
హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కృష్ణా నదీ యాజమాన్య (KRMB) బోర్డు శుక్రవారం లేఖ రాసింది. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల వివరాలను ఆయా రాష్ట్రాల ఈఎన్సీలను కోరింది. ఔట్లెట్ల నీటి ప్రవాహాలు, గేట్ల నిర్వహణ విధానం వివరాలను అందించాలని సూచించింది. ఫ్లడ్ హైడ్రోగ్రాఫ్, రిజర్వాయర్ రూటింగ్ స్టడీ వివరాలు, 30 సంవత్సరాల డిమాండ్ వివరాలను ఇవ్వాలని లేఖలో పేర్కొన్నది.
శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టుల వివరాలు తక్షణ ఇవ్వాలన్న బోర్డు, వీలైనంత త్వరగా సమాచారం అందించాలని కోరింది. నాగార్జున సాగర్, శ్రీశైలం జలాశయాల్లో ఆయా రాష్టాలు ఇప్పటి వరకు వినియోగించుకున్న నీటి లెక్కల వివరాలు తెలియజేయాలని స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా.. ఈ నెల 17న గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉప సంఘం భేటీ హైదరాబాద్ జలసౌధలో జరుగనున్నది. గోదావరి బోర్డు ఉప సంఘం భేటీలో దేవాదుల, తొర్రిగెడ్డ ఎత్తిపోతల పంప్‌హౌస్, చాగలనాడు ఎత్తిపోతలు, కాకతీయ కాల్వ క్రాస్ రెగ్యులేటర్ అంశంపై చర్చ జరుగనున్నది.