బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచనబీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రూప్-1 ప్రశ్నపత్రం లీకైన విషయం నిఘా వర్గాల ద్వారా తెలిసిన వెంటనే తప్పును సరిదిద్దడం కోసం పరీక్షను నాటి సీఎం కేసీఆర్ రద్దు చేశారు.
ఈగోకు పోయి నిరుద్యోగులకు నష్టం చేయవద్దు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయండి. మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఈ విద్యార్థులు వేసిన ఓట్ల వల్లేనని గుర్తించండి.
-కేటీఆర్
హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 పరీక్ష అవకతవకలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి లేదా సుప్రీంకోర్టు జడ్జి , లేదా రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేసి పూర్తిస్థాయి విచారణ జరిపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు డిమాండ్ చేశారు. ఎవరు ఉద్యోగాలు అమ్ముకున్నారో, ఎకడ తప్పులు జరిగాయో నిరుద్యోగ అభ్యర్థులకు ప్రభుత్వం స్పష్టతనివ్వాలని సూచించారు. విద్యార్థుల ఆకాంక్షల మేరకు తిరిగి పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎవరు ఎన్ని ఉద్యోగాలుఇచ్చారో తేల్చేందుకు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై ప్రత్యేక అసెంబ్లీ సమాశాలు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వం నిజంగా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో ప్రజలకు స్పష్టంగా వెల్లడించాలని కోరారు. నిరుద్యోగులు, విద్యార్థుల ఓట్లతో గద్దెనెకిన రాహుల్‌గాంధీ ఈ అంశంపై తక్షణమే స్పందించాలని డిమాండ్‌చేశారు.
నిరుద్యోగులపై పెట్టిన అక్రమ కేసులను కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించాలని కోరారు. గ్రూప్-1 మెయిన్స్‌పై మంగళవారం రాష్ట్ర హైకోర్టు చారిత్రాత్మక తీర్పు నేపథ్యంలో హైదరాబాద్ నందినగర్‌లోని తన నివాసంలో నిరుద్యోగ యువతతో కేటీఆర్ సమావేశమై తీర్పు అంశంపై చర్చించారు. అనంతరం నిరుద్యోగ అభ్యర్థులతో కలిసి మీడియాతో మాట్లాడారు. రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్‌గాంధీ అశోక్‌నగర్ దాకా వచ్చి హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఈ మాటలు నమ్మి అనేకమంది నిరుద్యోగ విద్యార్థులు తమ తలరాతలు మారుతాయని, మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయని భావించి, తమ కుటుంబాలతోపాటు ఇతరుల కుటుంబాలతోనూ కాంగ్రెస్‌కు ఓటు వేయించారని తెలిపారు.
పరీక్షల నిర్వహణలో అవకతవకలు
బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రూప్-1 ప్రశ్నపత్రం లీకైన విషయం నిఘా వర్గాల ద్వారా తెలిసిన వెంటనే తప్పును సరిదిద్దడం కోసం పరీక్షను నాటి సీఎం కేసీఆర్ రద్దుచేశారని కేటీఆర్ గుర్తుచేశారు. కానీ, ఈ ప్రభుత్వం 500 పోస్టులకు కేవలం 63 పోస్టులు మాత్రమే కలిపి, గ్రూప్-1 నోటిఫికేషన్ పేరిట అడ్డగోలుగా పరీక్షలు నిర్వహించి అవకతవకలకు పాల్పడిందని విమర్శించారు. జీవో నంబర్ 29 ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేసిందని తెలిపారు. ఆ తర్వాత పరీక్ష నిర్వహిస్తే అందులో తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరిగిందని, కేవలం కొన్ని సెంటర్ల విద్యార్థులకే, కొన్ని సిరీసుల విద్యార్థులకే అధిక మారులు వచ్చాయని కేటీఆర్ విమర్శించారు. కొన్ని సెంటర్ల అభ్యర్థులకే అధిక మారులు వచ్చిన విషయాన్ని కూడా ప్రస్తావించారు.
గలీజ్ రాజకీయం వద్దు
గ్రూప్-1 పరీక్షల అవకతవకలపై నిరుద్యోగులు అన్ని విషయాలను కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలకు చెప్పినా పట్టించుకోకుండా పెడచెవిన పెట్టారని కేటీఆర్ విమర్శించారు. గ్రూప్-1 పరీక్షల్లో అవకతవకలు, తప్పుడు పద్ధతులు హైకోర్టు తీర్పుతో బయటపడ్డాయని అన్నారు. ‘భేషజాల కోసం గలీజ్ రాజకీయం చేయకండి. ఈగోకు పోయి నిరుద్యోగులకు నష్టం చేయకండి. ప్రభుత్వం రీవాల్యుయేషన్‌కు పోకుండా, గతంలో తప్పు చేసిన వారి చేతికే మళ్లీ సమస్యను అప్పజెప్పకుండా తిరిగి పరీక్షలు నిర్వహించండి’ అనిడిమాండ్ చేశారు. హైకోర్టు చెప్పిన విధంగా అవకతవకలు జరిగాయని గుర్తించాలని, టీజీపీఎస్సీ అవినీతి, పరీక్షల అస్తవ్యస్త నిర్వహణపై జ్యుడీషియల్ కమిషన్ వేయాలని కోరారు. గ్రూప్-1 పరీక్షల్లో అవకతవకలు, అక్రమాలు జరిగినట్టు హైకోర్టు గుర్తించిన నేపథ్యంలో టీజీపీఎస్సీ అవినీతిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి లేదా సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేసి విచారణ జరపాలని కోరారు. ఉద్యోగాలను అమ్ముకున్న బ్రోకర్లు, తప్పిదాలు చేసిన అధికారులు బయటకు రావాలని డిమాండ్ చేశారు. అక్రమాలపై అలుపెరగని పోరాటం చేసిన విద్యార్థులందరికీ కేటీఆర్ అభినందనలు తెలిపారు.
ప్రజల ఓట్లతోనే రాహుల్‌కు, రేవంత్‌కు ఉద్యోగాలు
రాష్ట్రంలో రెండు ఉద్యోగాలు ఊడగొడితే ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ తెలంగాణ విద్యార్థులకు చెప్పారని, ఈ అంశంపై చర్చించేందుకు ప్రత్యేక అసెంబ్లీ సెషన్ నిర్వహించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ‘రెండు ఉద్యోగాలు ఊడగొడితే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన రాహుల్‌గాంధీకి ఒక విషయం గుర్తు చేస్తున్నాను. తెలంగాణ ప్రజల ఓట్లతోనే మీకు, రేవంత్‌రెడ్డికి రెండు ఉద్యోగాలు వచ్చాయి. ఈ విషయాన్ని గుర్తుంచుకుని తెలంగాణ విద్యార్థులకు న్యాయం చేయండి. ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వండి. ఇప్పటిదాకా మీరు కేవలం 6,000 ఉద్యోగాలే నింపారు. కానీ, 60 వేల ఉద్యోగాలని అబద్ధాలు చెప్తున్నారు’ అని కేటీఆర్ విమర్శించారు. రాహుల్‌గాంధీకి చిత్తశుద్ధి ఉంటే గ్రూప్-1 అంశంలో పూర్తిస్థాయి విచారణ జరిపించాలని సర్కార్‌కు ఆదేశాలివ్వాలని కోరారు.
ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టండి
గ్రూప్-1 వ్యవహారంలో నిరుద్యోగులకు అన్యాయం చేసిన బ్రోకర్లు, దోషులు బయటకు రావాలని, ఎవరు ఉద్యోగాలు అమ్ముకున్నారో తేలాల్సిన అవసరం ఉన్నదని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్ని ఉద్యోగాలు ఇస్తుందో తేల్చాల్సిన అవసరం ఉన్నదని, ఒకో మంత్రి ఒకో నంబర్ చెప్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని పదేపదే అబద్ధాలు చెప్తున్నారని విమర్శించారు. రెండు లక్షల ఉద్యోగాల విషయంలో నిజాలు తేలడం కోసం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారన్న విషయం ప్రజలకు తెలియాలని, గత పదేండ్లలో తాము ఇచ్చిన ఉద్యోగాలు, 22 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నిజాలు ప్రజలకు తెలియాలని పేరొన్నారు.
రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని రాహుల్‌గాంధీ అశోక్‌నగర్ దాకా వచ్చి హామీ ఇచ్చారు. ఆయన మాటలు నమ్మి అనేకమంది
నిరుద్యోగ విద్యార్థులు తమ తలరాతలు మారుతాయని, మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయని భావించి, తమ కుటుంబాలతోపాటు ఇతరుల కుటుంబాలతోనూ కాంగ్రెస్‌కు ఓటు వేయించారు. కానీ, వారి ఆశలను ప్రభుత్వం అడియాసలు చేసింది. జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఈ శతాబ్దంలోనే అతిపెద్ద మోసం చేసింది.
-కేటీఆర్