హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో గురుకుల పాఠశాల వ్యవస్థనే కనుమరుగు చేయాలనే కుట్రకు పాల్పడుతున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గురుకులాల్లో 36 మంది చనిపోయారని, ఇవన్నీ ప్రభుత్వ హత్యలుగానే భావించాల్సి ఉంటుందని చెప్పారు.
మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్‌తో కలిసి ఆయన శనివారం తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే గురుకుల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని, పేదపిల్లలు చనిపోతే సరార్కు పట్టింపే లేదని ఆవేదన వ్యక్తంచేశారు. కలుషిత ఆహారం తిని వెయ్యిమందికి పైగా అస్వస్థతకు గురయ్యారని తెలిపారు.
పెద్దాపూర్‌లో ఆరుగురు విద్యార్థులు కలుషిత ఆహారం తిని ఇద్దరు చనిపోయారని, ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం కర్లపల్లిలో విద్యార్థి విద్యుత్తు షాక్‌తో చనిపోయాడని ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా పాలమాకులలో పిల్లలు కారం తిండి తినలేక రోడ్డెకారని, దీనిపై వెంటనే సీఎం స్పందించాలని, గురుకులాలపై సమీక్ష చేయాలని డిమాండ్ చేశారు.
పదేండ్ల క్రితం కాంగ్రెస్ హయాంలో గురుకులాల్లో అడ్మిషన్లకు ఎవరూ ముందుకు రాలేదని, కేసీఆర్ హయాంలో గురుకులాలను గొప్పగా తీర్చిదిద్దారని, దాంతో సీట్ల కోసం పోటీ పడుతున్నారని చెప్పారు. తెలంగాణలో 1,022 గురుకులాలు ఉన్నాయని, వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం సర్వనాశనం చేస్తున్నదని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి బడాయి మాటలు చెప్పుడు తప్ప చేతలు లేవని ఎద్దేవాచేశారు. గురుకులాలను ప్రభుత్వం కొనసాగిస్తుందా? లేదా? చెప్పాలని, దీనిపై సీఎం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.