హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) సమావేశాన్ని డిసెంబర్3వ తేదీన నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇరు రాష్ర్టాలకు కేఆర్ఎంబీ సమాచారం అందించింది. ప్రాజెక్టుల్లో నీటి వినియోగం, శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్ల ఆపరేషన్ ప్రోటోకాల్, రూల్‌కర్వ్‌ను రూపొందించడం, జలవిద్యుత్తు ఉత్పత్తి అంశాలపై చర్చించేందుకు ఈ నెల 8వ తేదీనే సమావేశాన్ని నిర్వహించాలని కేఆర్ఎంబీ ఇప్పటికే నిర్ణయించింది.
అయితే అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బోర్డు మీటింగ్‌పై ఏపీ చేసిన విజ్ఞప్తి మేరకు వాయిదా వేసింది. తాజాగా డిసెంబర్3న నిర్వహించాలని నిర్ణయించింది. ఇక బోర్డు సమావేశానికి సంబంధించి తెలంగాణ ఇప్పటికే పలు ఎజెండా అంశాలను సిద్ధం చేసినట్లు తెలుస్తున్నది. 50:50 నిష్పత్తిలో కృష్ణా జలాల వినియోగం, తాగునీటి కోటాలో 20శాతాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలనే అంశాలపై చర్చించాలని ప్రతిపాదించినట్టు సమాచారం.