అంతర్గాం, ఏప్రిల్ 17: మాజీ సీఎం కేసీఆర్ కృషి, ముందుచూపుతోనే పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం సస్యశ్యామలంగా మారిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. రూ.80 కోట్లతో అంతర్గాం మండలం ముర్మూరు వద్ద లిఫ్ట్ ఏర్పాటు చేయడం వల్లే నేడు అంతర్గాం, పాలకుర్తి మండలాల్లో ప్రతి ఎకరాకు సాగునీరు అందుతున్నదని తెలిపారు.
లిఫ్ట్ ఏర్పాటుకు కృతజ్ఞతగా గురువారం ముర్మూరు గ్రామం వద్ద కేసీఆర్ చిత్రపటానికి పార్టీ నాయకులతో కలిసి క్షీరాభిషేకం చేశారు. అనంతరం కోరుకంటి చందర్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు ఉన్నా రామగుండం ప్రాంతం చుక్కనీరు వాడుకోలేని దుస్థితిలో ఉన్నదని అన్నారు. అంతర్గాం, పాలకుర్తి మండలాలకు సాగునీరు అందించాలన్న సంకల్పంతో కేసీఆర్ ముర్మూరు వద్ద లిఫ్ట్ ఏర్పాటు చేయించారని గుర్తుచేశారు.