కండ్ల ముందే కృష్ణమ్మను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖాళీ చేస్తున్నది. గడిచిన 7 నెలల్లోనే 594 టీఎంసీలను మళ్లించుకున్నది. అయినా నదీజలాలను ఒడిసిపట్టకుండా తెలంగాణ కాంగ్రెస్ సర్కారు కండ్లప్పగించి చూస్తూ వస్తున్నది. కృష్ణా జలాల్లో ఇప్పటివరకు 170 టీఎంసీలను వినియోగించిన రాష్ట్ర సర్కారు, సమృద్ధిగా వర్షాలు కురిసినా నీళ్లు లేవంటూ పాలమూరు ఆయకట్టును పడావు పెట్టింది. నీటిని ఒడిసిపట్టకుండా ఇంతవరకు చోద్యం చూసి, ఇప్పుడేమో టెలీమెట్రీలంటూ హడావుడి చేస్తున్నది.
(మ్యాకం రవికుమార్)
Krishna Water | హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ) : ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిశాయి. రా్రష్ట్రవ్యాప్తంగా సాధారణం కన్నా 97 శాతం అత్యధిక వర్షపాతం నమోదైంది. కృష్ణాబేసిన్‌లోని ప్రాజెక్టులన్నీ పొంగిపొర్లాయి. ఆపై ఏకంగా 844 టీఎంసీల జలాలు సముద్రానికి తరలిపోయాయి. కృష్ణా నదీజలాల్లో ఏపీ తాత్కాలిక కోటా 512 టీఎంసీలే కాగా ఇప్పటివరకు ఏకంగా 594.14 టీఎంసీలను మళ్లించుకున్నది. సర్దుబాటు కోటాకు మించి 16 శాతం మేరకు జలాలను తరలించుకుపోయింది. అదీ కేవలం 7 నెలల్లోనే. అందులోనూ ఒక్క పోతిపాడురెడ్డి హెడ్ రెగ్యులేటరీ ద్వారానే 220 టీఎంసీలను పెన్నాబేసిన్‌కు బాజాప్తా మళ్లించింది. అదే సమయంలో కృష్ణమ్మను ఒడిసిపట్టకుండా రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు చేతులెత్తేసింది. తాత్కాలిక కోటా జలాలను కూడా పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలనే సోయికూడా రేవంత్ సర్కారుకు లేకుండా పోయింది. తాత్కాలిక కోటా జలాల్లో 56.85 శాతం అంటే కేవలం 170 టీఎంసీల కృష్ణా జలాలనే వినియోగించింది. మరోవైపు ప్రాజెక్టుల్లో సరిపడా నీళ్లు లేవంటూ సాగర్ మినహా ఉమ్మడి పాలమూరు జిల్లా ఆయకట్టును పడావు పెట్టింది. నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకొనేందుకు ఇప్పుడేమో టెలీమెట్రీలంటూ హడావుడి చేస్తున్నది. ఏపీని కట్టడం చేయడంలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇంతకాలం చోద్యం చూసి ఇప్పుడేమో నీటి పారకాన్ని కొలిచేందుకు టెలీమెట్రీలు ఏర్పాటు చేయాలంటూ హడావుడి చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఒక్క పోతిరెడ్డిపాడు నుంచే 220 టీఎంసీలు..
ఈ ఏడాది అక్టోబర్ మాసాంతంవరకు కూడా ఎగువ నుంచి కృష్ణాలో వరద ప్రవాహాలు కొనసాగాయి. అక్టోబర్ 25 నాటికి శ్రీశైలం రిజర్వాయర్‌లో పూర్తిస్థాయి నీటి నిల్వ మట్టం 885 అడుగులకు చేరుకోగా, 215 టీఎంసీలతో కళకళలాడింది. పలుమార్లు క్రెస్ట్ గేట్లను ఎత్తేశారు. కానీ నెల తిరిగేసరికి పరిస్థితి మొత్తం తారుమారింది. ఇంకా యాసంగికి సంబంధించి నీటి విడుదల ప్రారంభం కాకుండానే శ్రీశైలం రిజర్వాయర్‌ను ఏపీ సర్కారు ఖాళీ చేసింది. నెల వ్యవధిలోనే 93 టీఎంసీలను పోతిరెడ్డిపాడు (పీఆర్పీ) హెడ్ రెగ్యులేటరీ నుంచి ఏపీ నిరంతరాయంగా కృష్ణా జలాలను తరలించింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒక్క పోతిరెడ్డిపాడు ద్వారానే 7 నెలల్లోనే 220 టీఎంసీలకు పైగా జలాలను పెన్నా బేసిన్‌కు మళ్లించింది. ప్రస్తుతం పెన్నా బేసిన్లో దాదాపు 350 టీఎంసీల మేరకు జలాలను నిల్వ చేసింది. అవిగాకుండా హెచ్ఎన్ఎస్ఎస్, జీఎన్ఎస్ఎస్, ముచ్చుమర్రి, మల్యాల తదితర ఎత్తిపోతల ద్వారా కూడా జలాలను తరలించింది. దిగువన నాగార్జున్‌సాగర్ వద్ద కూడా కుడికాలువ, పంప్‌హౌస్ ద్వారా కృష్ణా జలాలను ఏపీ నిరంతరాయంగా తరలిస్తూనే ఉన్నది. మొత్తంగా ఈ ఏడాది ఇప్పటివరకు 594 టీఎంసీలకు పైగా జలాలను ఏపీ పెన్నాబేసిన్‌కు తరలించినట్టు అధికారిక గణాంకాలే తేటతెల్లం చేస్తున్నాయి. పీఆర్పీ నుంచి ఏపీ నీటి తరలింపుతో ప్రస్తుతం శ్రీశైలం రిజర్వాయర్‌లో నీటినిల్వలు పూర్తిగా తగ్గిపోయాయి.
నీటి వినియోగంలో రేవంత్ సర్కార్ ఘోర వైఫల్యం
శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్ల నుంచి ఎంతమేరకు సాధ్యమైతే అంతమేరకు కృష్ణా జలాలను తరలిస్తూ, రిజర్వాయర్లను ఏపీ ప్రభుత్వం నింపుకుంటుండగా తెలంగాణ సర్కారు మాత్రం మొద్దు నిద్ర పోతున్నదని నీటిరంగ నిపుణులు మండిపడుతున్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద రిజర్వాయర్లను, కాలువలతో అనుసంధానించిన వందలాది చెరువులను నింపే అవకాశమున్నా తెలంగాణ సర్కారు ఆ పనిచేయని దుస్థితి నెలకొన్నది. కల్వకుర్తి పంపింగ్ స్టేషన్లో మొత్తం 5 పంపులుండగా, కేవలం 3 మాత్రమే పనిచేస్తున్నాయి. మిగతా 2 పంపులకు మరమ్మతులు చేయకుండా ఏడాదిగా నిర్లక్ష్యంగా చేస్తూ వచ్చింది. అక్కడ పూర్తిస్థాయి సామర్థ్యం మేరకు జలాలను ఎత్తిపోసుకోలేని దుస్థితి నెలకొన్నది. కల్వకుర్తి, కోయిల్‌సాగర్, నెట్టెంపాడు, రాజీవ్‌భీమా, జూరాల ఇతర మీడియం ప్రాజెక్టులతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2645 చెరువులను, చెక్‌డ్యామ్‌లను అనుసంధానం చేసింది. జలాలను లిఫ్ట్ చేసి ఆయా చెరువులను, చెక్‌డ్యామ్‌లను నింపే అవకాశమున్నా కాంగ్రెస్ సర్కారు ఆ పనిచేయలేదు. ఇక సాగర్ ఎడమ కాలువ పూర్తిస్థాయి సామర్థ్యం 8 వేల క్యూసెక్కులు కాగా ఈ ఏడాది ఇప్పటికి గరిష్ఠంగా 6 వేల క్యూసెక్కులకు మించి నీటిని విడుదల చేయడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అదీగాక ఎడమ కాలువతో అనుసంధానించిన చెరువులను నింపే అవకాశమున్నా కూడా ప్రభుత్వం ఆ పని చేయడం లేదని రైతాంగం మండిపడుతున్నది. ఏపీని కట్టడి చేయడంలోనే కాదు కృష్ణా జలాలను ఒడిసిపట్టే అంశంలోనూ తెలంగాణ సర్కారు అడుగడుగునా విఫలమైంది. మరోవైపు సరిపడా సాగునీరు లేక ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టుల కింద యాసంగిలో ఆయకట్టును పడావుపెట్టింది.
‘పాలమూరు’పై సోయిలేని సర్కారు..
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కాంగ్రెస్ సర్కారు పూర్తిగా శీతకన్ను వేసింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పథకానికి రూపకల్పన చేసింది. ప్రాజెక్టులో భాగంగా అంజనగిరి (నార్లాపూర్) 8.51 టీఎంసీలు, వీరాంజనేయ (ఏదుల) 6.55 టీఎంసీలు, వెంకటాద్రి (వట్టెం) 16.74 టీఎంసీలు, కురుమూర్తిరాయ (కరివేన) 17.34 టీంఎసీలు, ఉద్దండాపూర్ 16.03 టీఎంసీలు, కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్లను 2.80 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించాలని నిర్ణయించింది. రాష్ట్ర ఏర్పాటు నాటికి కృష్ణా బేసిన్లో మొత్తం తెలంగాణ నీటి నిల్వ సామర్థ్యం 8 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నిర్మిస్తున్న ఒక్క పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతోనే 67.97 టీఎంసీల నిల్వసామర్థ్యం పెరగనుంది. ఇప్పటికే కేపీ లక్ష్మీదేవిపల్లి మినహా మిగతా రిజర్వాయర్లన్నీ పూర్తయ్యాయి. నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి ఏదుల రిజర్వాయర్‌కు జలాల తరలింపునకు 8.5 కిమీ మీటర్ల కాలువ తవ్వాల్సి ఉండగా, కాంగ్రెస్ సర్కారు ఏర్పడే నాటికే 4.5 కిలో మీటర్ల కాలువ పనులు పూర్తయ్యాయి. 3.5 కిలో మీటర్ల తవ్వకం పని మిగిలి ఉన్నది. ఆ పనులను ఏడాదిగా కాంగ్రెస్ సర్కారు పడావు పెట్టింది. ఆ ఒక్క కెనాల్ పనులు పూర్తి చేస్తే నార్లాపూర్ నుంచి కరివెన వరకు కృష్ణా జలాలను తరలించే అవకాశమున్నది. అందుకు సంబంధించిన పనులన్నీ గతంలోనే పూర్తయ్యాయి. సర్కారు ఏమాత్రం పనులు చేసినా ఆయా రిజర్వాయర్లలో నీటిని నిల్వ చేసుకునే వెసులుబాటు కలిగేది. తత్ఫలితంగా వాటి పరిధిలో భూగర్భజలాల పెరుగుదలకు అవకాశముండేది. కానీ సర్కారు మాత్రం ప్రాజెక్టును ఏడాది నుంచి పూర్తిగా విస్మరించింది.
టెలీమెట్రీలంటూ ఇప్పుడు హడావుడి
పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ సర్కారు యథేచ్ఛగా కృష్ణా జలాలను బేసిన్ అవతలికి తరలిస్తున్నా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) చోద్యం చూస్తూ కూర్చున్నది. నీటి తరలింపును నిలిపేయాలని పేరుకే లేఖలు రాసి చేతులు దులుపుకొన్నది. అయినా ఏపీ సర్కారు పోతిరెడ్డిపాడు నుంచి నిరంతరాయంగా నీటిని మళ్లిస్తున్నది. ఆదేశాలను బేఖాతరు చేస్తున్నా తెలంగాణ సర్కారు మాత్రం చోద్యం చూస్తూ ఉండిపోయింది. బోర్డుపై ఒత్తిడి తెచ్చి కృష్ణా జలాలను ఏపీ తరలించకుండా అడ్డుకునేందుకు ఎలాంటి ప్రయత్నమూ చేపట్టలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. శ్రీశైలం ప్రాజెక్టునే కాదు దిగువ సాగర్ వద్ద కూడా ఏపీ ఆడింది ఆటగా, పాడింది పాటగా కొనసాగుతున్నది. ఎలాంటి ఇండెంట్ పెట్టకుండానే, ఈ సీజన్లో ఇప్పటికీ నీటి వాటాల పంపిణీ పూర్తి కాకముందే కుడికాలువ ద్వారా సామర్థ్యం మేరకు జలాలను తరలించుకుపోతున్నది. అదీగాక నీటి ప్రవాహాల రీడింగ్‌ను సైతం నమోదు చేయకుండా అడ్డుకుంటున్నది. ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ సర్కారు మాత్రం పట్టనట్టుగానే వ్యవహరిస్తున్నది. ఈ నీటి సంవత్సరానికి సంబంధించి కోటాలపై సమావేశాన్ని నిర్వహించాలని బోర్డును ఇప్పటివరకు పట్టుబట్టకపోవడం సర్కారు నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నది. ఇంతకాలం నిర్లక్ష్యంగా వ్యవహరించిన రాష్ట్ర సర్కారు ఇప్పుడేమో పీఆర్పీపై నీటి పారకాన్ని కొలిచేందుకు టెలీమెట్రీలను ఏర్పాటు చేయాలంటూ హడావుడి మొదలుపెట్టడం గమనార్హం. ఇంతకాలం మొద్దునిద్రలో ఉన్న రేవంత్ సర్కారు ఇప్పుడు టెలీమెట్రీలు ఏర్పాటు చేయాలని హడావుడి చేస్తుండడంపై ఇంజినీరింగ్ నిపుణులు సైతం మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే సాధ్యమైనంత మేరకు చెరువులు నింపాలని, నీటివినియోగంపై దృష్టి సారించాలని రైతులు, సాగునీటిరంగ నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. జలాలను ఇష్టారాజ్యంగా తరలించుకోకుండా ఏపీని నిలువరించేందుకు బోర్డుపై, కేంద్రంపై ఒత్తిడి తేవాలని, లేదంటే మళ్లీ గడ్డు పరిస్థితులు ఎదుర్కోక తప్పదని హెచ్చరిస్తున్నారు.
నేడు కృష్ణా బోర్డు సమావేశం
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) మీటింగ్ నేడు కొనసాగనున్నది. ఈ మేరకు ఇరు రాష్ర్టాలకు కేఆర్ఎంబీ అధికారులు సమాచారం ఇచ్చారు. వాస్తవంగా బోర్డు సమావేశాన్ని నవంబర్లోనే నిర్వహించాలని తొలుత ఖరారు చేశారు. ఎజెండా అంశాలను పంపాలని కోరుతూ తెలంగాణ, ఏపీ రాష్ర్టాలకు లేఖ రాసింది. అయితే ఒక పర్యాయం ఏపీ, అటు తర్వాత తెలంగాణ ప్రభుత్వాలు సమావేశాన్ని వాయిదా వేయాలని కోరడం, కేఆర్ఎంబీ ఆ మేరకు వాయిదా వేయడం పరిపాటిగా మారింది. ఎట్టకేలకు నేడు సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ప్రస్తుతం శ్రీశైలం, సాగర్ కామన్ రిజర్వాయర్లలో కలిపి మొత్తం 160 టీఎంసీలే వినియోగానికి అందుబాటులో ఉన్నాయి. ఇదిలా ఉంటే నాగార్జునసాగర్ ఎడమ కాలువ జోన్ 3లోని ఆయకట్టుకు 12 టీఎంసీల జలాలు విడుదల చేయాలని ఏపీ సర్కారు ఇటీవల కేఆర్ఎంబీకి సమాచారమిచ్చింది. తెలంగాణ మాత్రం ఇప్పటివరకు నీటి ఇండెంట్‌ను పెట్టకపోవడం గమనార్హం. ఇక బోర్డు సమావేశంలో నీటివాటాలతోపాటు, రెండోదశ టెలీమెట్రీల ఏర్పాటు, ఆపరేషన్ ప్రొటోకాల్ తదితర అంశాలపై నేటి సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయి.
2025-26 నీటి సంవత్సరానికి సంబంధించి 7 నెలల్లో కృష్ణా జలాల వినియోగం