హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. ఢిల్లీలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి మాటల్లో నిజాలు లేవని, అబద్ధాలతోనే ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర నీటి వాటా వినియోగంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ఇదే విషయాన్ని కేసీఆర్ గుర్తుచేశారని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ హయాంలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును దాదాపు 80%పైగా పూర్తి చేస్తే.. సీఎం రేవంత్‌రెడ్డి దానిని ఎండబెట్టారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు వత్తాసు పలుకుతూ., తెలంగాణ ప్రాంత హక్కులను తాకట్టు పెట్టే విధంగా పనిచేస్తున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. దాన్ని కూడా డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డిపై నిప్పులు చెరిగారు. నల్లగొండ, పాలమూరు, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల ప్రజలను అప్రమత్తం చేసే విధంగా కేసీఆర్ మాట్లాడితే, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత సింగరేణి కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగిందని కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.