టత ఉంటే ఆయా రాష్ట్రాలకే పరిమితం చేయవచ్చు, లేదంటే దురదృష్టవశాత్తు దేశవ్యాప్తంగా మళ్లీ నిర్వహించడం మినహా ప్రత్యామ్నాయం లేదు. అయితే, అసలు లీక్ కాకుండా ఉండేందుకు నేటి ఏఐ సాంకేతికతను వాడుకొని ఫూల్ ప్రూఫ్ సిస్టమ్స్ తేవడంపై కేంద్రం దృష్టిపెట్టాలని కోరారు.
మెరిట్‌ను మింగేస్తున్న మేనేజ్మెంట్ కోటా
పైసలు ఉన్నవాళ్లు డొనేషన్లు కట్టి సీట్లు కొంటున్నారని, మెరిట్‌కు విలువ లేకుండా పోతున్నదని ఓ విద్యార్థి ఆవేదనపై కేటీఆర్ స్పందించారు. ‘డబ్బులున్నాయని డాక్టర్లు అయిపోయే ఈ విధానం అత్యంత అన్యాయమైనది. ప్రైవేట్ కాలేజీల దోపిడీని అడ్డుకోవడానికి బలమైన రెగ్యులేటరీ సిస్టమ్ రావాలి. రేపటి రోజున మన కుటుంబసభ్యులకు బాలేకపోతే డబ్బులు ఉన్న డాక్టరా? మెరిట్ ఉన్న డాక్టరా? ఎవరికి చూపిస్తాం? కాబట్టి మేనేజ్మెంట్ సీట్లను తగ్గించి, మెరిట్‌కే ప్రాధాన్యతనిచ్చేలా ఫీజులు, కోటాను నియంత్రించాల్సిన అవసరం ఉన్నది’ అని అభిప్రాయపడ్డారు.
ఒత్తిడిని దాచుకోవద్దు
తీవ్ర ఒత్తిడి, ఆందోళనలో ఉన్న విద్యార్థులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ‘నేను ఇద్దరు పిల్లల తండ్రిగా మీ బాధను, హెల్ప్లెస్నెస్ను అర్థం చేసుకోగలను. ఇలాంటి కష్టసమయాల్లో భావోద్వేగాలను లోపలే దాచుకోవద్దు అది మానసిక ఒత్తిడిని పెంచుతుంది. మీ తల్లిదండ్రులు, టీచర్లు, స్నేహితులతో మాట్లాడండి, మీ బాధను పంచుకోండి. లైఫ్ ఇలాంటి బౌన్సర్లు విసురుతున్నప్పుడు బ్యాలెన్స్డ్గా ఎదురోవడం నేర్చుకోవాలి.’ అని హితబోధ చేశారు. గతంలో కొందరు విద్యార్థులు సీబీఎస్ఈ బోర్డు లోపాలను ఎండగట్టినట్టు, నీట్ లోపాలను తాము రాజ్యసభ సభ్యుల ద్వారా ఢిల్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని, విద్యార్థుల తరఫున బీఆర్ఎస్ పోరాడుతుందని భరోసానిచ్చారు.