Krishna Water | హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): కృష్ణా జలాలను ఇష్టారాజ్యంగా తరలించుకుపోతున్న ఆంధ్రప్రదేశ్‌ను నిలువరించడంలోనే కాదు, నీటి వాటాలను తేల్చడంలో కూడా నదీ యాజమాన్య బోర్డు పూర్తిగా చేతులెత్తేసింది. వారం రోజులుగా మీటింగ్‌ల పేరిట సాగదీసి ఇప్పుడు నీటి నిల్వలు పడిపోయాక పొదుపుగా వాడుకోవాలంటూ ఉచిత సలహాలు ఇస్తున్నది. ఇంతకాలం ఏపీ కృష్ణా జలాలను తరలించుకుపోతుంటే చోద్యం చూసిన తెలంగాణ సర్కారు ఇప్పుడేమో చిందులు వేస్తున్నది. నీటి వాటాను సాధించలేక, 40ః20 నిష్పత్తిలో నీటి వినియోగానికి రాజీపడింది.
తెలంగాణ రైతాంగం ప్రయోజనాలను పణంగా పెట్టింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్ల నుంచి నీటి వాటాలను తేల్చేందుకు ఇరు రాష్ట్రాల సెక్రటరీలు, ఈఎన్సీలతో కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్‌జైన్ గురువారం మరోసారి జలసౌధలో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర ఇరిగేషన్‌శాఖ సెక్రటరీ రాహుల్‌బొజ్జా, ఏపీ జలవనరులశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయిప్రసాద్, ఇరు రాష్ర్టాల ఈఎన్సీలు అనిల్‌కుమార్, వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఏపీ 55 టీఎంసీలు, తెలంగాణ 63 టీఎంసీలు కావాలని బోర్డు ఎదుట ప్రతిపాదనలు పెట్టాయి.
సాగర్ ఆయకట్టుకు సాగునీరు అందించడం అత్యవసరమని, లేదంటే పంటలు ఎండిపోయే ప్రమాదముందని, ఎట్టిపరిస్థితుల్లోనూ ఇప్పుడు తమకు 23 టీఎంసీలు కావాల్సిందేనని ఏపీ సర్కారు పట్టుబట్టినట్టు తెలిసింది. ఏపీ ఇప్పటికే కోటాకు మించి నీటిని తరలించిందని తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో బోర్డు చైర్మన్ జోక్యం చేసుకుని ప్రస్తుతం రెండు రిజర్వాయర్లలో కలిపి 60 టీఎంసీలే అందుబాటులో ఉన్నాయని, డిమాండ్ల మేరకు నీళ్లను ఇవ్వలేమని చేతులెత్తేసినట్టు తెలిసింది. ప్రస్తుతం రెండు రిజర్వాయర్లలో అందుబాటులో ఉన్న నీటిని రెండు రాష్ట్రాలు వివాదాలు లేకుండా వినియోగించుకోవాలని ఉచిత సలహా ఇచ్చినట్టు సమాచారం.
తాగునీటి అవసరాలను మినహాయించి తెలంగాణకు 40 టీఎంసీలు, ఏపీకి 20 టీఎంసీలు కేటాయించినట్టు అధికారవర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం సాగర్ నుంచి ఏపీ 7 వేల క్యూసెకులు, తెలంగాణ 9 వేల క్యూసెకుల నీటిని తోడుతుండగా, 5000 క్యూసెక్కులనే డ్రా చేయాలని ఏపీకి సూచించినట్టు తెలిపాయి. శ్రీశైలం రిజర్వాయర్ 820 ఫీట్ల వరకు, సాగర్‌లో 515 ఫీట్ల వరకు మాత్రమే సాగు అవసరాలకు జలాలను వినియోగించుకోవాలని, ఆ తరువాత ఇరిగేషన్‌కు నిలిపేయాలని బోర్డు స్పష్టం చేసినట్టు తెలిసింది.
వారం రోజుల తరువాతే సాగర్ నుంచి నీటి వినియోగాన్ని 5000 క్యుసెక్కులకు పరిమితం తగ్గిస్తామని ఏపీ వెల్లడించినట్టు అధికారవర్గాలు వివరించాయి. బోర్డు ప్రతిపాదించిన కోటాపై తెలంగాణ సైతం అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. దీంతో ఎవరికి ఎంత అవసరమో తేల్చేందుకు ప్రతి 15 రోజులకు ఒకసారి భేటీ కావాలని, ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించిన బోర్డు సమావేశాన్ని ముగించింది. చివరకు బోర్డు మీటింగ్ అనంతరం సమావేశ వివరాలను వెల్లడించేందుకు ఇరురాష్ర్టాల అధికారులు విముఖత చూపడం గమనార్హం.
కృష్ణా బేసిన్లో ప్రాజెక్టుల్లో ఈ ఏడాది 1010కిపైగా టీఎంసీల జలాలు అందుబాటులోకి వచ్చాయి. అందులో తాత్కాలిక కోటాలో ఏపీకి 666 టీఎంసీలు కేటాయించగా, ఇప్పటికే 640 టీఎంసీలకుపైగా మళ్లించింది. ఆ రాష్ట్ర కోటాలో కేవలం మరో 25 టీఎంసీలే ఉన్నాయి. అయినప్పటికీ 55 టీఎంసీలు కావాలని పట్టుబడుతున్నది. మరోవైపు తెలంగాణకు తాత్కాలిక కోటాలో 344 టీఎంసీలు ఉండగా, ఇప్పటికి 210 టీఎంసీలకు మించి వినియోగించలేదు.
ఇంకా రాష్ట్ర కోటాలో 134 టీఎంసీలు ఉన్నాయి. వేసవిలో తాగు, సాగు నీటి అవసరాలకు 63 టీఎంసీలు అవసరమవుతాయని బోర్డు ముందు ప్రతిపాదన పెట్టింది. కానీ శ్రీశైలం, సాగర్ రిజర్వాయర్లలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీరు 60 టీఎంసీలేనని బోర్డు తేల్చింది. ఈ నేపథ్యంలో ఇరు రాష్ర్టా లు సిగపట్లు పడుతున్నాయి. ఇంతకాలం మౌనంగా ఉన్న బోర్డు ఇప్పుడు సమావేశాలంటూ హడావుడి చేస్తుండగా, ఇప్పటికే వాటాకు మించి జలాలను వినియోగించుకున్న ఏపీ సర్కారు తన నీటి దోపిడీని యథేచ్ఛగా కొనసాగించేందుకు చర్చల పేరిట కాలయాపన చేస్తున్నది.
వాస్తవానికి ఈ నెల 21న మీటింగ్ నిర్వహించాల్సి ఉండగా, వివిధ కారణాలతో గురువారం వరకు వాయిదా వేసింది. ఈ మధ్యలో ఒక్క సాగర్ నుంచే ఏడు టీఎంసీలను ఏపీ మళ్లించుకుపోయింది. పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి నుంచి నీటి తరలింపును నిలిపివేసిన ఏపీ, మల్యాల పంపింగ్ స్టేషన్ నుంచి జలాలను తరలించడం మొదలు పెట్టింది.
ఏపీ ఇప్పుడు ఆయకట్టు పేరు చెప్పి సా గర్ కుడి కాల్వ నుంచి తన వాటాకు మించి నీటిని మళ్లించే డిమాండ్ పెట్టింది. తెలంగాణ సర్కారు మాత్రం చోద్యం చూస్తూ.. బోర్డుపై ఒత్తిడి పెంచకుండా, త్రీమెన్ కమిటీ సమావేశానికి డిమాండ్ చేయకుండా మౌనం వహించింది. రిజర్వాయర్లలో నీటినిల్వలు అడుగం టి, ఆయకట్టుకు ప్రమాదం ముంచుకువచ్చిన వచ్చిన పరిస్థితుల్లో ఇప్పుడు తాపీగా నిద్రలేచింది.
తొలుత 134 టీఎంసీలు కోటాలో ఉ న్నాయని చెప్పి, నీటి అవసరాలు 116 టీఎంసీలు ఉన్నాయని బోర్డు ముందు ఇండెంట్ పెట్టిన తెలంగాణ కేవలం వారం రోజుల్లోనే ఆ డిమాండ్‌ను 63 టీఎంసీలకు తగ్గించింది. ఆ మేరకైనా నీటివాటాను సాధించింది లేదు. తాజాగా బోర్డు ప్రతిపాదించిన 40 టీఎంసీలను వినియోగించుకునేందుకు తలూపి చేతులు దులుపుకున్నది.