KRMB | వేసవిలో నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ, ఏపీలకు కృష్ణా జలాలను విడుదల చేయడానికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) నిర్ణయించింది. శ్రీశైలం, సాగర్ జలాశయాల నుంచి నీటిని విడుదల చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. తాగునీటి అవసరాల కోసం ఏపీకి నాలుగు టీఎంసీలు, తెలంగాణకు 10.26 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నట్లు కేఆర్ఎంబీ పేర్కొంది. ఈ నీటి వినియోగానికి సంబంధించి ప్రాజెక్టుల్లో నీటిమట్టాలపై సైతం బోర్డు క్లారిటీ ఇచ్చింది. శ్రీశైలం జలాశయంలో 800 అడుగుల వరకు, నాగార్జున సాగర్ ప్రాజెక్టులో 505 అడుగుల వరకు నీటిని వాడుకోవడానికి మాత్రమే అనుమతులు ఇచ్చింది. ఏపీ అవసరాల కోసం నాగార్జున సాగర్ కుడి కాల్వ ద్వారా రోజుకు 5,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కేఆర్ఎంబీ చెప్పింది. శ్రీశైలంలో నీటి నిల్వ విషయంలో బోర్డు కీలక సూచనలు చేసింది. జులై నెలాఖరు వరకు శ్రీశైలం ప్రాజెక్టులో కనీసం 800 అడుగుల నీటిమట్టాన్ని కొనసాగించాలని ఉత్తర్వుల్లో ఆదేశించింది.