Congress | అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఏ మనిషికైనా శ్రమించే స్వభావం ఉండాలి. కానీ మన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి దానికి భిన్నమైన స్వభావం ఉన్నది. శ్రమించడం ఎందుకనుకున్నారో ఏమో కానీ, ఆయన ఆ స్వభావాన్ని పక్కనపెట్టి భిన్నమైన బూతు మార్గాన్ని ఎంచుకున్నారు. ఆది నుంచీ ఆయన రాయలేని భాషలోనే బూతులు మాట్లాడుతూ విమర్శల పాలవుతుండటం తెలిసిందే. నోటికి ఏది వస్తే అది, ఎంత వస్తే అంత మాట్లాడుతూ విమర్శల పాలవడం ఆయనకు అలవాటు.
పెద్దవారిని తిడితే పెద్దగైపోతాననే భ్రమలో తేలియాడే ఆయన బుధవారం జరిగిన ‘ప్రజా ప్రభుత్వంలో కొలువుల పండుగ’ అనే కార్యక్రమంలో మరోసారి నోరు జారారు. అదుర్స్ సినిమాలో ఏదడిగినా ‘తెలియదు, మరిచిపోయా, గుర్తులేదు’ అని హీరో చెప్పినట్టుగా… కార్యక్రమం ఏదైనా మన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేసీఆర్‌ను తిట్టడమే పనిగా పెట్టుకుంటున్నారు.
అందులో భాగంగానే ఆయన స్ట్రేచర్, స్ట్రెచ్చర్, మార్చురీ అనే పదాలు వాడి పలుచనైపోయాడు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలపై అటు రాజకీయ వర్గాల్లో, ఇటు సోషల్ మీడియాలో నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఆయన వ్యాఖ్యలను నిరసిస్తూ మేధావులు, రాజకీయ నాయకులు ఇలా స్పందించారు.
మర్యాదకు ఉన్న అన్ని హద్దులు దాటేశాడు. వెంటనే సీఎం కుటుంబ సభ్యులు ఆయనను మెంటల్ హాస్పిటల్‌కు తీసుకువెళ్లాలి. లేదంటే తీవ్ర ఆందోళనలో ఉన్న ఆయన తన చుట్టుపక్కల ఉన్నవారిని కరవడం ఖాయం. ‘గెట్ వెల్‌సూన్.. చీప్ మినిస్టర్’.
– కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
పొలిటికల్ మెచ్యూరిటీ లేకనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘మార్చురీ’ వ్యాఖ్యలు చేశారు. పాలన చేతకాక ఆయన ‘పరనింద’నే పనిగా పెట్టుకున్నారు. గ్యారంటీల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు రేవంత్‌రెడ్డి గారడీ మాటలు మాట్లాడుతున్నాడు. ప్రతిపక్ష నేతలు ప్రజల పక్షాన పోరాడుతుంటే వాళ్ల మరణాన్ని కోరుకుంటున్న నీచబుద్ధి గల నాయకుడు రేవంత్. సీఎం రేవంత్ నిజాన్ని నమ్ముకోలేదు, నిందలనే నమ్ముకున్నాడు. కష్టాన్ని నమ్ముకోలేదు, కుతంత్రాలనే నమ్ముకున్నాడు. ఇకనైనా తాను ఉన్నది సీఎం కుర్చీలో అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.
– తన్నీరు హరీశ్‌రావు, మాజీ మంత్రి
ఉద్యమ నేత, ప్రజా నాయకుడు కేసీఆర్‌ను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడిన తీరు తీవ్ర ఆక్షేపణీయం. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. మానవత్వం లేని సీఎం తన వైఖరి మార్చుకోవాలి. ఇలాంటి దుశ్చర్యను తెలంగాణ సమాజం గమనిస్తున్నది. సమయం వచ్చినప్పుడు ఇంతకింత మీకు శాస్తి జరుగుతుంది.
– కల్వకుంట్ల కవిత, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు జుగుప్సాకరమైనవి. ముఖ్యమంత్రి హోదాను దిగజార్చే విధంగా రేవంత్ మాట్లాడుతున్నారు. పాలన చేయడమంటే మైకుల ముందు మాట్లాడినంత ఈజీ కాదు. తెలంగాణ కోసం మరణించడానికి సిద్ధపడిన కేసీఆర్ చావును కోరుకునే నీచబుద్ధి కలిగిన, కుసంస్కారి రేవంత్. ఆయనను త్వరలో ప్రజలు తరిమికొట్టడం ఖాయం.
– వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ మంత్రి
అధిష్ఠానం ఆదరించకపోవడంతో ప్రస్టేషన్లో ఉన్న రేవంత్ అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. ‘పెద్దవారిని తిడితే పెద్దగైపోతానని రేవంత్ భావిస్తున్నాడు. ప్రజాక్షేత్రంలో రేవంత్ ఎప్పుడో జీరో అయ్యాడు. కాంగ్రెస్‌ను, రేవంత్‌ను ప్రజలు వెంటిలేటర్‌పై పడుకోబెట్టారు. ఇక తులసి తీర్థం పోయడమే ఆలస్యం.
– సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మాజీ మంత్రి
రాజకీయాల్లో అకస్మాత్తు ప్రమాదానికి అద్దం లాంటివాడు రేవంత్ రెడ్డి. జనాన్ని కాకుండా నోరు, నోట్లను నమ్ముకొని నిలబడాలని విన్యాసాలు చేస్తున్న రాజకీయ నాయకుడిని నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో మొదటిసారి చూస్తున్న. సీఎం కుర్చీలో శకుని కూర్చున్నట్టున్నది. కేసీఆర్‌పై అకారణంగా నోరు పారేసుకుంటున్న రేవంత్ రాజకీయాల్లో పాత రౌడీ రాజనాల లాంటివాడు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఉజ్వల దివిటీ. ఆర్పడం సంగతి పక్కనపెడితే తాకాలనుకోవడమే మూర్ఖత్వం.
– గంగుల కమలాకర్, మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు అహంకారపూరితమైనవి. బాధ్యత గల ముఖ్యమంత్రి స్థానంలో ఉండి సంసారహీనంగా రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నాడు. తెలంగాణ సాధకుడు కేసీఆర్ చావును కోరుతూ.. కించపరిచేలా మాటలు మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డిని తెలంగాణ సమాజం ఎన్నటికీ క్షమించదు.
– వద్దిరాజు రవిచంద్ర, రాజ్యసభ సభ్యులు
ముఖ్యమంత్రి రేవంత్ బజారు మనిషిలా మాట్లాడుతున్నాడు. అహంకారంతో, అసభ్యంగా మాట్లాడటాన్ని తెలంగాణ సమా జం తీవ్రంగా పరిగణిస్తుంది. ఇచ్చిన హామీ లు పూర్తిచేయడం చేతకాక నోటికి వచ్చింది మాట్లాడుతున్నారు. ఈ దుష్టుని పాలన నుం చి తెలంగాణ ఎప్పుడు బయటపడుతుందా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. తెలంగాణ ప్రజల చేతుల్లో ఈ మూర్ఖపు ముఖ్యమంత్రికి తగిన శాస్తి జరగడం ఖాయం.
– పల్లా రాజేశ్వరరెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే
రాహుల్‌గాంధీ రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ ను దేశానికి మోడల్‌గా చూపెడదామని తన్లాడుతుంటే, రేవంత్‌రెడ్డి మాత్రం రాంగ్ చాయిస్‌గా బట్టబయలు చేస్తున్నాడు. కేసీఆర్ అంటే స్ట్రేచర్ కాదు, ఆయనే హిస్టరీ అనే సత్యం దేశానికి తెలుసు. హిస్టరీని స్ట్రెచర్ పైకో మార్చురీలోకో పంపుతామని ప్రగల్భాలు పలికే రేవంత్ లాంటివాళ్లు చేసిందేమీ లేదు. పవర్‌తో మాత్రమే పేరు సాధించాలనే ఉన్మాదాన్ని, ప్రజా ఆకాంక్షల సాధన పోరులో ప్రభవించే ఉన్నత స్థితికి వ్యత్యాసాన్ని ప్రజలు తేలిగ్గానే అర్థం చేసుకుంటారు. రేవంత్ రెడ్డికి ప్రజా ఛీత్కారంతో మతిభ్రమించి మహా మూర్ఖుడిగా మారిపోతున్నాడు. విలన్ నోట విజ్ఞత, రేవంత్ నోట సభ్యత ఆశించడం తెలంగాణ ఏనాడో మరిచిపోయింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి కాంగ్రెస్‌ను రేవంత్ రెడ్డి శ్మశానానికి మొయ్యడమే కాదు, పటిష్టమైన సమాధిలోకి చేర్చి తీరుతాడు.
– డాక్టర్ ఆంజనేయ గౌడ్, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్
కేసీఆర్‌పై రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఆక్షేపణీయమైనవి. కేసీఆర్ జపం చేయనిదే రేవంత్ రెడ్డికి పొద్దుగడవడం లేదు. అందుకే కార్యక్రమం ఏదైనా ఆయనను తల్చుకోకుం డా, ఆయనను తిట్టకుండా ఉండటం లేదు. ఢిల్లీ అధిష్ఠానం రాష్ర్టానికి మీనాక్షి నటరాజన్‌ను పంపడంతో తన ఆటలు సాగడం లేదు. ఈ ఫ్రస్టేషన్లో ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలియడం లేదు.
– మేడే రాజీవ్‌సాగర్, కార్పొరేషన్ మాజీ చైర్మన్
సీఎం రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విషయంలో ఈ రోజు ఉపయోగించిన భాష ముఖ్యమంత్రి స్థాయికి తగినది కాదు, సంస్కారవంతమైనది కాదు. ప్రజా జీవితంలో ఇటువంటి దుర్భాషలు వాడటమనేది మంచి వాతావరణాన్ని కలుషితం చేస్తుంది. సామాజిక మాధ్యమాల ద్వారా, భాష విషయంలో ఎటువంటి అసభ్య ధోరణులు వస్తున్నాయో, రాజకీయ విమర్శలు కూడా ఎంత దుర్మార్గంగా చేస్తున్నారో మనం చూస్తున్నాం. కాబట్టి అందరికీ ఆదర్శవంతంగా ఉండేలా రాజకీయ నాయకులు తమ నోటిని అదుపులో పెట్టుకోవాలి. కేసీఆర్ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి.
– కె.శ్రీనివాస్, ప్రముఖ పత్రికా సంపాదకులు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు కె.చంద్రశేఖర్ రావుపై చేసిన అసభ్యకరమైన, అతి జుగుప్సాకరమైన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. ఒక ముఖ్యమంత్రి తన పదవికి తగిన హుందాతనాన్ని కోల్పోయి, ప్రజాస్వామ్య విలువలను మంటగలిపేలా మాట్లాడటం అత్యంత విషాదం. ‘కేసీఆర్ స్ట్రెచర్ మీద పడుకొని, అటే మార్చురీకి పోతాడేమో’ అంటూ చేసిన నీచమైన వ్యాఖ్యలు కక్షసాధింపునకు, వ్యక్తిగత దూషణకు పరాకాష్ఠగా నిలుస్తాయి. ఒక ముఖ్యమంత్రిగా నాయకత్వ గుణాలు ప్రదర్శించాల్సిన చోట, అసభ్య భాషను ఉపయోగించడం రాష్ట్ర ప్రజలను అవమానించే చర్యగానే స్వీకరించాలి. కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన మహా మనీషి. ఆయన జీవితాన్ని తెలంగాణ ప్రజల సంక్షేమానికి అంకితం చేశారు. ఆయన ఆరోగ్యంపై, భవిష్యత్తుపై ఇలా హేయమైన వ్యాఖ్యలు చేయడం తెలంగాణ సమాజం తలదించుకునే విషయం. ప్రజాస్వామ్యంలో రాజకీయ విభేదాలు సహజమే. కానీ, వ్యక్తిగత దూషణలు చేయడం అనాగరిక చర్య. రేవంత్ తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని, కేసీఆర్‌కు క్షమాపణలు చెప్పాలి. ప్రజాస్వామ్యం లో అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం తగిన విధంగా చర్చలు జరగాలి కానీ, ఈ రకమైన అసభ్య, అనాగరిక మాటలకు చోటుండకూడదు.
– దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్సీ, భారత రాష్ట్ర సమితి
‘భాష’ అనే గొప్ప నిపుణత మానవజాతికి మాత్రమే ఉన్నది. అయితే దానిని వాడే పద్ధతి బట్టి ఆ మనిషి భావ సంస్కారం స్పష్టంగా తెలుస్తుంది. అసూయ శృతి మించి అక్కసుగా మారితే మనిషి భాష తెలిసిన పశువవుతాడు. రాజకీయంగా ఎదగ చేతకాని మరుగుజ్జు నాయకుడైన ముఖ్యమంత్రి రేవంత్ మాటలు దీనికి తార్కాణంగా నిలుస్తాయి. ఒకరి కంటే గొప్పవారు కావాలంటే, వారికంటే గొప్ప పనులు చేయాలి కానీ, వెకిలిమాటలు, వెర్రిమాటలు మాట్లాడితే గొప్పతనం రాదు. దీన్ని ఇంగ్లీష్‌లో ‘వర్డ్ సలాడ్’ అంటారు. ఇలా మాట్లాడే మనిషికి ఈ కింది లక్షణాలుంటాయి. తార్కికంగా లేకుండా అడ్డదిడ్డంగా నిందలేయటం; తిప్పి తిప్పి ఒకటే విషయం చెప్పటం; పదే పదే అబద్ధాలు ప్రచారం చేయటానికి ప్రయత్నించటం, భాషించవలసిన విషయానికి సంబంధం లేకపోయినా తనకు ఇష్టం లేనివారి ప్రసక్తి తీసుకువచ్చి నీచమైన భాషలో నిందించటం, అసందర్భ ప్రేలాపన, తన అసూయను, అక్కసును, ఎదుటివారి స్థాయి అందుకోలేని నిస్సహాయతను వ్యక్తిగత దూషణ చేసి తృప్తిపడటం. ఈ పిచ్చితనం శిఖరస్థాయి తనకిష్టం లేని వారి మరణం కోరుకోవటం. ఈ స్థితికి చేరిన మనిషి సాధారణ మానసిక స్థాయికి రావటం కష్టమని మనో వైజ్ఞానిక శాస్త్రజ్ఞులు విశ్వసిస్తారు.
– కనకదుర్గ దంటు, రాజకీయ విశ్లేషకులు
కేసీఆర్ సంస్కారానికి రేవంత్ సంస్కారానికి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉన్నది. రాహుల్ గాంధీ పుట్టుక గురించి అసోం సీఎం హిమంత బిశ్వశర్మ అవాకులు చెవాకులు పేలితే అలా అనడం తప్పని ఖండించిన సంస్కారం కేసీఆర్‌ది. కానీ, ఇప్పుడు కేసీఆర్‌పై రేవంత్ చేసిన మార్చురీ వ్యాఖ్య పతనానికి పరాకాష్ఠ. పతనం అంటే ఏమిటో రేవంత్‌ను చూసి తెలుసుకోవచ్చు. ఆ వ్యాఖ్యలపై మిగతా కాంగ్రెస్ నాయకుల మౌనం వారి అంగీకారాన్ని తెలియజేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ మొత్తంగా దీనిపై జవాబు చెప్పాలి. ఇలాంటి మాటలు మాట్లాడటానికేనా కేసీఆర్ సభకు రావాలని యాగీ చేసింది? ఇప్పుడు ఆయన రాగానే దడుపు పుట్టిందేమో.. రాకుండా చేద్దామనే దురుద్దేశంతో రేవంత్ నీచాతి నీచంగా మాట్లాడుతున్నట్టున్నారు.
– డి.పాపారావు, రాజకీయ, ఆర్థికరంగ నిపుణులు
నీచత్వానికి వికృత రూపమే రేవంత్‌రెడ్డి. అన్ని సభ్యతలను వదిలేసిన కుసంస్కారి. సీఎం పదవి కోసం ఆయన తెంపిన గట్లు, తిట్టిన తిట్లు, దిగజారిన మెట్లు లెక్కకు మించి! సొంత పార్టీ ఎంపీ శశిథరూర్‌ను గాడిద అని రేవంత్ తూలనాడితే ఖండించిన విలువలున్న నాయకత్వం బీఆర్ఎస్ది. రాజకీయాల్లో విమర్శ లోతుగా, సాధికారికంగా ఉండాలి. అసహ్యంగా, అసభ్యంగా కాదు. ‘అసెంబ్లీలో దూషణలకు పాల్పడొద్దు, ఆధారాల సహితంగా ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడండి’ అని తమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఉద్బోధ చేసిన సంస్కారి కేసీఆర్. తెలంగాణ సంస్కర్త కేసీఆర్. అలాంటి మహా నాయకుడిపై రేవంత్ వదురుబోతుతనాన్ని రాహుల్ సహించినా, తెలంగాణ క్షమించదు. కాంగ్రెస్ శవపేటికకు చివరి మేకు రేవంత్! రాజకీయ నాయకులు అంటేనే వెగటు భావనతో ఉన్న కొత్త తరం పూర్తిగా ఆశలు కోల్పోకముందే రేవంత్‌ను గద్దె దింపి కాంగ్రెస్ పార్టీ తమ పరువు కాపాడుకోవాలి.
– శ్రీశైల్‌రెడ్డి పంజుగుల, రాజకీయ విశ్లేషకులు
సీఎం స్టేచర్ ఉన్నదని విర్రవీగుతున్నది రేవంత్ రెడ్డి తప్ప కేసీఆర్ కాదు. త్వరలో రాజకీయ మార్చురీకి పోయేది కూడా రేవంత్ మాత్రమే. ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి కేసీఆర్ ఏడాది నుంచి రేవంత్ రెడ్డి ఎంత రెచ్చగొట్టినా, తన హోదాను మరిచి వీధి రౌడీలా అసభ్య పదజాలంతో దూషించినా కేసీఆర్ సహిస్తూ ఉన్నారంటే అది ఆయన బలహీనత కాదు, ఆయన రాజకీయ పరిపక్వత, హుందాతనానికి నిదర్శనం. శిశుపాలుని వంద తప్పులు లెక్కించిన తర్వాతే కృష్ణుని చేతిలో కుక్కచావు చచ్చాడు. తెలంగాణ ప్రజలు ఓ అసమర్థునికి పట్టం కట్టారు. పిచ్చికూతలు కూస్తే ప్రజలు ఊరుకోరు. రేవంత్ రవీంద్ర భారతిలో మాట్లాడుతూ… తన దగ్గర డబ్బుల్లేవని చెప్పడం ఆయన చేతగానితనానికి నిదర్శనం. కేసీఆర్ తన పదేండ్ల పాలనలో ఏ రాష్ట్రంలో స్వాతంత్య్రానంతర భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికీ సాధ్యపడని ఆర్థిక ప్రగతిని సాధించి తెలంగాణ ఆదాయాన్ని మూడు రెట్లు పెంచారు. ఆ ప్రగతిని గమనించే వేలాది పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టారు. రేవంత్ గత 15 నెలల పాలనలో తెలంగాణను పదేండ్లు వెనక్కి నెట్టారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తన అపరిపక్వత కారణంగా దిగజార్చి కేసీఆర్‌పై నెపాన్ని మోపి తప్పించుకోవాలనుకుంటున్నాడు. చేతకాని ముఖ్యమంత్రులను గద్దె దించడమే ఇప్పటివరకూ చూశాం కానీ, నమ్మకద్రోహం చేసిన ముఖ్యమంత్రిని తరిమే రోజు ఇంకెంతో దూరం లేదు.
– వి.ప్రకాశ్, రాజకీయ విశ్లేషకులు
రాజకీయ నాయకులు, అందులోనూ అధికారంలో ఉన్నవారు ఆచి తూచి, సంయమనంతో మాట్లాడాలె. ఎదుటి పక్షం తప్పులను ఎత్తిచూపి, ప్రజలముందు ఎండగట్టవచ్చు. సైద్ధాంతికంగా, హేతుబద్ధంగా తమ వాదనలను వినిపించవచ్చు. అధికారంలో ఉన్నవారికి తమ కార్యాచరణ ద్వారా ప్రజలను మెప్పించే అవకాశం కూడా ఉంటుంది. ఇవన్నీ వదిలి మొరటు మాటలు, జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేయడం ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవారికి తగదు. ఇది తెలంగాణ సంస్కృతికి, ప్రజాస్వామిక విలువలకు విరుద్ధం. ముఖ్యమంత్రిగా ఉన్నవారు తోటివారికి, రేపటి తరానికి ఆదర్శంగా, హుందాగా వ్యవహరించాలె. ప్రతిపక్ష ప్రముఖుడిపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం దివాలాకోరు రాజకీయాన్ని సూచిస్తున్నది.
– పరాంకుశం వేణుగోపాలస్వామి, సీనియర్ జర్నలిస్టు
సోనియా గాంధీ గురించి రాజీవ్ గాంధీ పుట్టుక గురించి బీజేపీ నాయకులు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తే అప్పుడు సీఎంగా ఉన్న కేసీఆర్ కాంగ్రెస్ తమ ప్రత్యర్థి పార్టీ అయినా బీజేపీ మాటలను కాంగ్రెస్ కన్నా ముందు ఖండించారు. రాజకీయాల్లో కేసీఆర్ చూపిన సంస్కారం అది. కానీ, అదే కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి సంస్కారం మరిచి బూతులను నమ్ముకొని రాజకీయం చేస్తున్నారు. ఫ్రస్టేషన్లో తానేం మాట్లాడుతున్నారో తనకే తెలియదనిపిస్తున్నది. మార్చురీకి వెళ్తారని సంస్కారం లేకుండా రాజకీయ స్పృహ లేకుండా మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డికి రాజకీయాల్లో ఇంతకుమించి భవిష్యత్తు లేదు. కానీ, కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేకుండా చేసే విధంగా రేవంత్ మాటలుంటున్నాయి.
– బుద్దా మురళి, రాజకీయ విశ్లేషకులు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేదిక ఎక్కగానే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వ్యక్తిగత దూషణలకు పాల్పడటం అలవాటైపోయింది. రాజకీయ స్పర్థాల్లో ఎన్నైనా విమర్శలు చేసుకోవచ్చు. అవి అంశప్రధానంగా సాగాలి. కానీ, ఏ వ్యక్తిని అగౌరవపరిచేలా ఉండకూడదు. అసెంబ్లీ ఫలితాల సమయంలో కేసీఆర్ ఇంట్లో జారిపడటం ఓ బాధాకర సంఘటన. జరిగే ప్రమాదాలు చెప్పిరావు. ఏడాది దాటినా, ఆయన ఆరోగ్యం కుదుటపడినా దాన్ని ప్రస్తావిస్తూ రేవంత్ గేలి చేస్తూ మాట్లాడటం అసమంజసం. ఇప్పుడు కొత్తగా ‘స్ట్రెచర్‌పైకి వచ్చిన మీరు ఇలాగే చేస్తే మార్చురీకి పంపిస్తారు’ అని అనడం పూర్తిగా గర్హనీయం. ఈ తొందరపాటు మాటలకు రేవంత్ బహిరంగ క్షమాపణ చెప్పాలని తెలంగాణ ప్రజలు కోరాల్సిన అవసరం ఉన్నది.
– బద్రి నర్సన్, రాజకీయ విశ్లేషకులు
ప్రజా జీవితంలో ఇటువంటి భాష ఏ మాత్రం సహేతుకం కాదు. రాజకీయ వైరాన్ని రాజకీయంగానే ఎదుర్కోవాలి గానీ, వ్యక్తిగత వైషమ్యంగా మార్చకూడదు. దాన్ని ఎవరూ హర్షించరు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వారిలా మాట్లాడటం శోచనీయం. 10 మంది ముందు మాట్లాడేటప్పుడు ఆవేశం కన్నా ఆలోచన మిన్న అన్న విషయాన్ని ముఖ్యంగా ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు గమనించాలి.
– గుమ్మడిదల రంగారావు, విశ్రాంత డైరెక్టర్, లోక్‌సభ సచివాలయం