హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : ఈ ఏడాది నీటివాటాను ఖరారు చేయకుండానే నేరుగా నీటి వినియోగాలపైనే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) దృష్టి పెట్టింది. అదేమంటే ప్రాజెక్టులకు సరిపడా నీళ్లు రాలేదని బుకాయిస్తున్నది. వాటాల ఖరారు కోసం బోర్డు మీటింగ్ కాకుండా నేరుగా త్రీమెన్ కమిటీని ఏర్పాటు చేసింది. భేటీ బోర్డు నేతృత్వంలో ఇరు రాష్ర్టాలు శుక్రవారం మరోసారి భేటీ కానున్నాయి. రాష్ట్ర విభజన సందర్భంగా రెండు రాష్ర్టాలు కేవలం ఏడాది కాలం కోసం తాత్కాలిక ఒప్పందం చేసుకున్నాయి. ఉమ్మడి రిజర్వాయర్ల నుంచి కృష్ణా జలాలను ఏపీ 66 శాతం, తెలంగాణ 34 శాతం వినియోగించుకోవాలని ఒప్పందం చేసుకున్నాయి. ఆ తరువాత ప్రతి నీటి సంవత్సరం (జూన్1 నుంచి మే 31 వరకు) ఉమ్మడి రిజర్వాయర్ల మధ్య నీటి వినియోగాలకు సంబంధించి ఆ తాత్కాలిక ఒప్పందాన్ని మరో ఏడాదికి పొడిగించుకుంటూ వచ్చాయి.
ఇందుకోసం పూర్తిస్థాయి బోర్డు సమావేశాన్ని నిర్వహించి, అందులో చర్చించి కేవలం తాగునీటి సంవత్సరానికి సంబంధించి మాత్రమే ఒప్పందం చేసుకోవడం పరిపాటిగా కొనసాగుతున్నది. అవార్డు తేలేవరకు 50:50 నిష్పత్తిలో జలాలను వినియోగించుకుంటామని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం డిమాండ్ ముందుపెట్టడంతో 2022-23 నీటి సంవత్సరంలో ఒప్పందానికి బ్రేక్ పడింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ మళ్లీ 2024-25 నీటి సంవత్సరంలో 66:34 నిష్పత్తికే అంగీకరించింది. ఇక 2025-26 నీటి సంవత్సరంలో ఒప్పందాల ముచ్చటనే ఎత్తలేదు. ఏపీ దాదాపు 72 శాతం జలాలను తరలించుకుపోయినా రేవంత్‌రెడ్డి సర్కార్ నోరు మెదపలేదు. ప్రస్తుతం 2026-27 నీటి సంవత్సరానికి సంబంధించి కూడా ఎలాంటి ఒప్పందం జరగలేదు. కానీ అప్పుడే రిజర్వాయర్ల నుంచి నీటి వినియోగానికి సంబంధించి చర్చలకు ఏపీ తెరతీయగా, బోర్డు వత్తాసు పలుకుతున్నది.
ఈ నేపథ్యంలోనే నీటి వాటా ముచ్చటను తీసుకురాకుండానే కేఆర్ఎంబీ నేరుగా నీటి వినియోగాలే సింగిల్ ఎజెండాగా చర్చలకు తెరలేపింది. అందులో భాగంగా ఇటీవల త్రీమెన్ కమిటీ సమావేశాన్ని నిర్వహించింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలో ప్రస్తుతమున్న జలాలను తాగునీటికే వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఏపీ రెండు రిజర్వాయర్ల నుంచి అక్టోబర్ చివరినాటికి మొత్తంగా 47 టీఎంసీలు తాగునీటికి అవసరమని డిమాండ్ చేయడంతోపాటు, 66:34 నిష్పత్తిలోనే జలాలను వినియోగించుకుంటామని స్పష్టంచేసింది. ఏపీ చేసిన నీటి డిమాండ్లకు, తరలింపునకు తెలంగాణ సర్కార్ ఆమోదం తెలపడం గమనార్హాం. అయితే ఏపీతో సమానంగా 47 టీఎంసీలు కావాలని తెలంగాణ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో త్రీమెన్ కమిటీ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకోకుండానే వాయిదా వేసింది. శుక్రవారం మరోసారి త్రీమెన్ కమిటీ సమావేశం కొనసాగనున్నది. బోర్డు మెంబర్ సెక్రటరీ నేతృత్వంలో ఇరు రాష్ర్టాల ఈఎన్సీలు రమేశ్‌బాబు, నర్సింహమూర్తి నీటి వినియోగాలపై చర్చించనున్నారు.