జయశంకర్ భూపాలపల్లి, జూలై 4 (నమస్తే తెలంగాణ)/మహదేవపూర్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కన్నెపల్లికి ఆదివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన కన్నెపల్లి పంప్‌హౌస్‌తోపాటు వృథాగా పోతున్న గోదావరి జలాలను బీఆర్ఎస్ బృందంతో కలిసి పరిశీలించనున్నారు. వరంగల్, కరీంనగర్, నల్లగొండ ఉమ్మడి జిల్లాలకు చెందిన పార్టీ సీనియర్ నాయకులు ఆయన వెంట రానున్నారు. ఈ మేరకు శనివారం భూపాలపల్లి, మంథని మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, పుట్ట మధు వివరాలు వెల్లడించారు. ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరనున్న కేటీఆర్, మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో కన్నెపల్లికి చేరుకొని పంప్‌హౌస్‌తోపాటు వృథాగా సముద్రంలో కలుస్తున్న వేలాది క్యూసెక్కుల గోదావరి జలాలను పరిశీలిస్తారని తెలిపారు. అనంతరం 2 నుంచి 3 గంటల మధ్య మీడియా సమావేశంలో పాల్గొంటారని పేర్కొన్నారు.
కేటీఆర్ పర్యటన నేపథ్యంలో శనివారం మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడిగడ్డ బరాజ్‌తో సంబంధం లేకుండా కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోసే అవకాశమున్నప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకే కేటీఆర్ వస్తున్నారని తెలిపారు. రెండు పిల్లర్లు దెబ్బతిన్నాయన్న సాకుతో రెండున్నరేండ్లుగా మేడిగడ్డ బరాజ్‌లో నీటిని నిల్వ చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తున్నదని ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రోజూ టీఎంసీ నీరు వృథాగా పోతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. సీఎం, స్థానిక ఎమ్మెల్యే ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని విమర్శించారు. ప్రాజెక్టుల్లో నీరు నిల్వ చేయకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయి రైతులు ఇబ్బందులు ఎదురొంటున్నారని పేర్కొన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే కేటీఆర్ కన్నెపల్లి పంప్‌హౌస్‌ను సందర్శిస్తున్నారని, నియోజకవర్గంలోని బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై ఆయన పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.