విద్యుత్తు చార్జీల పెంపు రాష్ట్ర ప్రగతికి గొడ్డలిపెట్టులా మారుతుంది. ఇప్పటికే ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాలతో పారిశ్రామిక ప్రగతి మందగించింది. అనేక రంగాలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో విద్యుత్తు చార్జీల పెంపు సమంజసం కాదు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా, పెద్ద పరిశ్రమలను ఒకే క్యాటగిరీ కింద చేర్చడం ప్రభుత్వ అవగాహనా రాహిత్యానికి నిదర్శనం
-కేటీఆర్
విద్యుత్తు చార్జీల పెంపుపై ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగారావును కలిసి వినతిపత్రం అందిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కౌశిక్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్ , కోవలక్ష్మి, మాగంటి గోపీనాథ్ , సంజయ్, బీఆర్ఎస్ నేత బాల్క సుమన్
హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు చార్జీలు పెంచేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలికి బీఆర్ఎస్ విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర ప్రజలపై వివిధ రూపాల్లో రూ. 18,500 కోట్ల భారాన్ని మోపేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని, దాదాపు 9 ప్రతిపాదనలను విద్యుత్తు నియంత్రణ మండలికి సమర్పించిందని, వాటిని తిరస్కరించాలని కోరింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాష్ట్ర విద్యుత్తు శాఖ మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, కాలేరు వెంకటేశ్, మాగంటి గోపీనాథ్, డాక్టర్ సంజయ్, పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, గాదరి కిశోర్, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు గెల్లు శ్రీనివాస్ యాదవ్, వాసుదేవరెడ్డి, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిశోర్‌గౌడ్, పార్టీ నేతలు పుట్టా విష్ణువర్దన్‌రెడ్డి, నర్సింహారెడ్డి తదితరులు కలిసి విద్యుత్తు నియంత్రణ మండలికి సోమవారం వినతిపత్రం సమర్పించారు. మండలి ఎదుట తమ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ విద్యుత్తు చార్జీలు పెంచేందుకు ప్రభుత్వం 9 ప్రతిపాదనలు విద్యుత్తు నియంత్రణ మండలికి సమర్పించినట్టు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. ప్రభుత్వ అనాలోచిత, అసంబద్ధ నిర్ణయాలతో రాష్ట్ర పారిశ్రామిక రంగం తిరోగమనం పాలవుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. తెలంగాణ విద్యుత్తు సరఫరా సంస్థలు రూ.963 కోట్ల ట్రూ అప్ చార్జీలు, రూ.16,364 కోట్ల విద్యుత్తు చార్జీలు, ఈ ఆర్థిక సంవత్సరానికి గాను రూ.1,200 కోట్ల విద్యుత్తు చార్జీల పెంపు అనుమతి కోరుతూ ప్రతిపాదించాయని, ఆ పిటిషన్లను తిరస్కరించాలని కోరా రు. ప్రభుత్వం సమర్పించిన చార్జీల పెంపు ప్రతిపాదనలను ఆమోదిస్తే రాష్ట్ర ప్రజలపై భారం పడటమే కాకుండా దాని ప్రభావం రాష్ట్ర ప్రగతిపై పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రస్తుత పరిస్థితుల్లో పెంపు ఏమాత్రం మంచిది కాదని విద్యుత్తు రంగ నిపుణులు పేర్కొంటున్న ఉదంతాలను కేటీఆర్ ఉదహరించారు. వినతి పత్రం ఇచ్చిన అనంతరం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కుటీర పరిశ్రమలు కుదేలవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను మిగితా పరిశ్రమలను ఒకే గాటన కట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నదని, అలా జరిగితే వాటికి చావుదెబ్బేనని చెప్పారు. సిరిసిల్ల లాంటి ప్రాంతంలో ఎల్టీ కనెక్షన్లను ఎస్టీ కనెక్షన్లుగా మార్చితే పడే భారాన్ని ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. సిరిసిల్ల, నల్లగొండ, కాటేదాన్‌లో 40వేల మరమగ్గాలు ఉన్నాయని ఉదహరించారు.
విద్యుత్తు చార్జీల పెంపుతో గృహ వినియోగదారులకు పెనుభారం పడనుందని కేటీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు. గృహ వినియోగదారలకు నెలకు 300 యూనిట్లు దాటితే కిలోవాట్ విద్యుత్తు చార్జీని ప్రస్తుతం రూ.10 వసూలు చేస్తున్నారని,ఆ ఫిక్స్డ్ చార్జీని రూ.10 నుంచి రూ.50కి అంటే ఐదు రెట్లు పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించిందని చెప్పారు.
‘సిరిసిల్లలో నడిపే సాంచాలను, అదానీ పరిశ్రమను ఒకే గాటన కడతారా? దీన్నేమనాలి? అని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా ఇలా పరిశ్రమలను ఒకే క్యాటగిరీలోకి తేలేదని గుర్తుచేశారు. 11కేవీ, 33 కేవీ, 132 కేవీ, 220 కేవీ కింద పరిశ్రమలు ఉంటాయని,అన్నింటినీ ఒకే క్యాటగిరీలోకి తేవడం రాష్ట్ర పురోగతికి గొడ్డలిపెట్టు వంటిదని చెప్పారు. సిరిసిల్ల, నల్లగొండ, కాటేదాన్ తదితర ప్రాంతాల్లో ఉన్న పవర్‌లూం సెక్టార్లో 10హెచ్‌పీలో 50శాతం సబ్సిడీ వచ్చేదని, కొత్త ప్రతిపాదనల వల్ల వారికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని చెప్పారు.
ప్రభుత్వ అనాలోచిత చర్యలతో రాష్ర్టానికి వచ్చిన పరిశ్రమలు ఒక్కొక్కటిగా తరలిపోతున్నాయని, తాజా ప్రతిపాదనలతో కొత్త పరిశ్రమలు పెట్టాలనుకునేవారికి అడ్డుకట్ట వేసినట్టవుతుందని కేటీఆర్ వాపోయారు. కేసీఆర్ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలతో లక్ష మందికి ఉపాధి కల్పించేందుకు ఫాక్స్‌కాన్ కంపెనీ ముందుకొచ్చిందని, కొంగరకలాన్తో తొలిదశలో 25వేల మందికి ఉపాధి కల్పించేందుకు సిద్ధమైందని, ప్రభుత్వ చేష్టలతో ఫాక్స్‌కాన్ విస్తరణ ఉంటుందా? ఉండదా? అనే అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు. చెన్నై లో రూ. 13,800 కోట్ల పెట్టుబడులు పెడ్తామని, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రాలో ఆలోచిస్తున్నామని ఆ సంస్థ ప్రతినిధులు ఇటీవల ప్రధానిని కలిసిన సందర్భంలో పేర్కొన్న విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. రాష్ట్రంలో విస్తరణ గురించి సంస్థ పెద్దగా ప్రస్తావించని వైనాన్ని వివరించారు. ఇప్పటికే రూ.3,600 కోట్ల కేన్స్ పరిశ్రమ గుజరాత్‌కు, కార్నింగ్ సంస్థ తన రూ.1100 కోట్ల పెట్టుబడిని చెన్నైకి తరలించిందని తెలిపారు.
రైతుల విషయంలో ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీస్తే సమాధానం చెప్పకుండా దాటవేశారని కేటీఆర్ గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన విద్యుత్తు సంస్కరణల్లో భాగంగా వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టే ప్రతిపాదనను ఆమోదిస్తున్నారా? తిరస్కరిస్తున్నారా? అని అడిగితే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని చెప్పారు.
తమ విజ్ఞప్తిని సావధానంగా విన్న విద్యుత్తు ని యంత్రణ మండలి ఈనెల 23న పబ్లిక్ హియరింగ్ ఉన్నదని, ఆరోజూ వాదన వినిపించాలని సూచించిందని కేటీఆర్ చెప్పారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకే తాము ముందే మండలికి విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. 23న తమ బృందం వచ్చి వాదన వినిపిస్తుందని స్పష్టం చేశారు. బాధ్యతాయుత ప్రతిపక్షంగా ప్రజలకు అండగా ఉంటామని చెప్పారు.
బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో విద్యుత్తు సంస్థలు అనేక పర్యాయాలు చార్జీలు పెంచుతామని ప్రతిపాదనలు తెచ్చాయని, వాటిని కేసీఆర్ నిర్దంద్వంగా తిరస్కరించారని కేటీఆర్ గుర్తుచేశారు. విద్యుత్తు సంస్థలు ట్రూ అప్ చార్జీల పేరుతో రూ.12,500 కోట్లకు ప్రతిపాదిస్తే వాటిని కేసీఆర్ తిరస్కరించారని తెలిపారు. చార్జీల పెంపును ఒప్పుకోబోమని, ప్రభుత్వమే భరిస్తుందని, వినియోగదారులపై భారం వేసేది లేదని కేసీఆర్ పేర్కొన్న విషయాన్ని ఉదహరించారు. అప్పుడు నెలకు రూ. 1000 కోట్ల భారాన్ని ప్రభుత్వమే భరిచిందని చెప్పారు. విద్యుత్తు ఆధారిత కుటీర పరిశ్రమలు, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తును ఇచ్చింది దేశంలో ఒక్క తెలంగాణ మాత్రమేనని తెలిపారు. రాష్ట్రం ఏర్పడ్డనాడు తెలంగాణలో స్థాపిత విద్యుత్తు 7,700 మెగావాట్లు ఉంటే దాన్ని 24,000 మెగావాట్లకు పెంచిన క్రాంతిదర్శి కేసీఆర్ అని కొనియాడారు. విద్యుత్తును అందుబాటులోకి తేవడం వల్ల ఎంతోమందికి ఉపాధి అవకాశాలు పెంచామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్తును వ్యాపార వస్తువులా చూస్తున్నదని విమర్శించారు.
విద్యుత్తు సంస్థలు చేసిన ప్రతిపాదనలను ఆమోదిస్తే తెలంగాణలో మళ్లీ 2014కు ముందున్న పరిస్థితి వస్తుందని విద్యుత్తుశాఖ మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి వివరించారు. ప్రభుత్వ ప్రతిపాదనలు యువత ఉపాధికి గొడ్డలిపెట్టులా మారాయని, రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతిసే ప్రతిపాదనలను తిరస్కరించాలని నియంత్రణ మండలికి విజ్ఞప్తిచేశారు. పేదలకు, పారిశ్రామికవేత్తలకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.