హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): కల్యాణలక్ష్మి కింద ఆడబిడ్డలకు ఇస్తామన్న తులం బంగారం, మహాలక్ష్మి పథకం కింద ఇస్తామన్న రూ. 2,500 ఏమయ్యాయని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 2.5 లక్షల పెండిండ్లు అయ్యాయని గుర్తుచేశారు. వృద్ధులకు 4 వేలు ఇస్తామని చెప్పి రెండు నెలల పైసలు ఎగ్గొట్టారని విమర్శించారు. ఇప్పుడు కాం గ్రెస్‌లో ఎటు చూసినా రేవంత్‌రెడ్డి అన్నదమ్ములే కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. సీఎంబావమరిది సృజన్‌రెడ్డి కంపెనీకి అమృత్ పథకం కింద వెయ్యి కోట్ల టెండర్లలో పనులు అప్పజెప్పారని పేర్కొన్నారు.
గురువారం తెలంగాణ భవన్లో స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి చెందిన తాజా మాజీ జడ్పీటీసీ సభ్యులు మారపాక రవి, మాజీ ఎంపీపీ గబ్బెట బుచ్చయ్య, ప్రవీణ్, తిరుపతి తదితరులు బీఆర్ఎస్లో చేరారు. కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ మరో 50 ఏండ్లు పటిష్ఠంగా ఉంటుందని తేల్చి చెప్పారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనమంటూ తప్పుడు ప్రచారం జరుగుతున్నదని, అదే నిజమైతే తమ ఇంటి అడబిడ్డ 150 రోజులుగా జైలులో ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు.
రూ.75 కోట్లతో సీతారామ ప్రాజెక్ట్ పూర్తి చేశామని చెప్తున్న భట్టికి నోబెల్ బహుమతి ఇవ్వొచ్చని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ పూర్తిచేసిన పనులను తన క్రెడిట్లో వేసుకునేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ ఇచ్చిన 30 వేల ఉద్యోగాలను కూడా తామే ఇచ్చినట్టు రేవంత్‌రెడ్డి చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. జాబ్‌లెస్ క్యాలెండర్ ప్రకటించారని మండిపడ్డారు. వడ్లకు బోనస్‌పైనా రేవంత్ మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్టేషన్ ఘన్పూర్ సహా మిగిలిన స్థానాల్లోనూ కచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని, అప్పుడు ప్రజల ముందుకు కాంగ్రెస్ వైఫల్యాలను తీసుకెళ్లాలని కేటీఆర్ సూచించారు. స్టేషన్ ఘన్‌పూర్‌కు జరిగే ఎన్నికల్లో రాజయ్య విజయం పక్కా అని జోస్యం చెప్పా రు. కాగ్నిజెంట్ సంస్థ బీఆర్ఎస్ ఉన్నప్పుడే ఒప్పం దం కుదుర్చుకున్నదని, దీనినీ రేవంత్ తన ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తారని విమర్శించారు. బీఆర్ఎస్లో నాయకులు పోయినా కార్యకర్తలకు కొదవలేదని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు.
కాంగ్రెస్ దురాగతాలను అడ్డుకోవడానికి తమకు అండగా ఉండాలని కోరారు. మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య మాట్లాడుతూ నమ్మక ద్రోహానికి కడియం శ్రీహరి పరాకాష్ట అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎన్నో అవకాశాలు ఇచ్చినా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేషన్ ఘన్‌పూర్‌ను మున్సిపాలిటి చేయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. సమావేశంలో బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి గ్యాదరి బాలమల్లు, రాష్ట్ర నాయకులు మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, ఉపాధ్యక్షుడు తుంగ బాలు పాల్గొన్నారు.
మోసం చేయడం కాంగ్రెస్ నైజమని కేటీఆర్ విమర్శించారు. బీసీ డిక్లరేషన్‌లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారని, కానీ దానిని అమలు చేయకుండానే కాంగ్రెస్ స్థానిక ఎన్నికలకు వెళ్తుందని పేర్కొన్నారు. బీజేపీ నేతలు కూడా కాంంగ్రెస్‌కు అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించారు.