హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): కృష్ణా బేసిన్‌లోని ఇరు రాష్ర్టాలకు సంబంధించిన ఉమ్మడి ప్రాజెక్టులతోపాటు రివర్ బోర్డు గెజిట్‌లో నిర్దేశించిన ప్రాజెక్టులు, వాటి ఔట్లెట్లను తమకు స్వాధీనం చేయాల్సి ఉంటుందని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) మరోసారి తేల్చిచెప్పింది. ఈ మేరకు తాజాగా సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ను దాఖలు చేసింది. ఏపీ పునర్విభజన చట్టాన్ని అనుసరించి కేంద్ర ప్రభుత్వం 2021లో కృష్ణా, గోదావరి రివర్ బోర్డుల అధికార పరిధులను నిర్దేశిస్తూ గెజిట్‌ను జారీ చేసింది. అందులో భాగంగా రెండు తెలుగు రాష్ర్టాల ఉమ్మడి ప్రాజెక్టులతోపాటు వాటికి సంబంధించిన ఔట్లెట్లను బోర్డుల నియంత్రణలోకి తీసుకొచ్చి, సంబంధిత మార్గదర్శకాలను జారీ చేసింది.
అనంతరం ఈ రివర్ బోర్డు గెజిట్‌ను తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఇరు రాష్ర్టాల మధ్య ట్రిబ్యునల్ చేసిన నీటి పంపకాలు లేకుండా ప్రాజెక్టులను బోర్డు నియంత్రణలో పెట్టడం సరికాదని, నీటి పంపకాలపై ప్రస్తుతం ట్రిబ్యునల్ ఎదుట విచారణ కొనసాగుతున్నదని పేర్కొంటూ.. కేటాయింపులు పూర్తయ్యాక గెజిట్‌ను అమలు చేయాలని స్పష్టం చేసింది. దీంతో తెలంగాణ పిటిషన్‌పై కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని సుప్రీంకోర్టు గతంలోనే కేంద్ర జల్‌శక్తి శాఖకు, కేఆర్ఎంబీకి, ఏపీ సర్కారుకు ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాల మేరకు కేంద్ర జల్‌శక్తి శాఖ, ఏపీ సర్కారు ఇప్పటికే కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేసి, గెజిట్ అమలుకే మొగ్గుచూపాయి. తాజాగా కేఆర్ఎంబీ సైతం గెజిట్‌ను అమలు చేయాలని, ఉమ్మడి ప్రాజెక్టులను తమకు అప్పగించాల్సిందేనని పేర్కొంటూ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. వీటిపై సుప్రీంకోర్టు త్వరలో విచారణ చేపట్టనున్నది.