 
                                                            హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) నిర్వహణకు నిధుల్లేకుండా పోయాయి. వెంటనే బడ్జెట్ను విడుదల చేయాలని లేదా టెలిమెట్రీల ఏర్పాటుకోసం కేటాయించిన నిధులను వాడుకుంటామని బోర్డు చెప్తున్నది. ఈ మేరకు ఇరు రాష్ర్టాలకు లేఖలు రాసింది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం కేఆర్ఎంబీ బోర్డు నిర్వహణకయ్యే బడ్జెట్ను ఇరురాష్ట్రాలు 50ః50 నిష్పత్తిలో భరించాలి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.24కోట్లు అవసరమని బోర్డు అంచనా వేసింది. ఈ మేరకు గత జనవరిలో నిర్వహించిన 19వ బోర్డు సమావేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టింది.
అందుకు ఇరు రాష్ర్టాలు ఆమోదం తెలిపాయి. తెలంగాణ, ఏపీలు రూ.12 కోట్ల చొప్పున నిధులను విడుదల చేయాలి ఉండగా.. ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. గత ఏడాది నిధులు కూడా విడుదల చేయలేదు. ప్రస్తుతం సిబ్బందికి వచ్చే నెల జీతాలు ఇవ్వడానికి సైతం నిధులు లేవని బోర్డు వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో నిధులను విడుదల చేయాలని, లేదంటే టెలిమెట్రీల ఏర్పాటు కోసం కేటాయించిన బడ్జెట్ను వినియోగించుకుంటామని ఇటీవలనే ఇరు రాష్ర్టాలకు బోర్డు లేఖ రాసింది.
కృష్ణా జలాల వినియోగం, నీటి విడుదలకు సంబంధించిన లెక్కలను పక్కాగా సేకరించేందుకు గతంలోనే టెలీమెట్రీలను ఏర్పాటు చేయాలని తెలంగాణ, ఏపీలు నిర్ణయించాయి. మొదటి విడతలో నాగార్జునసాగర్, శ్రీశైలం, జూరాల ప్రాజెక్టుల పరిధిలో మొత్తంగా 18 చోట్ల టెలిమెట్రీలను ఏర్పాటు చేశారు. ఫేజ్2 కింద 9చోట్ల ఏర్పాటు చేయాలని 2020లో నిర్ణయించారు. అందుకు రూ.7.18కోట్లు అవసరమవుతాయని ఇటీవల అంచనా వేశారు. ఆ నిధులను ఇరు రాష్ర్టాలు సమంగా భరించాల్సి ఉండగా.. తెలంగాణ సర్కారు 4.18 కోట్లను విడుదల చేసింది. తెలంగాణ కేటాయించిన నిధులను బోర్డు నిర్వహణకు వినియోగించుకొనేందుకు కేఆర్ఎంబీ సిద్ధమైంది.
 
                            