జగిత్యాల, సెప్టెంబర్ 5: రైతులు యూ రియా కోసం పడుతున్న కష్టాలు ప్రభుత్వానికి కనిపించడం లేదా..? అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడారు. ఇటీవలి భారీ వర్షాలకు వరి ఏపుగా పెరిగిందని, యూరియా లేకపోవడంతోనే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆందోళనలు ఉధృతం చేస్తున్నారని చెప్పారు. యూరియా విషయంలో బీజేపీ, కాంగ్రెస్ డ్రామాలు ఆడుతూ రైతులను అధోగతి పాలు చేస్తున్నాయని మండిపడ్డారు.
రాష్ట్రంలో కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని సీఎం రేవంత్ చెప్పడం విడ్డూరంగా ఉన్నదని చెప్పారు. రాష్ర్టానికి 8 లక్షల 32 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమైతే 5 లక్షల మెట్రిక్ టన్నులే కేటాయించారని విమర్శించారు. యూరియా కొరత తీర్చడంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు బాధ్యత లేదా..? అని ప్రశ్నించారు. కవితను ఆడబిడ్డగా గౌరవిస్తామని, కాళేశ్వరం విషయంలో హరీశ్‌రావుపై ఆరోపణను ఖండిస్తున్నామని చెప్పారు.