కాళేశ్వరం, ఫిబ్రవరి 23 : ఎంతసేపూ గత ప్రభుత్వం తప్పులు ఎక్కడ దొరుకుతాయా అంటూ భూతద్దం పెట్టి వెతకడం పక్కన బెట్టి.. ప్రభుత్వం ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేస్తే ప్రజలు సంతోషంగా ఉంటారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్(Koppula Eshwar,) అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో 17 సీట్లు గెలిస్తేనే ఆరు గ్యారంటీలు అమల వుతాయని చెప్పడాన్ని తప్పుబట్టారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ఒక మేడిగడ్డ బ్యారేజీ ఒక్కటే కాదని ఎక్కడో మూలన కొద్దిగా నెర్రెలు చూపితే ఆ ప్రాజెక్టుపై కోపంతో రైతు నోట్లో మట్టి కొట్టవద్దని సూచించారు. గురువారం ఆయన పెద్దపల్లి జిల్లా జడ్పీ చైర్మన్ పుట్ట మధుతో కలిసి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం దేవస్థానానికి వచ్చారు. ముందుగా ముక్తీశ్వర స్వామి సన్నిధిలో దర్శనం చేసుకున్నాక హరిత అతిథిగృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
నాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇసుక వనరులతో ఏడాదికి రూ.400 కోట్లు వచ్చేవనీ, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఇసుక పాలసీ తీసుకవచ్చి ఏడాదికి రూ.1800 కోట్లు ఆదాయానికి పెంచిందని గుర్తు చేశారు. నాడు తమ ప్రభుత్వంలో ఇసుక మాఫియా అంటూ మాట్లాడిన మీకు ఇప్పుడు మీ ప్రభుత్వ హయంలో అవే ఇసుక క్వారీలు నడుస్తున్నాయి కదా? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేదంటే ప్రజల పక్షాన ఉద్యమాలతో బుద్ధి చెప్తామన్నారు.