Floods | హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ)/న్యూస్‌నెట్‌వర్క్: విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ ఉప్పొంగి ప్రవహిస్తున్నది. ఆదివారం జూరాలకు 3,80,200 క్యూసెక్కులు, శ్రీశైలం ప్రాజెక్టుకు 4.96 లక్షల క్యూసెక్కులు, నాగార్జునసాగర్‌కు 4,83,766 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. గోదావరి బేసిన్‌లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 60,419 క్యూసెక్కులు, కడెం ప్రాజెక్టుకు 78 వేల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతుండగా, ఎల్లంపల్లికి 1.48 లక్షల ప్రవాహం వస్తున్నది. సింగూర్‌కు 13,07 6 క్యూసెక్కులు, నిజాంసాగర్‌కు 28,900 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది.
కాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో మొత్తం 25 గేట్లకు గాను 13 గేట్లు పూర్తిగా, 12 గేట్లు రెండు అడుగులమేర ఎత్తి 40,962 క్యూసెక్కులను, పాల్వంచ మండలంలోని కిన్నెరసాని ప్రాజెక్టుకు చెందిన 12 గేట్లు ఎత్తి లక్షా 4వేల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేశారు. ఖమ్మం జిల్లాలోని పాలేరు రిజర్వాయర్ ఉగ్రరూపం దాల్చింది. ఈ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 23 అడుగులు కాగా 28 అడుగులకు పైగా నీరు వచ్చి చేరింది. సుమారు 70 వేల క్యూసెక్కుల నీరు అలుగుమీదుగా పోతున్నది. నిర్మల్ జిల్లాలోని గడ్డెనవాగు, ఆదిలాబాద్ జిల్లాలోని మత్తడి వాగు ప్రాజెక్టు జలకళను సంతరించుకోవడంతో గేట్లను ఎత్తి కిందికి నీటిని వదులుతున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టు నిండటంతో దిగువకు మత్తడి దుంకుతున్నది. ప్రాజెక్టు సామర్థ్యం 31 అడుగులకు గాను ఆదివారం రాత్రి వరకు పూర్తి స్థాయిలో నిండింది. కామారెడ్డి జిల్లా పాల్వంచ, సిద్దిపేట జిల్లా కూడవెల్లి వాగుల ద్వారా మానేరుకు 32 వేల క్యూసెక్కులకు పైగా భారీగా వరద వస్తున్నది. శ్రీరాజరాజేశ్వర జలాశయానికి సిరిసిల్ల మానేరు, వేములవాడ మూలవాగు నుంచి 33,805 క్యూసెక్కులు, గాయత్రీ పంప్‌హౌస్ నుంచి 6,300 క్యూసెక్కుల చొప్పున మొత్తం 40,105 క్యూసెక్కుల వదర నీరు వస్తున్నట్టు అధికారులు తెలిపారు. కరీంనగర్ జిల్లాలో మోయతుమ్మెద వాగు ఉప్పొంగుతున్నది. భారీగా వరద వస్తున్న నేపథ్యంలో నేడో, రేపో ఎల్ఎండీ నిండే అవకాశం ఉన్నది.
హైదరాబాద్ శివారులోని జంట జలాశయాలు ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్‌లోకి ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. ఉస్మాన్‌సాగర్‌కు శంకర్పల్లి, నవాబ్‌పేట, ఖానాపూర్ నుంచి వరద వస్తున్నది. ఇన్‌ఫ్లో 6,700 క్యూసెక్కులు ఉన్నది. గరిష్ఠస్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా.. 1782.45 అడుగుల మేర నీరు నిల్వ ఉన్నది. కాగా హిమాయత్‌సాగర్‌కు అనంతగిరి మొదలుకొని వికారాబాద్, పరిగి, చేవెళ్ల, మెయినాబాద్ మీదుగా భారీగా వరద వస్తున్నది. 3,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదుకాగా గరిష్ఠ స్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు కాగా ఆదివారం సాయంత్రానికి 1756.60 అడుగల మేర నీరు నిల్వ ఉన్నది.