హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): సీనియర్ మహిళా జర్నలిస్ట్ రేవతి అరెస్ట్ రాష్ట్రంలో కొనసాగుతున్న నిర్బంధ పాలనకు నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. బుధవారం ఎక్స్ వేదికగా ఆయన జర్నలిస్టులు రేవతి, తన్వీయాదవ్ అరెస్టును ఖండించారు. కాంగ్రెస్ సర్కారు తీరును ఒక రైతు వెల్లడిస్తున్న వీడియోను పోస్ట్ చేసిన జర్నలిస్టులను అరెస్ట్ చేయడం దారుణమని మండిపడ్డారు. ప్రజాపాలనలో మీడియాకు స్వేచ్ఛ అనేది లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. రాహుల్ గాంధీ చెబుతున్న రాజ్యాంగబద్ధమైన పాలన ఇదేనా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు మీడియా, సోషల్ మీడియా గొంతుకలపై చేస్తున్న ఈ దాడులు, అక్రమ కేసులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు.