హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): దమ్ముంటే ఆరు గ్యారెంటీలు పూర్తిగా అమలైన గ్రామాల్లోనే కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడగాలని సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సవాల్ విసిరారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఇందిరమ్మ ఇండ్లు ఇయ్యని ఊర్లల్లో ఓట్లు అడగబోమని రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన ఒక ప్రకటనలో స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలోనే లక్షలాది కుటుంబాలకు గ్యారెంటీ కార్డులు పంచిందని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోగా హామీలన్నీ అమలు చేస్తామంటూ ప్రజలను నమ్మించిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలైనా ఎన్ని గ్రామాల్లో పూర్తిగా అమలు చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులు, యువత, మహిళలు, బీసీ ఇలా అన్ని వర్గాలను మభ్యపెట్టేలా మ్యానిఫెస్టో, డిక్లరేషన్లను ప్రకటించిందని తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌తోపాటు తులం బంగారం ఇచ్చిన గ్రామాల్లోనే ఓట్లు అడగాలని, రైతులకు 2 లక్షల రుణమాఫీ, సకాలంలో ఎరువులు అందజేసి, సాగునీటిని పొలాలకు అందించి, గ్రామాల్లో పూర్తిస్థాయిలో రైతుల పంటలు కొనుగోలు చేసిన గ్రామాల్లోనే కాంగ్రెస్ ఓట్లు అడగాలని కొప్పుల డిమాండ్ చేశారు.