హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రయోజనాలే బీఆర్ఎస్కు ప్రాణప్రదమని ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేశ్‌రెడ్డి స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్ బయటా, లోపలా మొదటి నుంచీ తాము కొట్లాడుతూనే ఉన్నామని, భవిష్యత్తులోనూ రాజీపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యేందుకు అందు లో కొత్త విషయాలు ఏమీ కనిపించలేదన్నారు.
అఖిలపక్ష సమావేశం పెట్టాం, కేంద్రానికి లేఖ రాశాం అని చెప్పుకునేందుకు మాత్రమే ఉపయోగపడేలా సమావేశం ఉండకూడదని అభిప్రాయపడ్డారు. విభజన సమస్యల పరిష్కారం, తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ విషయం లో బీఆర్ఎస్కు ఉన్న స్పష్టత గురించి ప్రజలకు కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదని స్పష్టంచేశారు.
జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలను పునర్విభజిస్తే దక్షిణాదికి తీరని అన్యాయం జరుగుతుందని మొదటగా గొంతెత్తి నిరసించింది బీఆర్ఎస్ పార్టీయే అని, అందుకు ఆయా సందర్భాల్లో పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మొదలు తామంతా నిరసించిన సందర్భాలను గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, వాటి పర్యవసానాలపై పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ, కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన వాటా విషయాల్లో కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.