హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): బీజేపీకి సెప్టెంబర్ 17తో సంబంధమే లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో కూనంనేని మీడియాతో మాట్లాడారు. చరిత్రకు బీజేపీ వక్రభాష్యాలు చెబుతూ దేశానికి, సమాజానికి ద్రోహం చేస్తున్నదని విమర్శించారు. గవర్నర్ తన పరిధిలో ఉండాలని సూచించారు. బీజేపీ పాలనలో దేశంలో గవర్నర్ వ్యవస్థ ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణలో నిర్వహించాల్సింది విమోచనమా? విలీనమా? అనేది గవర్నర్‌కు ఎందుకు? అది గవర్నర్ పరిధిలోని అంశం కాదుకదా? అని ప్రశ్నించారు. ముస్లిం పాలకుల నుంచి హిందువులకు విముక్తి లభించిందని బీజేపీ, ఆర్ఎస్ఎస్ అనడం సరికాదన్నారు. నిజాం రాజు వేరు, ముస్లిం ప్రజలు వేరన్న విషయాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ గుర్తించాలని హితవుపలికారు. సాయుధ పోరాటం చేసింది 90 శాతం మంది హిందువులేనని చెప్పారు. ప్రజలను విడగొట్టే వాళ్లెవరకూ దేశభక్తులు కాదని స్పష్టం చేశారు.
నిజంగా తెలంగాణ స్వాతంత్య్ర పోరాటంపై అంత ప్రేమ ఉంటే నాటి సాయుధ పోరాటంలో పాల్గొన్న స్వాతంత్య్ర సమరయోధుల పెన్షన్ దరఖాస్తులను వాజపేయి ప్రభుత్వంలోని కేంద్ర హోంమంత్రి ఎల్కే అద్వానీ ఎందుకు తిరసరించారని నిలదీశారు. సమావేశంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు సయ్యద్ అజీజ్ పాషా, రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ, సీపీఐ జాతీయ సమితి సభ్యులు ఎన్ బాలమల్లేశ్, బాల నర్సింహ, సీపీఐ హైదరాబాద్ కార్యదర్శి ఈటీ నర్సింహ తదితరులు పాల్గొన్నారు.