కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల్లో ఒక్కటైన ఇందిరమ్మ ఇండ్ల పథకం ఫెయిల్ అయ్యిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. ఆరు ప్రధాన గ్యారంటీల్లో ఒకటైన ఇందిరమ్మ ఇళ్ల పథకంతో తొలి ఏడాదిలో 4.16 లక్షల ఇండ్లు ఇస్తానని చెప్పి, ఇచ్చింది అంతంత మాత్రమేనని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 95,235 ఇండ్లు, గ్రామీణ ప్రాంతాల్లో 57,141 ఇండ్లు అర్బన్ ప్రాంతాల్లో 38,094 ఇండ్ల మంజూరు అని చెప్పిందని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రజా పాలనలో వచ్చిన మొత్తం 77.18 లక్షల దరఖాస్తులు అయితే, అందులో 36.03 లక్షల మందిని మాత్రమే ప్రభుత్వం అర్హులుగా ప్రకటించిందని, మిగిలిన 41.15 లక్షల మంది ఇందిరమ్మ ఇళ్లకు అర్హులు కాదా అని ఆయన ప్రశ్నించారు. దళితబంధు తీసుకున్న వారు ఇందిరమ్మ ఇళ్లకు అర్హులు కాదా అని నిలదీశారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా సొంత ఇంటి స్థలం కలిగి ఉన్న పేదవారు 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో వారికి ఇష్టమొచ్చినట్లు ఇల్లు నిర్మించుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని కొప్పుల ఈశ్వర్ గుర్తుచేశారు. కానీ 600 చదరపు అడుగుల స్థలం మించి నిర్మాణం చేపట్టిన వారు పేదలు కాదని, వారికి ఇందిరమ్మ ఇళ్ల పథకం వర్తించదని చెల్లింపులను నిలిపివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. “మీకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది, త్వరగా పాత ఇంటిని కూల్చేయండి” అంటూ హడావిడి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. తీరా లబ్ధిదారులు తమ ఇండ్లను కూల్చేసిన తరువాత, “మీ పేర్లు జాబితాలో లేవు” అంటూ నయవంచన చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ను నమ్మి ఉన్న ఇల్లు కూల్చుకుంటే.. చివరికి నట్టేట ముంచిందంటూ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు కాంగ్రెస్ రంగులు వేసి ఇందిరమ్మ ఇళ్ల పేరు చెబుతూ అధికారులు పంపిణీ చేస్తున్నారని అన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో భారీ అవకతవకలు జరిగాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం ఇల్లు లేని వారికి, కిరాయి గృహాల్లో ఉన్న వారికి కాకుండా ఇందిరమ్మ కమిటీల పేరుతో మండల వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అనుకూలంగా ఉన్న వారికే ఇల్లు మంజూరు చేస్తున్నారని, అర్హులైన లబ్ధిదారులను పక్కన పెడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న వారికి లేదా ఇందిరమ్మ కమిటీలోని కాంగ్రెస్ పార్టీ నాయకులకు, డబ్బులు ఇచ్చినోళ్లే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులుగా ఎంపిక అవుతున్నారని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకి మండలంలో కాంగ్రెస్ నాయకులు డబ్బులు వసూలు చేస్తున్నారని సోషల్ మీడియా గ్రూపుల లో కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే పోస్టులు పెడుతున్నారని పేర్కొన్నారు. ఊరూరా అర్హుల జాబితాలపై నిరసనలు కాంగ్రెస్ నేతలపై ప్రజల ఆగ్రహం వెల్లగక్కుతున్నారని.. కొంత మంది ఏకంగా ఆత్మహత్యకు యత్నించిన సంఘటనలు ఉన్నాయని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పారదర్శకంగా డబుల్ బెడ్రూం ఇండ్లను అర్హులైన లబ్ధిదారులకు ఇస్తే పార్టీ కార్యకర్తలకే ఇస్తున్నారని బద్నాం చేశారని కొప్పుల ఈశ్వర్ అన్నారు.