హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్తో పొత్తు ప్రయత్నాలు బెడిసికొట్టడంతో సీపీఎం బాటలోనే నడవాలని సీపీఐ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశంలో కాంగ్రెస్ వైఖరిని ఆ పార్టీ నేతలు తప్పుబట్టారు.
బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న వామపక్షాల పట్ల కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరు సరికాదని, రాష్ట్ర స్థాయిలో లౌకక పార్టీలకు అది ప్రాధాన్యం కల్పించడం లేదని తెలిపారు. కాంగ్రెస్ పొత్తు ధర్మం పాటించడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. వామపక్ష ప్రజాతంత్ర, లౌకిక కూటమి తరఫున సీపీఎంతో కలిసి 45కి పైగా స్థానాల్లో పోటీ చేసేందుకు ఆ పార్టీ ముఖ్య నేతలు నిర్ణయించారు. దీనిపై సీపీఐ రాష్ట్ర సమితి కార్యవర్గ సమావేశం చేసిన తీర్మానంపై తుది నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఆ పార్టీ కేంద్ర సమితికి నివేదించింది.