AUS vs BAN : ఇరవై మూడేళ్ల తర్వాత ఆస్ట్రేలియాలో తొలి టెస్టు ఆడుతున్న బంగ్లాదేశ్ (Bangladesh) గెలుపు వాకిట నిలిచింది. గతంలో పలుమార్లు ఆసీస్ చేతిలో ఓడిన బంగ్లా చరిత్రాత్మక విజయానికి చేరువైంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లతో ఆతిథ్య జట్టు నడ్డివిరిచిన హసన్ మహమూద్(6-55).. రెండో ఇన్నింగ్స్‌లోనూ దెబ్బకొట్టాడు. ఫలితంగా.. నాలుగు వికెట్లు కోల్పోయిన కంగారూ టీమ్ ఓటమి అంచున నిలిచింది. చేతిలో ఆరు వికెట్లున్నా.. జోరుమీదున్న బంగ్లా పేసర్లను కాచుకొని మ్యాచ్ కాపాడుకోవడం కమిన్స్ బృందానికి కష్టమైన పనే.
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియాకు చుక్కలు చూపిస్తోంది బంగ్లాదేశ్. స్వదేశంలో ప్రత్యర్థులను భయపెట్టే ఆసీస్‌ను ఓటమి అంచున నిలిపింది బంగ్లా. డార్విన్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 198కే ఆలౌటైన ఆసీస్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆరు వికెట్లతో మొదటి ఇన్నింగ్స్‌లోనే ఆతిథ్య జట్టును పడగొట్టిన హసన్ మహమూద్(2-33).. మరోసారి చెలరేగగా ఓపెనర్లు జేక్ వెథెరాల్డ్(0), ట్రావిస్ హెడ్(17)లు డగౌట్ చేరారు.
Two strikes before tea for Hasan Mahmud and Bangladesh! pic.twitter.com/jSKS54obLG
— Cricinfo (@cricinfo) August 15, 2026
క్రీజులో కుదురుకున్నట్టే అనిపించిన మార్నస్ లబూషేన్(31)ను తైజుల్ ఇస్లాం బౌల్డ్ చేయగా.. ఫామ్‌లో ఉన్న స్టీవ్ స్మిత్(44)ను మిరాజ్ వెనక్కి పంపాడు. ఇంకేముంది.. చూస్తుండగానే 122 వద్ద కంగారూ టీమ్ నాలుగో వికెట్ కోల్పోయింది. ఆఖర్లో కామెరూన్ గ్రీన్(43 నాటౌట్), అలెక్స్ క్యారీ(19 నాటౌట్) కాస్త పట్టుదల ప్రదర్శించి వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. దాంతో, మూడో రోజు ఆట ముగిసేసరికి తో ఉన్న ఆసీస్ ఇంకా 67 పరుగులు వెనకే ఉంది.
Travis Head set the stumps back after being dismissed 👀
(via @cricketcomau) pic.twitter.com/q3FiJWAy6n
— Cricinfo (@cricinfo) August 15, 2026
గతంలో రెండుసార్లు బంగ్లాదేశ్‌ను ఇన్నింగ్స్ తేడాతో ఓడించిన ఆస్ట్రేలియా ఈసారి తడబడుతోంది. 23 ఏళ్ల తర్వాత కంగారూల గడ్డపై టెస్టు ఆడుతున్న బంగ్లాదేశ్ ఆల్‌రౌండ్ షోతో డార్విన్ టెస్టులో పట్టుబిగించింది. తొలుత హసన్ మహమూద్(6-55) ఆరు వికెట్లతో ఆసీస్ నడ్డివిరవగా.. ఓపెనర్ తంజిద్ హసన్ తమీమ్(101) శతకంతో కదం తొక్కాడు. స్టార్క్, కమిన్స్, హేజిల్‌వుడ్.. వంటి దిగ్గజ పేసర్లను సమర్ధంగా ఎదుర్కొన్న ఈ కుర్రాడు.. కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో(84)తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు.
తంజిద్ (101) శతక సంబురం

టీ సెషన్ తర్వాత లిటన్ దాస్(0)ను స్టార్క్, ముష్ఫికర్ రహీం(36)ను కమిన్స్ పెవిలియన్ పంపారు. వెంటవెంటనే రెండు వికెట్లు పడినా.. మెహిదీ హసన్ మిరాజ్(65), హసన్ మహమూద్(14)లు పట్టుదలగా ఆడారు. దాంతో, మూడో రోజు ఓవర్‌నైట్ స్కోర్ 351/6తో ఆట కొనసాగించిన బంగ్లాదేశ్.. 426 పరుగులకు ఆలౌటైంది. పర్యాటక జట్టుకు 226 రన్స్ ఆధిక్యం లభించగా.. ఆసీస్ పేసర్ హేజిల్‌వుడ్ ఆరు వికెట్లతో రాణించాడు.