హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): సాగర్ కుడి కాలువ నుంచి నీటిని వినియోగించుకొనేందుకు అనుమతి ఇవ్వాలని ఏపీ చేసిన ప్రతిపాదనలపై స్పందించాలని తెలంగాణను కేఆర్ఎంబీ కోరింది. ఏపీ వాదనలపై తెలంగాణ అభిప్రాయం ఏమిటో చెప్పాలని సూచించింది. తెలంగాణ ఈఎన్సీకి కేఆర్ఎంబీ లేఖ రాసింది. ఏపీ సర్కార్ ఇప్పటికే కోటాకు మించి కృష్ణా జలాలు వినియోగించుకొన్నది.
ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఇక నుంచి ఉమ్మడి రిజర్వాయర్ల నుంచి జలాలను తరలించకుండా ఏపీని నిలువరించాలని కోరుతూ తెలంగాణ బోర్డుకు ఫిర్యాదు చేసింది. తెలంగాణ వాదనలను ఏపీ ఖండించింది. ఏపీ వినియోగించుకున్న 690 టీఎంసీల జలాల్లో 215 టీఎంసీలు మినహాయించాలని కోరింది. వరదల సమయంలోనే ఆ జలాలను మళ్లించినట్టు పేర్కొన్నది. అదీగాక వేసవి తాగు, సాగు నీటి అవసరాలకు ప్రస్తుతం 73టీఎంసీలు అవసరమని తెలిపింది. వీటిపై అభిప్రాయం చెప్పాలని తెలంగాణకు లేఖ రాసింది.