జగిత్యాల, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): హైడ్రా పేరిట సీఎం రేవంత్ డ్రామా చేస్తున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించా రు. ఆదివారం ఆయన జగిత్యాలలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో సమస్యలతో ప్రజలు సతమతమవు తుంటే.. అందరి దృష్టిని మళ్లించేందు కు సీఎం రేవంత్ హైడ్రా పేరిట ఇండ్ల కూల్చివేతకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరిగితే చట్టబద్ధంగా నోటీసులు ఇచ్చి కూల్చివేయాలే తప్ప, ఇష్టారాజ్యంగా నోటీసులు లేకుండానే కూల్చివేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు.రాష్ట్రంలో 70 ఏండ్లు పాలన చేసి, చెరువులను సర్వనాశనం చేసిన చరిత్ర, ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాలకే దక్కుతుందని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ గత పాలకుల వల్లే చెరువులు కబ్జా అయ్యాయని, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో కట్టడాలు వెలిశాయని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక, కేసీఆర్ పుణ్యమా అని చెరువులు తిరిగి బతికినట్టు తెలిపారు. బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్లో నిర్మాణాలన్నీ కాంగ్రెస్, టీడీపీ పాపమేనని విమర్శించారు. ఇప్పుడు హఠాత్తుగా ఇండ్లను కూల్చివేయడం సరికాదన్నారు.