Koppula Eshwar | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. మిస్టర్ రేవంత్ రెడ్డి.. నువ్వు ముఖ్యమంత్రివా? వీధి రౌడీవా అని ప్రశ్నించారు. తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ అని గుర్తుచేశారు. 14 ఏండ్లు అలుపెరుగని పోరాటం చేసిన వీరుడు కేసీఆర్ అని అన్నారు.
జగిత్యాలలో కొప్పుల ఈశ్వర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బీఆర్ఎస్లో చేరిన జీవన్ రెడ్డికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ హృదయపూర్వక స్వాగతం తెలిపారు. నిన్న జగిత్యాల సభను సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పారు. అనంతరం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. నువ్వు ఇవాళ అనుభవిస్తున్న సీఎం సీటు కేసీఆర్ పెట్టిన భిక్ష అని వ్యాఖ్యానించారు.
నిన్న సీఎం రేవంత్ రెడ్డి చిల్లర మాటలు మాట్లాడిండు అని మండిపడ్డారు. అవి ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు కావని అన్నారు. బుద్ది ఉన్నోడు ఎవడూ అలా మాట్లాడాడని తెలిపారు. కేసీఆర్ను ఉరితీయాలని రేవంత్ వాగుతున్నాడని మండిపడ్డారు. ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణ సాధించినందుకు ఉరితీయాలా అని ప్రశ్నించారు. ఎడారిగా ఉన్న తెలంగాణకు పుష్కలంగా నీళ్లు తెచ్చినందుకు ఉరితీయాలా అని అడిగారు. 80 లక్షల మంది రైతులకు పంట సాయం చేసినందుకా, 24 గంటల కరెంటు ఇచ్చినందుకా? గ్రామాలను అభివృద్ధి చేసినందుకా? ఎందుకు ఉరితీయాలో చెప్పాలని నిలదీశారు. హామీలన్ని చెత్తబుట్టలో వేసిన నిన్ను ఎన్నిసార్లు ఉరితీయాలని ప్రశ్నించారు. రైతులను మోసం చేసిన నిన్ను ఎన్నిసార్లు ఉరితీయాలని నిలదీశారు.
ఎన్నికల ముందు రెండు వేల పెన్షన్ను నాలుగు వేలు చేస్తానన్నావ్ కదా ఏమైందని సీఎం రేవంత్ రెడ్డిని కొప్పుల ఈశ్వర్ నిలదీశారు. ఆడబిడ్డలకు నెలకు రూ.2500 ఇస్తానంటివి.. నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానంటివి? వాటిలో ఒక్కటైనా అమలైందా అని ప్రశ్నించారు. నిన్ను ఎన్నిసార్లు ఉరితీయాలని రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. సీఎం సీటు కోసం ఎన్ని అబద్ధాలు ఆడావని ఆగ్రహం వ్యక్తం చేశారు.