హైదరాబాద్ : రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్(Koppula Eshwar) మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి(Patnam Narender Reddy) అరెస్టును తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం, రాజీవ్ పరిపాలన అని చెబుతూనే రాక్షస పాలన సాగిస్తుందని విమర్శించారు. పచ్చని పొలాల్లో ఫార్మసిటీ పేరిట చిచ్చుపెట్టారు. న్యాయం కోసం ప్రజలు ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం అన్యాయమన్నారు. నడి రాత్రి రైతులను అరెస్టు చేయడమే మీ రైతు రాజ్యమా..? అని ప్రశ్నించారు.
ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకలపై ఎన్ని ఆంక్షలు పెట్టినా ఉద్యమాన్ని ఆపలేరని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ బెదిరింపులకు బీఆర్ఎస్ పార్టీ భయపడదన్నారు. జనం మిమ్మల్ని ప్రజాక్షేత్రంలోనే ఎండగట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రజల తరపున బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందని, అక్రమంగా అరెస్టు చేసిన పట్నం నరేందర్ రెడ్డి, రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసారు.