ధర్మపురి, ఫిబ్రవరి 9 : ‘అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చి అరచేతిలో వైకుంఠం చూపి గద్దెనెక్కింది. నమ్ముకున్న ప్రజలను నిండా ముంచింది. రాష్ట్రంలో రెండేండ్లుగా అరాచకాలు తప్ప అభివృద్ధి లేదు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీని చిత్తుగా ఓడించి దుష్టపాలనకు చరమగీతం పాడాలి’ అని మాజీ మంత్రి ఈశ్వర్ ధర్మపురి పట్టణ ఓటర్లకు పిలుపునిచ్చారు.
సోమవారం ఆయన జగిత్యాల జిల్లా ధర్మపురిలో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్కు ఓటేస్తే దౌర్జన్యాలు తప్ప అభివృద్ధి ఉండదని అన్నారు. రైతులు, ప్రజలకు పేగుబంధంలా ఉన్న కేసీఆర్ను దూరం చేసేందుకు కాంగ్రెస్ 420 హామీలిచ్చి మోసం చేసి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.