KT Rama Rao | హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): ఎన్నికలప్పుడు అశోక్‌నగర్ వెళ్లి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని పొంకణాలు కొట్టిన రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి ఇప్పుడెక్కడున్న రు? అని, ప్రజాపాలన అని ప్రగల్భాలు పలికి న రేవంత్‌రెడ్డికి గ్రూప్-1 అభ్యర్థులతో చర్చలు జరిపేందుకు భయమెందుకు? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. తె లంగాణ బిడ్డలకే కొలువులు దక్కాలని కేసీఆర్ అహోరాత్రులు కష్టపడి సాధించిన 95 శాతం స్థానిక రిజర్వేషన్లను రేవంత్‌రెడ్డి సర్కారు తొక్కిపెట్టే కుట్రచేస్తున్నదని కేటీఆర్ ధ్వజమెత్తారు. రాష్ట్రపతి ఆమోద ముద్ర కోసం సుదీర్ఘకాలం నిరీక్షించి చివరికి సాధించిన 95శాతం రిజర్వేషన్లను ఎత్తగొట్టేందుకే గ్రూప్-1 మెయిన్ అభ్యర్థులతో రేవంత్ సర్కారు చర్చలు జరపటం లేదని మండిపడ్డారు. గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళనపై స్పందిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరున్న అధ్యాపకులు, విషయ నిపుణులతో రూపొందించిన సిలబస్‌తో తెలుగు అకాడమీ పుస్తకాలు ముద్రిస్తే, అవి ప్రామాణికాలు కాకుండా వికీపిడియా ప్రామాణికంగా పేర్కొనటం అత్యంత దుర్మార్గమని చెప్పారు. గ్రూప్-1 అభ్యర్థుల ఫిటిషన్ ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్నదని, సోమవారం విచారణ ఉన్నదనే విషయం తెలిసికూడా ప్రభుత్వం మొండిగా ఎందుకు వ్యవహరిస్తున్నదో అర్థం కావడం లేదన్నారు. తమ పార్టీ నాయకులు సైతం విద్యార్థులకు సాయం అందించేందుకు సుప్రీం కోర్టుకు వెళ్లారని, న్యాయస్థానంపై తమకు విశ్వాసం ఉన్నదని, మధ్యప్రదేశ్‌లో జరిగిన ఉదంతాన్ని ఆయన గుర్తుచేశారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే సుప్రీం కోర్టు కలుగజేసుకోవటంతో పరీక్షను తిరిగి నిర్వహించిన దాఖలాలున్నాయని వివరించారు.
నిరసన తెలిపే హక్కులేదా?
శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారి గొంతు నొక్కుతున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అభ్యర్థులకు సంఘీభావంగా వెళ్లి న మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, బీఆర్ఎస్ సీనియర్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్, దాసోజు శ్రావణ్‌ను ఎందుకు అరెస్టు చేశారని నిప్పులు చెరిగారు. వారి అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు.
ప్రభుత్వం పడిపోతుందని భయమా?
‘సర్కార్ పడిపోతుందని సీఎం రేవంత్‌రెడ్డికి భయం పట్టుకున్నది.. అందుకే సీఎం దోస్త్ అయిన కేంద్రమంత్రి బండి సంజయ్‌ని సీఆర్పీఎఫ్ బలగాలను ఇచ్చి అశోక్‌నగర్‌కు పంపిండు’ అని కేటీఆర్ విమర్శించారు. అశోక్‌నగర్‌లో అభ్యర్థులకు బాసటగా ఉండేందుకు వస్తానని చెప్పగానే అక్కడ భారీగా పోలీసులను మోహరించడంతో ఆంతర్యమేమిటని భగ్గుమన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధితెచ్చుకొని అభ్యర్థులతో చర్చలు జరపాలని, వారి ఆవేదనను అర్థం చేసుకొని పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. చర్చలు ఎవరితో జరపాలనే విచక్షణ కూడా ప్రభుత్వానికి లేదని విమర్శించారు. ప్రభుత్వమే అభ్యర్థులతో చర్చలు జరిపితే వారికి పార్టీ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం రాదు కదా? అని ప్రశ్నించారు.
సీఎం శిఖండి రాజకీయాల్లో భాగంగానే బండి సంజయ్‌ని ముందు పెట్టిండు. బండితో ఊదు కాలదు..పీరీ లేవదు. బండి సంజయ్ ఏమైనా పోటీపరీక్షలు రాసిండా? అయనతో అయ్యేది పేపర్‌లీక్ తప్ప ఏదీ లేదు.
-కేటీఆర్
గ్రూప్-1 అభ్యర్థులకు ధైర్యం కోసం నేను వస్తానని చెప్పగానే అశోక్‌నగర్‌లో భారీగా పోలీసులను మోహరించడంలో ఆంతర్యమేంటి?
-కేటీఆర్