Koppula Eshwar : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) వ్యక్తిగత సంబంధాల కంటే పార్టీ ప్రయోజనాలకే ప్రాముఖ్యత ఇస్తారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar) అన్నారు. ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) విషయంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఆయన చెప్పారు. బీఆర్ఎస్ అనేది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ, రాదనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పోరాట యోధుడు కేసీఆర్ అని కొప్పుల పేర్కొన్నారు. ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డారు, ఈరోజు పార్టీ కోసం కన్న బిడ్డను కూడా వదులుకున్న గొప్ప నాయకుడు కేసీఆర్ అని మాజీ మంత్రి కొనియాడారు.
కేసీఆర్ తన జీవితాన్ని తెలంగాణ రాష్ట్ర సాధన కే అంకితం చేశారు, అనంతరం రాష్ట్ర పరిరక్షణ కోసం 14 సంవత్సరాలు నిరంతరం పోరాటం చేశారని కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు. నిరంతర ఉద్యమం ద్వారా 2014లో ప్రత్యేక తెలంగాణ సాధించడంలో ప్రధాన పాత్ర పోషించారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రాన్ని ప్రగతి పథం వైపు నడిపించిన కేసీసిఆర్ ప్రజల్లో విశ్వాసం, ప్రజాదరణ సంపాదించుకున్నారు. ఎమ్మెల్సీ కవిత విషయంలో కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి అన్నారు.
పార్టీ వ్యతిరేక చర్యలకు ఎవరు పాల్పడిన గతంలో కూడా ఈ విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అయినా, సొంత కూతురే అయినా కూడా, పార్టీకి నష్టం కలిగించే విధంగా మాట్లాడుతూ అదే ధోరణితో వ్యవహరిస్తూ ఉండడంతోనే పార్టీ ఆమెపై కఠిన చర్య తీసుకుందని ఆయన వెల్లడించారు. ఈ నిర్ణయంతో కేసీఆర్ నాయకత్వం ఎంత బలంగా ఉందో చాటుంది. వ్యక్తిగత సంబంధాల కంటే పార్టీ ప్రయోజనాలకే ప్రాముఖ్యత ఇస్తూ కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో తన ధైర్యాన్ని, నాయకత్వ పటిమను కేసీఆర్ చూపించారు. పార్టీకి నష్టం కలిగించే చర్యలకు ఎవరు పాల్పడినా వేటు తప్పదని కవిత సస్పెన్షన్‌తో స్పష్టం అయింది’ అని కొప్పుల తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపైన, బీఆర్ఎస్ను బద్నాం చేసే ఉద్దేశ్యంతో శాసన సభలో, బయట చర్చ జరుగుతున్న సమయంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడిన మాటల్ని పార్టీ ఖండిస్తోంది. ఆమె వ్యాఖ్యలు శత్రువు చేసే ఆరోపణలను ఆమోదించే విధంగా ఉన్నాయని కొప్పుల అన్నారు. కాంగ్రెస్ ఆరోపణలు తప్పులని హరీశ్ రావు రుజువు చేస్తున్న తరుణంలో కవిత ఇలా మాట్లాడడం పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తుందని మాజీ మంత్రి పేర్కొన్నారు. అనునిత్యం ప్రజల్లో ఉండేటటువంటి ఓ గొప్ప నాయకుడిగా పేరు తెచ్చుకున్న హరిష్ రావుపైన అవినీతి ఆరోపణలు చేయడం సరైంది కాదని కొప్పుల అన్నారు.