హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): రేవంత్‌రెడ్డి ధనదాహం వల్లే 8 మంది కార్మికులు ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదంలో చికుకున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. వారంతా ఇప్పటికీ సజీవంగా ఉన్నారో, లేదోననే ఆందోళన నెలకొన్నదని, ఈ ప్రమాదానికి పూర్తి బాధ్యత రేవంత్‌రెడ్డిదేనని ఆయన తేల్చిచెప్పారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై ఢిల్లీలో రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఏఎన్ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేటీఆర్ తీవ్రంగా తీవ్రంగా ఖండించారు.
తన అసమర్థతను, పాలనా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు రేవంత్‌రెడ్డి గత ప్రభుత్వంపై నెపం వేయజూస్తున్నారని మండిపడ్డారు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్టుగా రేవంత్ తీరు ఉన్నదని నిప్పులు చెరిగారు. జీఎస్ఐ, నిపుణత గల ఇంజనీరింగ్ సంస్థలను సంప్రదించకుండా, ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా, అవినీతి సొమ్ముల కోసం ఆగిపోయిన ప్రాజెక్టు పనులను పాత యంత్రాలతోనే ప్రారంభించారని విమర్శించారు.
సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించాల్సిందిపోయి సీఎం బ్లేమ్‌గేమ్ ఆడుతున్నారని మండిపడ్డారు. సీఎంగా దేవుడిచ్చిన అవకాశాన్ని వాడుకొని ప్రజలకు మంచి చేయాల్సింది పోయి కుటిల రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
పాలనను గాలికొదిలిన సీఎం రేవంత్‌రెడ్డి.. రాష్ట్రంలో జరుగుతున్న మరణాలపై ఇతరులను బద్నాం చేయాలని చూస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే జరిగిన మరణాలపై సమగ్ర దర్యాప్తు చేసి నిజానిజాలను నిగ్గుతేల్చాలని డిమాండ్ చేశారు. టైంపాస్ రాజకీయాలు చేయడం కాంగ్రెస్ సర్కార్‌కు అలవాటేనని విమర్శించారు. సందర్భం వచ్చిన ప్రతీసారి రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ అబద్ధాలు ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. గత ప్రభుత్వ పనితీరును పలుచన చేసేందుకే పదే పదే రూ.6,500 కోట్లను కేవలం వడ్డీల కింద చెల్లిస్తున్నామని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఉదహరించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై అవగాహన లేకే రేవంత్‌రెడ్డి ఇలా నోరోపారేసుకుంటున్నారని మండిపడ్డారు.