దళితులకు కాంగ్రెస్ ఏనాడూ పదవులు ఇవ్వలేదు. 1985 నుంచి ఇప్పటివరకు పార్టీలో ఎంతమంది దళితులకు పదవులు ఇచ్చారో చెప్పాలి. 98 మంది అధ్యక్షుల్లో నలుగురు కూడా దళితులు లేరు. 46 ఏండ్లపాటు కాంగ్రెస్ పార్టీకి గాంధీలే అధ్యక్షులుగా కొనసాగారు.
-కొప్పుల ఈశ్వర్
కరీంనగర్, మే 16 (నమస్తే తెలంగాణ): దళితుల విషయంలో కాంగ్రెస్ మొసలి కన్నీరు కారుస్తున్నదని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. శుక్రవారం కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పగ్గాలను దళితుడికి ఇవ్వాలన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దళితుల జపం చేస్తున్న రేవంత్‌రెడ్డి.. పార్టీ అధ్యక్షుడు ఖర్గేను ప్రధానిని చేయాలని ఎందుకు డిమాండ్ చేయడం లేదని ప్రశ్నించారు.
‘రాహుల్ నాయకత్వంలో పనిచేస్తున్నామని చెప్పడం తప్ప ఏనాడైనా ఖర్గే గురించి ప్రస్తావించారా? రాహుల్ చెప్తేనే కులగణన చేశామని అంటున్నారు తప్పితే, ఖర్గే చెప్తే చేశామని ఎన్నడైనా అన్నారా?’ అని నిలదీశారు. 50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ దేశవ్యాప్తంగా కులగణన ఎందుకు చేయలేకపోయిందని ప్రశ్నించారు. దళితులకు కాంగ్రెస్ ఎనాడూ పదవులు ఇవ్వలేదని విమర్శించారు. 1985 నుంచి ఇప్పటి వరకు పార్టీలో ఎంతమంది దళితులకు పదవులు ఇచ్చారో చెప్పాలని నిలదీశారు. 98 మంది అధ్యక్షుల్లో నలుగురు కూడా దళితులు లేరని విమర్శించారు.
గాంధీ కుటుంబ సభ్యులు తప్ప మరెవరికీ ప్రధాని పదవి ఇవ్వడం లేదని తెలిపారు. గాంధీయేతర కుటుంబాల నుంచి ప్రధానిగా ఎన్నికైన పీవీ నరసింహారావును అనేక ఇబ్బందులు పెట్టడం నిజం కాదా? అని ప్రశ్నించారు. మన్మోహన్సింగ్ను ప్రధానిని చేసినా సోనియానే అధికారం చెలాయించారని గుర్తుచేశారు. 46 ఏండ్లపాటు కాంగ్రెస్ పార్టీకి గాంధీలే అధ్యక్షులుగా కొనసాగారని తెలిపారు. సామాజిక న్యాయమంటే ఇదేనా అని ప్రశ్నించారు. దామోదరం సంజీవయ్య, జగ్జీవన్ రాం, ఖర్గేలు మూడేళ్లు మాత్రమే ఏఐసీసీ పదవుల్లో ఉన్నారని తెలిపారు. రేవంత్‌రెడ్డికి దమ్ముంటే దామోదర రాజనర్సింహకో, వివేక్ వెంకటస్వామికో సీఎం పదవి ఇవ్వాలని సవాల్ విసిరారు.
కేసీఆర్ ప్రభుత్వంలో తాను విప్‌గా, మంత్రిగా పదవులు నిర్వహించానని, ఈ విషయాన్ని రేవంత్‌రెడ్డి మర్చిపోయారా? అని కొప్పుల ప్రశ్నించారు. బీఆర్ఎస్ అంతర్గత విషయాలు రేవంత్‌రెడ్డికి ఎందుకని నిలదీశారు. హరీశ్‌రావుపై రేవంత్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. నాయకత్వం అనేది రాజకీయ పార్టీల అంతర్గత వ్యవహారమని, పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌కుమార్‌గౌడ్‌ను నియమించినప్పుడు బీఆర్ఎస్ పార్టీని అడిగారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో అనేక మంది దళిత నాయకులు ఉన్నారని, పీసీసీ అధ్యక్షుడిగా మరి వాళ్లను ఎందుకు చేయలేదని దుయ్యబట్టారు.
ఎవరు సీఎం అయితే ఎక్కువ మేలు జరుగుతుందో వారినే బీఆర్ఎస్ ఎంచుకున్నదని తెలిపారు. తమ పార్టీ 2014కు ముందు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పిందని, అప్పుడు తమ పార్టీ అధికారంలోకి రాలేదని, అప్పటికి దళితుడైన విజయరామారావును ఫ్లోర్ లీడర్‌గా చేశామని గుర్తు చేశారు. కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణకు ఉద్యమ నాయకుడు కేసీఆర్ సీఎం కాకపోతే రాష్ర్టానికి నష్టం జరిగేదని అన్నారు. రేవంత్‌రెడ్డి సీఎం అయిన తర్వాత రాష్ట్ర పరిస్థితి ఏవిధంగా తయారైందో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. మల్లికార్జునఖర్గే కాంగ్రెస్ పార్టీ డమ్మీ అధ్యక్షుడని, వెనుక ఉండి నడిపించేదంతా రాహుల్‌గాంధీయేనని తెలిపారు. రాహుల్, ప్రియాంకకు పార్టీలో ఏ హోదా ఉన్నదని గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు డిక్లరేషన్లు ఇప్పించారని రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు.
తమ పార్టీకి కేసీఆరే నాయకుడని, ఆయన అడుగు జాడల్లోనే తామంతా నడుస్తామని కొప్పుల స్పష్టంచేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మంత్రివర్గ విస్తరణ చేపడితే తన పదవికే ఎసరు వస్తుందని రేవంత్‌రెడ్డి భయపడుతున్నాడని అన్నారు. బిల్లా, రంగాలని తమ పార్టీ నేతలను సంభోదించడం వల్ల రేవంత్‌రెడ్డి సీఎం పదవి స్థాయిని తగ్గించారని పేర్కొన్నారు. బిల్లా, రంగా చేష్టలు రేవంత్రెడ్డివేనని, ఈ స్థాయిని కూడా ఆయన ఎప్పుడో దాటిపోయి ఇపుడు చార్లెస్ శోభారాజ్‌ను మించిపోయారని ఎద్దేవా చేశారు. పాలన చేతకాక పనికిమాలిన మాటలన్నీ మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
అంబేద్కర్‌ను ఓడించి, జగ్జీవన్రాంను అవమానించిన కాంగ్రెస్ పార్టీ తమకు నీతులు చెప్పడం ఏమిటని ఆగ్రహం వ్యక్తంచేశారు. దళితులకు రెండుసార్లు డిప్యూటీ సీఎం ఇచ్చిన ఘనత తమ పార్టీదని గుర్తుచేశారు. బీఆర్ఎస్ అంతర్గత వ్యవహారాలపై జోక్యం తగ్గించి పాలనపై దృష్టిపెడితే రేవంత్‌కు మంచిదని హితవు పలికారు. తాను సీఎం పదవిలో ఉండి వేరే వారిని సీఎం అని సంభోదించే స్థాయికి రేవంత్ దిగజారారని, ముందు చేవెళ్లలో ఇచ్చిన దళిత డిక్లరేషన్‌ను అమలు చేయాలని కొప్పుల డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్‌సింగ్, ప్రసాద్, ఏలేటి కృష్ణారెడ్డి, గుంజపడుగు హరిప్రసాద్, మైఖేల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.