హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): నీటి వినియోగానికి సంబంధించి త్రీమెంబర్ కమిటీ సమావేశ నిర్వహణకు అనుకూలమైన తేదీని చెప్పాలని ఇరు రాష్ర్టాలను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ) కోరింది.
ఈ మేరకు తెలంగాణ, ఏపీ రాష్ర్టాల ఈఎన్సీలకు లేఖ రాసింది. సాగర్, శ్రీశైలంలో ప్రస్తుతం 28 టీఎంసీలే అందుబాటులో ఉన్నాయి. అందులో వేసవి తాగునీటి అవసరాలకు సాగర్ నుంచి 10 టీఎంసీలు కావాలని ఏపీ, 18 టీఎంసీలు కావాలని తెలంగాణ ఇటీవల బోర్డుకు ప్రతిపాదనలు పెట్టాయి.
వరంగల్, మే 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాకతీయ కట్టడం కూల్చివేతపై కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని పురావస్తు విభాగం కేసు నమోదు చేసింది. న్యాయవాది రామారావు ఫిర్యాదుతో నేషనల్ మాన్యుమెంట్స్ అథారిటీ స్పందించింది. ఈ నెల 6న వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్‌నగర్‌లోని ‘కాకతీయుల కట్టడంపై బుల్డోజర్’ అన్న శీర్షికతో నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. ఇంటిగ్రేటెడ్ సూల్ నిర్మాణం పేరిట బుల్డోజర్తో ఆలయాన్ని నేలమట్టం చేయడం తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. తెలంగాణ హెరిటేజ్ చట్టంలోని సెక్షన్ 30 కింద బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో డిమాండ్ చేశారు. కూల్చివేతకు సంబంధించిన పూర్తి విచారణ చేపట్టాలని వరంగల్ కలెక్టర్, రాష్ట్ర పురావస్తుశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని నేషనల్ మాన్యుమెంట్స్ అథారిటీ ఆదేశించింది.
హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) 76వ జనరల్ బాడీ సమావేశాన్ని హైబ్రిడ్ మోడ్‌లో శుక్రవారం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎన్‌డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ బాలేశ్వర్ ఠాకూర్ రాష్ర్టాలకు సమాచారం ఇచ్చారు. అన్ని రాష్ట్రాల ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు, ఎన్‌డబ్ల్యూడీఏ విభాగాల అధికారులు పాల్గొననున్నారు. సమావేశంలో భాగంగా గోదావరి కావేరి(జీసీ) రివర్ లింక్ ప్రాజెక్టుతోపాటు, దేశవ్యాప్తంగా చేపట్టిన ఇతర నదుల అనుసంధాన ప్రాజెక్టుల పురోగతిపై చర్చించనున్నారు.