Jammu and Kashmir : జమ్మూ కాశ్మీర్లో ఘోర ప్రమాదం జరిగింది. అతివేగం కారణంగా ఒక స్కార్పియో అదుపుతప్పి నదిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటన జమ్మూ కాశ్మీర్‌లోని, కిష్ట్వార్ జిల్లా, దంగ్దారు సమీపంలోని యెన్వాన్ పరిధిలో శనివారం ఉదయం 10.30 గంటలకు జరిగింది. దచ్ఛాన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హరియాణా రిజిష్టర్డ్ మహీంద్రా స్కార్పియో వాహనం శనివారం ఉదయం కిష్ట్వార్ జిల్లాలోని దంగ్దారు నుంచి సౌందర్ పట్టణానికి వెళ్తోంది.
ఈ సమయంలో యెన్వాన దగ్గరకు రాగానే అతివేగం కారణంగా స్కార్పియో జారి, అదుపుతప్పింది. ఈ సమయంలో డ్రైవర్ వాహనాన్ని నియంత్రించలేకపోయాడు. దీంతో వాహనం నేరుగా వెళ్లి రోడ్డు పక్కన ప్రవహిస్తున్న చీనాబ్ నదిలోకి పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు, దచ్చాన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు ప్రారంభించారు. బాధితుల్ని రక్షించేందుకు ప్రయత్నించారు. వాలంటీర్లు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో వాహనంలోని కొందరిని రక్షించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో బాధితులకు గాయాలయ్యాయి. వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. మరణించిన ఐదుగురికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
Pained by the loss of five lives in a tragic road accident in Dachhan, Kishtwar. My heartfelt condolences to the bereaved families. Have directed the District Administration and senior officials to ensure immediate assistance is provided to those affected.
— Manoj Sinha (@manojsinha_) August 15, 2026
మృతదేహాల వెలికితీత కొనసాగుతోంది. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని స్థానిక అధికారులు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర మంత్రి, ఉధంపూర్ ఎంపీ జితేంద్ర సింగ్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఈ మేరకు ఎల్జీ సిన్హా ఎక్స్‌లో స్పందించారు. బాధితులకు తక్షణ సహాయం అందించాల్సిందిగా జిల్లా అధికారులను ఆదేశించినట్లు సిన్హా వివరించారు. మరోవైపు ఈ ఘటనపై కిష్ట్వార్ జిల్లా డిప్యూటీ కమిషనర్ పంకజ్ కుమార్‌తో మాట్లాడినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. సహాయక చర్యలపై ఆదేశించినట్లు తెలిపారు.