హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అధికారులపై గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) కర్రపెత్తనం చెలాయిస్తున్నది. ఎవరికి డిప్యుటేషన్ ఇవ్వాలనేది కూడా తామే నిర్ణయిస్తామంటూ రాష్ర్టాల హక్కులను కాలరాస్తున్నది. ఏకపక్ష నిర్ణయాలతో బోర్డులోని అధికారులను ఇబ్బందులకు గురిచేస్తున్నది. ఇదేమని ప్రశ్నిస్తే వేధింపులకు పాల్పడుతున్నది. ఈ విషయమై ఇప్పటికే అనేక పర్యాయాలు ఫిర్యాదు చేసినా కేంద్ర జల్‌శక్తి శాఖ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తన్నది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం సైతం చోద్యం చూస్తున్నది. ఈ వ్యవహారం ఇలాగే కొనసాగితే బోర్డులో విధులు నిర్వర్తించలేమని తెలంగాణ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఏపీ రాష్ర్టాల మధ్య కృష్ణా, గోదావరి నదీ జలాల పంపిణీ, వివాదాల పరిష్కారానికి రివర్ బోర్డులను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ బోర్డుల్లో చైర్మన్, మెంబర్ సెక్రటరీ, ఇద్దరు మెంబర్లను కేంద్రం నియమిస్తుంది. మిగతా బోర్డు సెక్రటేరియట్లో ఇరు రాష్ర్టాల నుంచి ఎస్ఈ, ఈఈ, డీఈఈ, ఏఈఈలు సమాన నిష్పత్తిలో నియమించుకుంటారు. రివర్ బోర్డు అనేది కేవలం ఇరు రాష్ర్టాలను సమన్వయం చేసుకుంటూ వివాదాలను పరిష్కరించే ఒక ఏర్పాటు మాత్రమే. ఏ అంశంలోనైనా రాష్ర్టాలదే అంతిమ నిర్ణయం. కానీ ఇక్కడ జీఆర్ఎంబీ మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది.
వివాదాలను పరిష్కరించకపోగా కొత్త వివాదాలకు తెరలేపుతున్నది. ముఖ్యంగా బోర్డు మెంబర్ సెక్రటరీ తీరు నానాటికి శ్రుతి మించిపోతున్నదని అధికారులు వెల్లడిస్తున్నారు. బోర్డులో ఆయా రాష్ర్టాలు తమకు నచ్చినట్టుగా అంతరాష్ట్ర వివాదాలు, బేసిన్‌పై అవగాహన ఉన్న నిపుణులైన అధికారులను డిప్యుటేషన్‌పై నియమించుకుంటాయి. అది రాష్ర్టాల హక్కు. దీనిని బోర్డు తుంగలో తొక్కుతున్నది. ఇటీవల జీఆర్ఎంబీలో తెలంగాణకు చెందిన ఓ మహిళా అధికారి డిప్యుటేషన్ కాలం పూర్తయింది. దీంతో రాష్ట్ర ఇరిగేషన్ ఈఎన్సీ (అడ్మిన్) ఆ అధికారిణి సేవలను వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో డిప్యుటేషన్‌ను మరో ఏడాదిపాటు పొడిగించారు.
కానీ, ఈ నిర్ణయాన్ని తప్పుబడుతూ, తెలంగాణను అవహేళన చేస్తూ బోర్డు మెంబర్ సెక్రటరీ లేఖ రాయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. డిప్యుటేషన్లను కొనసాగించే అధికారం ఈఎన్సీకి లేదని, బోర్డు ఆమోదించిన రిక్రూట్మెంట్ నియమాలనే అనుసరించాలని, డిప్యుటేషన్‌ను ఒప్పుకోబోమని ధిక్కరించడం బోర్డు ఒంటెత్తు పోకడలకు దర్పణం పడుతున్నది. అక్కడితో ఆగకుండా ఇష్టమొచ్చినట్టు డిప్యుటేషన్లను పొడిగించొద్దని ఈఎన్సీకే ఆదేశాలు జారీ చేయడంపై తెలంగాణ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బోర్డు నిర్వహణకు ఇరు రాష్ర్టాలు నిర్ణీత మొత్తంలో నిధులను విడుదల చేస్తుంటాయి. ఆ నిధులను అడ్డగోలుగా స్వాహా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. బోర్డు అధికారులు ఆఫీసుకు రావడానికి, ఎకడైనా వెళ్లడానికి రవాణా సౌకర్యాలను ఇరిగేషన్ శాఖే కల్పిస్తున్నది. అందులో భాగంగా మెంబర్ సెక్రటరీకి ప్రత్యేకంగా కారును కూడా కేటాయించింది. అలాంటి సందర్భంలో సదరు అధికారి అలవెన్సులను క్లెయిమ్ చేయడానికి వీల్లేదు. సొంత వాహనంలోనే ప్రయాణించినప్పుడు మాత్రమే అలవెన్సులను పొందేందుకు అర్హులు. కానీ, బోర్డు మెంబర్ సెక్రటరీ అజగేశన్ మాత్రం డిపార్ట్మెంట్ ఇచ్చిన కారును వాడుకోవడంతోపాటు అదనంగా నెలకు రూ.40 వేల చొప్పున ట్రావెల్ అలవెన్సులను క్లెయిమ్ చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
చైర్మన్ అనుమతి లేకుండా ఇటీవల బెంగళూరు ట్రిప్పులో ఆటో, కారు చార్జీల రూపేణా రూ.13 వేలు డ్రా చేసినట్టు బోర్డు ఉద్యుగులే వెల్లడిస్తున్నారు. కంటి శస్త్రచికిత్స చేయించుకోకపోయినప్పటికీ సర్జరీ జరిగినట్టు చెప్పి ఇంట్రా ఆక్యులర్ లెన్స్ కోసం రూ.21 వేలు తీసుకున్నారని, జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీ, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ)కి సంబంధించిన అధికారులకు నిర్వహించిన క్లాసులకు రూ.10 వేల చొప్పున వసూలు చేశారని, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఎంపిక విషయంలోనూ ఏకపక్షంగా వ్యవహరించారని మెంబర్ సెక్రటరీపై అనేక ఆరోపణలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం కాకుండా కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం బిల్లులు డ్రా చేశారని, జలసౌధలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, ఇరిగేషన్ శాఖ సెక్యూరిటీ సిబ్బందిని నియమించినప్పటికీ మళ్లీ ప్రత్యేకంగా జీఆర్ఎంబీ కోసం సెక్యూరిటీ సిబ్బందిని నియమించి అధికంగా ఖర్చు పెడుతున్నారని రాష్ట్ర అధికారులు చెప్తున్నారు.
బోర్డులోని మహిళా ఉద్యోగులను సైతం మెంబర్ సెక్రటరీ తీవ్రంగా వేధిస్తున్నారు. వారి వ్యక్తిగత వివరాలను తెలుసుకుని.. సమస్యలుంటే సమావేశాల్లో బహిర్గతం చేయడం, మహిళా ఉద్యోగుల డ్రెస్సింగ్ సె్టైల్పై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం, పని పేరుతో చాంబర్లోకి పిలిపించుకుని గంటలకొద్దీ కూర్చోబెట్టుకోవడం, వారాంతాల్లో లంచ్ లేదా డిన్నర్ కోసం ఇంటికి పిలవాలంటూ మహిళా ఉద్యోగులను ఒత్తిడి చేయడం లాంటి వ్యవహారాలపై కేంద్ర జల్‌శక్తి శాఖకు ఫిర్యాదులు వెళ్లడం గమనార్హం. మహిళా ఉద్యోగుల ఫిర్యాదు ఆధారంగా సీడబ్ల్యూసీ చైర్మన్‌తోపాటు కేంద్ర జల్‌శక్తి శాఖకు తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ జనరల్ మరోసారి ఫిర్యాదు చేశారు.
గతంలోనూ లైంగిక వేధింపులకు పాల్పడినట్టు మెంబర్ సెక్రటరీపై ఆరోపణలు రావడంతో ఆ కేసులు పెండింగ్‌లో ఉన్నట్టు తెలుస్తున్నది. అజగేశన్ తీరుపై కేంద్రానికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ఇదే అదనుగా మరింత రెచ్చిపోతున్నాడని, ఫిర్యాదు చేసిన వారిపై కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నాడని, ప్రతిదానికీ మెమోలు జారీచేస్తూ మరింతగా వేధిస్తున్నాడని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బోర్డులో పరిస్థితి నానాటికీ దిగజారుతున్నా, మెంబర్ సెక్రటరీ ఆగడాలు శృతిమించుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తుండటంపై రాష్ట్ర ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా దక్కడం లేదని వాపోతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే బోర్డులో విధులు నిర్వర్తించలేమని చెప్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి మెంబర్ సెక్రటరీపై చర్యలు చేపట్టేలా చూడాలని, ఆయన ఆర్థిక అవకతవకలను కూడా కేంద్ర జల్‌శక్తి శాఖ దృష్టి తీసుకెళ్లాలని కోరుతున్నారు. కాగా, వార్షిక బడ్జెట్‌తోపాటు పలు అంశాలపై చర్చించేందుకు సోమవారం జలసౌధలో జీఆర్ఎంబీ భేటీ జరుగనున్నది. ఈ మేరకు బోర్డు చైర్మన్ ఇప్పటికే రెండు తెలుగు రాష్ర్టాలకు సమాచారం అందజేశారు.