రాజన్న సిరిసిల్ల, జూలై 17 (నమస్తే తెలంగాణ) : “గోదావరి, కృష్ణా మిగులు జలాల్లో తెలంగాణ వాటా ఎంతనేది కేంద్రమే తేల్చాలి. దీనిపై బీజేపీ వైఖరి స్పష్టం చేయాలి. ప్రధానమంత్రి, జలవనరుల శాఖ మంత్రి నోరు విప్పాలి” అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో గురువారం సిరిసిల్ల నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై స్థానిక సంస్థల ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. గోదావరి జలాలు రేవంత్‌రెడ్డి అబ్బసొత్తు, తాత సొత్తుకాదని, ఇష్టమొచ్చినట్టు సంతర్పణ చేస్తామంటే తెలంగాణ ప్రజలు ఊరుకోబోరని హెచ్చరించారు. “ఎవరిని అడిగి కమిటీ వేశావ్? 30 రోజుల్లో ఇచ్చే నివేదిక ఎవరికి ఫైనల్. అది నీకు కావచ్చు. తెలంగాణ రైతులకెట్లయితది. నీకు అంత అభిమానం ఉంటే నీ ఇల్లు అమ్మి చంద్రబాబు విగ్రహం పెట్టుకో, మేం వద్దంటలేం” అని తేల్చి చెప్పారు. తెలంగాణ ప్రయోజనాలను శాశ్వతంగా చంద్రబాబుకు ధారాదత్తం చేస్తానంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఆంధ్రాలో ఉన్నది ప్రజలు, రైతులేనని, వారికి తాము వ్యతిరేకం కాదని, వారిపై ఎలాంటి దురుద్దేశం లేదని అన్నారు. వాటా తేల్చి, తెలంగాణ హక్కుల లెక్క చెప్పి, నీళ్లు కిందకు తీసుకెళ్తే తమకెలాంటి అభ్యంతరం లేదని ఉద్ఘాటించారు.
ఢిల్లీలో జరిగింది అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కాదని, ఇన్ఫార్మల్ మీటింగ్ అని సీఎం చెప్తున్న దాంట్లో నిజమెంత అని, దానికున్న చట్టబద్ధత, తీసుకునే నిర్ణయం, ఆమోదయోగ్యత ఏపాటిదో ప్రజలకు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. “హృదయం ఆక్రోశిస్తున్నది. 48 గంటల కిందట రేవంత్‌రెడ్డి చర్చించింది బనకచర్ల గురించే. నేను పోనంటూ మీడియాకు లీకులిచ్చింది ఆయనే. 24 గంటల్లో ఏం మారింది? ఎవరి నుంచి ఒత్తిడి వచ్చింది? ఏ కార్యక్రమం లేకుండా ఏపీ సీఎం చంద్రబాబును కలిసేందుకు ఢిల్లీ దాకా ఎందుకు వెళ్లారు?” అని నిలదీశారు. చంద్రబాబు ఏమాట మాట్లాడితే ఆమాట వింటున్న రేవంత్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగానికి సెక్రటరీగా పనిచేసి, తెలంగాణకు వ్యతిరేకంగా ఉత్తరాలు రాసిన ఆదిత్యనాథ్‌ను సాగునీటి రంగ సలహాదారుడిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఆ అధికారి చెప్పుచేతుల్లో ఉన్న కమిటీ తెలంగాణకు న్యాయం చేయాలని రిపోర్టు ఎలా ఇస్తుందని ప్రశ్నించారు.
“తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఉత్తరాలు రాసిన ఆదిత్యానాథ్‌ను సలహాదారుడిగా పెట్టుకున్నావంటేనే నీకు ఎంత తెలివి ఉందో అర్థమవుతుంది” అంటూ ఫైర్ అయ్యారు. వృథాగా పోతున్న గోదావరి నదీ జలాలను మాత్రమే వాడుకుంటున్నట్టు ఆంధ్రపదేశ్ ప్రభుత్వం చెప్తున్న మాటలు దురదృష్టకరమన్నారు. “అదే వాదనతో కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులు చేపట్టాం. ప్రతి ప్రాజెక్టుకు ఆటంకం కల్పించింది చంద్రబాబు కాదా?” అని నిలదీశారు. కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వద్దంటూ ఉత్తరాలు రాసింది ఆయనే కదా అని మండిపడ్డారు. బనకచర్ల పేరిట గోదావరి నీళ్లు పూర్తిస్థాయిలో బీడు భూములకు మళ్లకు ముందే, విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న మహానగరం హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాలు, పారిశ్రామిక అవసరాలు తీర్చకముందే తీసుకెళ్దామన్న కుట్రలను ప్రజలు తిప్పికొడతారని హెచ్చరించారు. తెలంగాణ ప్రజల హక్కులు కాపాడుకోడానికి కేసీఆర్ ఉన్న సంగతి మరిచిపోవద్దని హితవుపలికారు.
చంద్రబాబు ఏమాట మాట్లాడితే ఆమాట వింటున్న రేవంత్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగానికి సెక్రటరీగా పనిచేసి, తెలంగాణకు వ్యతిరేకంగా ఉత్తరాలు రాసిన ఆదిత్యనాథ్‌ను సాగునీటి రంగ సలహాదారుడిగా ఎలా పెట్టుకున్నారు?
-కేటీఆర్
“ఎవడిని అడిగి సంతకం పెడుతున్నవ్, ఎవడిని అడిగి కమిటీ వేశావ్, ఆ కమిటీ చెప్పిందే ఫైనల్ అని ఎట్లంటవ్. అసెంబ్లీ అమోదం ఉన్నదా? తెలంగాణ ప్రజల అమోదం ఉన్నదా? తెలంగాణ గ్రాడ్యుయేట్స్ అమోదం ఉన్నదా? కనీసం తెలంగాణలో అఖిలపక్ష సమావేశం పెట్టావా? దీనిపై సమాధానం ఇవ్వాలి” అని సీఎంను కేటీఆర్ ప్రశ్నించారు. ఇష్టానుసారంగా నిర్ణయం తీసుకుంటూ పోతే అడ్రస్ లేకుండా పోతావని హెచ్చరించారు. చంద్రబాబు కోవర్టుల పాలన నడుస్తున్నదంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్పిన మాట లు నిజమేనని తేలిపోయిందని పేర్కొన్నారు.
తెలంగాణకు గత పదకొండేండ్లుగా అన్యాయం చేస్తూ, అవరోధాలు కల్పించిన కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు మద్దతుపై ఆధారపడి నడుస్తూ ఆయన ఆడించినట్టు ఆడుతున్నదని కేటీఆర్ విమర్శించారు. రేవంత్‌రెడ్డి వేసే కమిటీ నెలరోజుల్లో రిపోర్టు ఇస్తుందని, కమిటీ ఏం చెప్తే అది చేస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. “కేంద్ర ప్రభుత్వం జుట్టు తమ చేతిలో ఉందని, బీజేపీ తాము చెప్పినట్టు ఆడుతుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆయన శిష్యుడైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చంద్రబాబు ఆడించినట్టు ఆడుతున్నాడని ఎద్దేవా చేశారు. గోదావరి, కృష్ణా బేసిన్లో సింహభాగం తెలంగాణలోనే ఉన్నాయని, ఇక్కడి అవసరాలు తీరకుండానే నీటిని తరలిస్తామంటే ఎలా ఊరుకుంటామని ప్రశ్నించారు. హైదరాబాద్, కరీంనగర్ లాంటి పట్టణాలకు నిరంతరం నీటి సరఫరా చేయాలన్నదే తమ లక్ష్యమన్నారు. హక్కు తేల్చకుండా ఇష్టం వచ్చినట్టు నీళ్లు గుంజుకు పోతామంటే కుదరదని హెచ్చరించారు. హైదారాబాద్‌లో ఉన్న గోదావరి రివర్, కేఆర్ఎంబీ బోర్డులు ఆంధ్రాకు తరలిపోతుంటే గొప్ప విజయమని సీఎం సిగ్గువిడిచి చెప్పుకుంటున్నాడని, సిగ్గుమాలి నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గన్న చందంగా ఆయన వ్యవహారం ఉందని మండి పడ్డారు.
మిగులు జలాల్లో తెలంగాణ వాటా ఎంతో కేంద్ర ప్రభుత్వం తేల్చకుండానే తీసుకెళ్తామనడంలో అర్థం లేదు. హక్కు తేల్చకుండా ఇష్టం వచ్చినట్టు నీళ్లు గుంజుకు పోతామంటే కుదరదు. హైదారాబాద్‌లో ఉన్న గోదావరి రివర్, కేఆర్ఎంబీ బోర్డులు ఆంధ్రాకు తరలిపోతుంటే గొప్ప విజయమని సీఎం సిగ్గువిడిచి చెప్పుకుంటున్నారు.
-కేటీఆర్
“ఆంధ్రా పత్రికల్లో చంద్రబాబు చెప్పిన వార్తా కథనాలే సాక్ష్యం. కేంద్రం మీటింగ్ పెట్టింది బనకచర్ల గురించేనని రాశాయి. కాదని బుకాయించడం ముఖ్యమంత్రికి తగునా, ఎజెండా నంబర్ వన్ బనకచర్ల అని బాబు చెప్పిన మాటలు కాదంటారా? ఆంధ్రా ఇరిగేషన్ మంత్రి రామానాయుడు స్వయంగా చెప్పిన మాటలు నిజం కాదా? బనకచర్ల గురించి అడిగితేనే కమిటీ వేశారని చెప్పారు. ఓటుకు నోటు కేసు ఇంకా ఉంది. ఆయన జుట్టు చేతిలో ఉందని చంద్రబాబు తెలంగాణ ప్రయోజనాలను శాశ్వతంగా దూరం చేసే విద్రోహానికి కుట్ర పన్నుతున్నారు” అని మండి పడ్డారు.
తెలంగాణ ప్రజలు, రైతాంగానికి ఉప్పుపాతరేసే ఆలోచన చేస్తున్న రేవంత్‌రెడ్డి కుట్రలను బీఆర్ఎస్ ని ర్దందంగా తిరస్కరిస్తుందని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో బీఆర్ఎస్ ఉద్యమిస్తుందని చెప్పారు. కేసీఆర్ మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పం దం చేసుకుని కాళేశ్వరం కట్టారని, దాంతోనే వరిధా న్యం ఉత్పత్తిలో12వ స్థానంలో ఉన్న తెలంగాణను నంబర్‌వన్ స్థానానికి తీసుకొచ్చారని గుర్తుచేశారు.
రేవంత్‌రెడ్డీ..ఎవరిని అడిగి కమిటీ వేశావ్? 30 రోజుల్లో ఇచ్చే నివేదిక ఎవరికి ఫైనల్. అది నీకు కావచ్చు. తెలంగాణ రైతులకెట్లయితది. నీకు అంత అభిమానం ఉంటే నీ ఇల్లు అమ్మి చంద్రబాబు విగ్రహం పెట్టుకో, మేం వద్దంటలేం. తెలంగాణ ప్రయోజనాలను శాశ్వతంగా చంద్రబాబుకు ధారాదత్తం చేస్తానంటే ఊరుకునేది లేదు.
బీసీ డిక్లరేషన్‌లో సంవత్సరానికి రూ.20 కోట్లు, అయిదేళ్లలో రూ.లక్ష కోట్ల బడ్జెట్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని కేటీఆర్ స్పష్టం చేశారు. “బీసీలకు 42 శాతం ప్రభుత్వ కాంట్రాక్టు ఇస్తామని చెప్పింది. మంత్రి పదవుల్లో వాటా ఇచ్చారా? ఓబీసీకి మంత్రిపదవి ఇచ్చారా? బీసీ సబ్ ప్లాన్ పెడతామని పెట్టారా? అది ఎంత మోసమో, ఇదీ అంతే మోసం” అని కేటీఆర్ ఫైర్ అయ్యారు. రేవంత్‌రెడ్డి ఓ కాగితం పారేస్తేనో, ఆర్డినెన్సు బీజేపీ గవర్నర్కిస్తేనో రిజర్వేషన్లు అమలు కావన్నారు. ఇది తాను చెప్పడం లేదని, జస్టిస్ ఈశ్వరయ్య, ఐఏఎస్ చిరంజీవి లాంటి పెద్దమనుషులు చెప్తున్న మాటలని స్పష్టం చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, సెస్ చైర్మన్ చిక్కాల రా మారావు, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్‌రా వు, బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనర్సింహారావు, తదితరులు పాల్గొన్నారు.
“ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేర దాకా తరిమి కొట్టాలి. ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ఉప్పుపాతరేస్తామన్న కాళోజీ మాటలను నిజం చేసే రోజులు వస్తాయి. వెంటనే నీ నిర్ణయాన్ని సవరించుకోవాలి” అని సీఎంకు కేటీఆర్ హితవు చెప్పారు. తెలంగాణ సమాజం బనకచర్లను ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నదని, అందుకు అనుగుణంగా కాంగ్రెస్ తనవైఖరి మార్చుకోకపోతే మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. బనకచర్ల ప్రతిపాదనను తెలంగాణలోని మేధావి, విద్యార్థులు, ఉద్యోగులు, అన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు. గతంలో కేసీఆర్ నాయకత్వంలో చేపట్టిన ప్రాజెక్టులకు, అడుగడుగునా అడ్డు పుల్లలు వేసింది కాంగ్రెస్, టీడీపీలేనని మండిపడ్డారు. మరోసారి తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కల్పిస్తామంటే చూస్తూ ఊరుకునేందుకు, బీఆర్ఎస్ సిద్ధంగా లేదని హెచ్చరించారు.
కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తెలంగాణలోని వ్యవసాయాన్ని పండుగలా చేశారని కేటీఆర్ పేర్కొన్నారు. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే నెంబర్‌వన్ స్థానంలో ఉంచిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. కేసీఆర్‌పై కోపంతో కన్నెపల్లి మోటార్లు ఆన్చెయ్యక పోవడమే కరువుకు కారణమని మండిపడ్డారు. సాగునీటి రంగంలో ముఖ్య మంత్రి సాధించిన విజయం ఇదేనా? అని నిలదీశారు. హక్కుల గురించి పోరాడితే రెచ్చగొట్టుడు ఎలా? అవుతుందని ప్రశ్నించారు. “చంద్రబాబు ఆదేశిస్తే 30 రోజుల్లో రిపోర్టు రావాలె. గోదావరి జలాలు కిందికురుకాలె. పొంగిపొర్లాలే. తెలంగాణ ఎండాలె, ఇదా నీ రీతి” అంటూ సీఎంపై ధ్వజమెత్తారు.