KTR | హైదరాబాద్, నవంబర్ 13(నమస్తే తెలంగాణ) : కేసీఆర్ పాలనలో పదేండ్లు వెలుగుల్లో బతికిన తెలంగాణ, రేవంత్ పాలనలో చీకట్లు అలుముకున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. పాడి పంటలు, పసిడి సంపదలతో కళకళలాడిన పల్లెలు పోలీసు బూట్ల చప్పుళ్లతో అల్లాడుతున్నాయని ఎక్స్ వేదికగా ఆందోళన వ్యక్తంచేశారు. జేబునిండా డబ్బులతో దర్జాగా బతికిన రైతన్నను కాంగ్రెస్ సర్కారు బేడీలు వేసి ఠాణాల చుట్టూ తిప్పుతున్నదని దుయ్యబట్టారు. రైతుబంధు, రైతు బీమా, 24గంటల ఉచిత కరెంటు, సాగునీరు, పంటల కొనుగోళ్లు చేపట్టి రైతన్నకు కేసీఆర్ సర్కారు వెన్నెముకగా నిలిస్తే, రేవంత్ పాలనలో రైతన్న ఆగమవుతున్నాడని ఉదహరించారు.
‘11నెలల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ సబ్బండవర్గాలు సర్వం కోల్పోయాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొనుగోళ్లు లేక రైతులు తండ్లాడుతున్నారు. ఆడబిడ్డలు కల్యాణలక్ష్మి తులం బంగారం కోల్పోయారు. బాలింతలు అమ్మ ఒడి, కేసీఆర్ కిట్, గొల్ల, కురుమలు సబ్సిడీ గొర్రెలను, దళిత సోదరులు దళితబంధు, మత్స్య సోదరులు ఉచిత చేపపిల్లలను, చేనేత కార్మికులు బతుకమ్మ, క్రిస్మస్ కానుక, రంజాన్ తోఫా చీరల ఆర్డర్లు కోల్పోయి ఆర్థికంగా చితికిపోతున్నారు.’అని ఆవేదన వ్యక్తంచేశారు. విద్యార్థులు నాణ్యమైన భోజనాన్ని కోల్పోయారని, నిరుద్యోగులు కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోయారని గుర్తుచేశారు. ‘కంటివెలుగు ఖతమైంది. ఇంటి వెలుగు మాయమైంది. తెలంగాణ భవిష్యత్ చీకటైంది. జాగో తెలంగాణ’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు.
సీఎం రేవంత్రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి డిఫాక్టో సీఎంగా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. కొడంగల్లో వేలాది ఎకరాల భూములను సేకరిస్తామని తిరుపతి రెడ్డి ఏహోదాలో చెప్తున్నాడని ఆయన ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ‘ఏదేమైనా వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. అక్కడ తప్పకుండా ఇండస్ట్రీస్ వస్తయ్. ఫార్మా కంపెనీలే కాదు ఇంకా రకరకాల కంపెనీలు వస్తయ్. పారిశ్రామికంగా ముందుకే పోతం’ అని తిరుపతిరెడ్డి పేర్కొనడం దేనికి సంకేతమని పేర్కొన్నారు. తిరుపతిరెడ్డి డిఫాక్టో సీఎంగా వ్యవహరిస్తున్నాడని చెప్పటానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలని తెలిపారు.
కుటుంబ నియంత్రణ పాటించి జాతిహితం కోసం పాటుపడటమే దక్షిణాది రాష్ర్టాలు చేసిన పాపమా? అని కేటీఆర్ ప్రశ్నించారు. విజయవంతంగా కుటుంబ నియంత్రణ పాటించటంతో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనలో అన్యాయం అయ్యేలా కావడం దారుణమని టైమ్స్ ఇండియా ప్రచురించిన కథనాన్ని కేటీఆర్ ట్యాగ్ చేసి పైవిధంగా వ్యాఖ్యానించారు.
పాలమూరు ప్రజలు, రైతులు రేవంత్రెడ్డి పాలనలో పరేషాన్లో ఉంటే, అదే జిల్లాకు చెందిన మంత్రి జూపల్లి కృష్ణారావు ఇతర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు లండన్ పర్యటనలు చేస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గ రైతులు ఫార్మా క్లస్టర్లకు వ్యతిరేకంగా తమ భూమి కోసం అరెస్టులకు వెరవకుండా కొట్లాడుతుంటే ఆ జిల్లా మంత్రి, ఇతర నేతలు టూర్లలో ఊరేగడం సిగ్గుచేటని విమర్శించారు.