హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): తమకు రూ.18 వేల వేతనం ఇచ్చే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావును ఆశ వర్కర్లు కోరారు. ఈ మేరకు సంఘం అధ్యక్షురాలు రావుల సంతోష, ప్రధాన కార్యదర్శి బీ కరుణ తదితరులు గురువారం తెలంగాణభవన్‌లో కేటీఆర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా కనీసం వేతనం రూ.18 వేలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.5 లక్షలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఖాళీగా ఉన్న ఆశ వర్కర్ల పోస్టులను భర్తీ చేయాలని ఆ వినతిపత్రంలో కోరారు. ఆశ వర్కర్లకు హెల్త్‌కార్డులు అందించాలని, ఏఎన్ఎం, జీఎన్ఎం పోస్టులను అర్హత ఉన్న ఆశ వర్కర్లతో భర్తీ చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు.