మంచిర్యాల టౌన్, జూన్ 14 : సింగరేణిలో ఎక్సెస్ టెండర్లపై సీబీఐతో విచారణ జరుపాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. ఆదివారం మంచిర్యాలలో మాజీ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. సింగరేణిని నాశనం చేయడంలో ప్రభుత్వం, మంత్రులు ముందున్నారని ధ్వజమెత్తారు. ‘మీ బంధువులు, అనునాయులు, మీకు సంబంధించిన వారికి పనులు కట్టబెట్టడం కోసం సైట్ విజిట్ ఆప్షన్ పెట్టారు’ అని విమర్శించారు. సీఎం బావమరిది సృజన్‌రెడ్డికి చెందిన శోధ కన్స్ట్రక్షన్ 13 శాతం ఎక్సెస్ టెండర్ వేసిందని, ఆర్జీ ఓసీ2లో 5 శాతం, ఎస్సార్పీఓసీ 2లో 8 శాతం, మణుగూరు ఓసీలో 10 శాతం, కేడీకే 3లో 8 శాతం ఎక్సెస్ టెండర్లు వేశారని తెలిపారు.
ఇదంతా మోసం కాదా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో 2023లో జరిగిన ఓసీ టెండర్లలో 22 శాతం లెస్ టెండర్ పడిన విషయాన్ని గుర్తుచేశారు. సింగరేణిలో ఎక్సెస్ టెండర్లపై సీబీఐ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి సంస్థను కాంగ్రెస్ ప్రభుత్వం రాబందుల్లా పీక్కుతింటున్నదని మండిపడ్డారు.
సింగరేణిలో జరుగుతున్న అనేక కుంభకోణాలను కార్మిక క్షేత్రాలకు వచ్చి బయట పెడుతున్నందుకే మాజీ మంత్రి హరీశ్‌రావును విమర్శించడం సరికాదని అన్నారు. భట్టి మాట్లాడిన విషయాలన్నీ అబద్ధాలని స్పష్టంచేశారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కై పనిచేస్తున్నాయని అనడం సిగ్గుచేటని అన్నారు. వాస్తవానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలోఉన్న కాంగ్రెస్‌లే కుమ్మక్కై సింగరేణిని నాశనం చేస్తున్నాయని విమర్శించారు. వాస్తవానికి గతంలో బొగ్గు బ్లాకులు సింగరేణికే దక్కాలనే ఉద్దేశంతో టెండర్ ప్రక్రియ పూర్తయినప్పటికీ, ఎవరినీ పనిచేయనీయమని తేల్చి చెప్పిన నాయకుడు కేసీఆర్ అని స్పష్టంచేశారు.
కాంగ్రెస్ వచ్చాకే సింగరేణిని నాశనం చేస్తున్నదని, ప్రైవేట్ వ్యవస్థను ప్రోత్సహిస్తున్నదని విమర్శించారు. డిప్యూటీ సీఎం భట్టి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతూ సింగరేణిలో టెండర్లను పిలిచారని ఆరోపించారు. నెలకు రెండుసార్లు మెడికల్ బోర్డు నిర్వహిస్తామని చెప్పి రెండున్నరేండ్లయినా పెట్టకపోవడం ఏంటన్నారు. బీఆర్ఎస్ కార్మిక క్షేత్రంలోకి వస్తే ఆ ఒత్తిడితో 335 మందికి నియామక పత్రాలు ఇచ్చారని, రెండేండ్లుగా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.