హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): కృష్ణా జలాల నుంచి తాగునీటి అవసరాల కోసం తెలంగాణకు 10.26 టీఎంసీలు, ఏపీకి 4టీఎంసీలను విడుదల చేయాలని కేఆర్ఎంబీ (కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు) నిర్ణయించింది. ఈ మేరకు గురువారం నీటి విడుదల ఉత్తర్వులు జారీచేసింది. జూన్ 31 వరకు తాగునీటి అవసరాలపై ఇరు రాష్ర్టాలు ఇటీవల బోర్డుకు ప్రతిపాదనలు పంపాయి. నీటి కేటాయింపులపై త్రిసభ్య కమిటీ సమావేశాన్ని సైతం నిర్వహించాయి.
పది టీఎంసీల చొప్పున విడుదల చేయాలని తెలంగాణ, ఏపీ కూడా కోరాయి. ఇదిలా ఉంటే శ్రీశైలం, సాగర్లో కలిపి మొత్తంగా 21.21టీఎంసీల జలాలు వినియోగానికి అందుబాటులో ఉన్నాయని, అందులో రవాణా, నీటి అవిరి నష్టాలు 4.24 టీఎంసీలు ఉంటాయని, నికరంగా 16.97టీఎంసీలే మిగులుతాయని బోర్డు తేల్చింది.
అందులో 10.26 టీఎంసీలను తెలంగాణకు, నాలుగు టీఎంసీలను ఏపీకి తాగునీటి అవసరాలకు విడుదల చేయాలని నిర్ణయించి ఆ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. ఎన్ఎస్పీ రైట్ కెనాల్ ద్వారా రోజుకు 5500 క్యూసెక్కుల చొప్పున ఏపీకి విడుదల చేయాలని సూచించింది. అదేవిధంగా నీటి విడుదల కోసం సంబంధిత అధికారులను డ్యామ్ల మీదకు అనుమతించాలని సీఆర్పీఎఫ్ భద్రతా బలగాలకు ఉత్తర్వులు జారీ చేసింది.