ఇక ఆరోపణలు, అభియోగాలు లేవు. ఇక బద్దలయ్యే అభాండాల భాండాలూ లేవు. హైడ్రామాలు, హైరానాలు లేవు. అధికార పార్టీ నేతలు ఒక అవగాహనకు వచ్చారు. దీపావళి సందర్భంగా మాటలు కలిపి, వాటాల లెక్క తేల్చేసుకున్నారు. వసూలు చేసేది ఎంతయినా.. అందరికీ సమానంగా దక్కాలని చేతులు కలిపారు.
గతవారం రోజులుగా మాటల మంటలు రేపి, ‘బిగ్‌బాస్’ ఎపిసోడ్ తరహాలో నాటకాన్ని రక్తికట్టించిన నేతలు.. చివరికి ‘రాజీ ఫార్ములా’కు దిగారు. సిమెంట్ ఫ్యాక్టరీల్లో ముఖ్యనేత, సంబంధిత శాఖ నేత, స్థానిక నేత, రెవెన్యూ వ్యవహారాల నేత నలుగురికీ సమాన వాటా దక్కాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల వార్తల్లో నిలిచిన ఓ సిమెంట్ పరిశ్రమ నుంచి వచ్చినదాంట్లో తలా రూ.35కోట్లు పంచుకోవాలని ఒప్పందం చేసుకున్నారు.
హైదరాబాద్, ఆక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ వ్యవహారం కొండెక్కినట్టేనా? పారిశ్రామికవేత్త కణత మీద తుపాకీ పెట్టిన కేసులో పోలీసుల హల్చల్ అంతా ఉత్తదేనా? సుమంత్‌తో పాటు కొండా మురళి మీద కూడా ఆర్మ్స్ యాక్ట్ ప్రయోగిస్తామని భయపెట్టిన పోలీసులు ముఖ్యనేత కంటిసైగతో వెనక్కి తగ్గారా? సిమెంట్ ఫ్యాక్టరీ వాటాల కోసమే ఇంత రాద్ధాంతం నడిచిందా? పండుగ పూట పెద్దలంతా కూర్చొని వాటాల ఒప్పందం చేసుకున్నారా? ప్రతి సిమెంట్ ఫ్యాక్టరీలో ముఖ్యనేత, సంబంధిత శాఖ మంత్రి, స్థానిక మంత్రి, భూ కేటాయింపుల మంత్రి ఇలా నలుగుకీ 25 శాతం చొప్పున వాటాలు అని అంగీకారానికి వచ్చారా? రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సూత్రం అమల్లో ఉంటుందని పెద్దమనుషుల మౌఖిక ఒప్పందం జరిగిపోయిందా? పెద్దలు పెద్దలు మాట్లాడుకొని సూర్యాపేట జిల్లాలోని సైదుల్ నామా ఫారెస్టు భూములను గద్దల పాలు చేశారా? చిట్టడవిని విధ్వంసం చేసి సున్నపురాయిని తోడుకోడానికి భారీ సిమెంట్ పరిశ్రమలకు చట్ట విరుద్ధమైన అనుమతులివ్వాలని నిర్ణయించారా? అంటే ‘అవును’ అనే సమాధానమే వినిపిస్తున్నది. భారీ సిమెంట్ పరిశ్రమలు, బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీల వాటాలపై దీపావళి పండుగ పూట రాష్ట్ర ముఖ్యనేత ఇంట్లో పెద్దమనుషుల ఒప్పందం జరిగినట్టు కాంగ్రెస్ వర్గాల్లోనే చర్చ జరుగుతున్నది.
మేడారం టెండర్లతో మొదలై, దక్కన్ సిమెంట్ కంపెనీ వ్యవహారంలో రోడ్డు మీదకు వచ్చిన మంత్రి సురేఖ వ్యవహారం సెటిల్ అయినట్టుగా తెలిసింది. ఈ ఒక్క పంచాయితీ మాత్రమే కాక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సిమెంట్ పరిశ్రమలు, బల్క్ డ్రగ్స్ కంపెనీ వాటాల వ్యవహారంలో ఎవరి వాటా ఎంత? అని పెద్దలంతా కూర్చొని మాట్లాడుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈమొత్తం వ్యవహారానికి పార్టీ కీలక నేత మధ్యవర్తిత్వం వహించినట్టు కాంగ్రెస్ వర్గాల్లో బహిరంగంగానే చర్చ నడుస్తున్నది. భారీ పరిశ్రమలు ఏవైనా నలుగురికీ సమాన వాటా ఉండాలని పెద్దలు ఒప్పందం చేసుకున్నట్టు తెలిసింది. ముఖ్యనేతకు 25 శాతం, సంబంధిత శాఖ మంత్రికి 25 శాతం, ఫ్యాక్టరీ ఏ ప్రాంతంలో ఉన్నదో అక్కడి స్థానిక మంత్రికి, గతంలో కేటాయించిన భూముల్లోనే కంపెనీ కార్యకలాపాలు నడిస్తే ఇబ్బంది లేదు కాని, ఆక్రమిత భూముల్లో తవ్వకాలు, ఉత్తత్తుల నిల్వలు చేస్తే మాత్రం భూ కేటాయింపులు చూసుకునే మంత్రికి 25 శాతం చొప్పున వాటాలు ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నట్టు తెలిసింది. సాధారణంగా రెడ్ క్యాటగిరీలో ఉన్న పరిశ్రమలు ప్రతి ఐదేండ్లకోసారి ఆపరేషన్ లైసెన్స్ రెన్యూవల్ చేయించుకోవాల్సి ఉంటుంది. రెండు సిమెంట్ పరిశ్రమలు ఈ ఏడాది రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకోగా రెన్యూవల్ చేసే విషయంలో వివాదం చెలరేగి, రాష్ట్ర రాజకీయాల్లోనే ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే.
దక్కన్ సిమెంట్ కంపెనీ నుంచి వచ్చే వాటాల విషయం తేల్చుకునే క్రమంలోనే మాటామాటా పెరిగి మంత్రి సురేఖ ఓఎస్డీ సుమంత్ పారిశ్రామిక వేత్త కణత మీద తుపాకీ గురిపెట్టే దాకా వెళ్లిందని విశ్వసనీయ వ్యక్తుల ద్వారా తెలిసింది. ఈ కంపెనీ నుంచి ముఖ్యనేత, స్థానిక మంత్రి, భూ వ్యవహారాలు చూసే మంత్రి ముగ్గురికీ రూ.35 కోట్ల చొప్పున ముడుపులు అందినట్టు తెలిసింది. కానీ కంపెనీ వ్యవహారాలు, ఆక్రమిత ఫారెస్టు భూ వ్యవహారాలు చూసే మంత్రి వద్దకు వెళ్లేసరికి కంపెనీ రూ.12 కోట్లు మాత్రమే ఆఫర్ చేసినట్టు సమాచారం. దీనికి సదరు మంతి సీరియస్ అయ్యారని తెలిసింది. తన ఓఎస్డీని కంపెనీ ప్రతినిధులతో చర్చలకు పంపించి, ముగ్గురికి కలిపి ఎంత ఇచ్చారో సదరు శాఖ మంత్రిగా ముగ్గురిదీ కలిపి అంటే రూ.105 కోట్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేసినట్టు తెలిసింది. కంపెనీ యాజమాన్యం ంగీకరించకపోవటంతో అటవీ భూముల మీద సర్వే చేయించి, 42 ఎకరాల రిజర్వ్ ఫారెస్టు భూములను ఆక్రమించారని, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రమాణాలకు విరుద్ధంగా ఫ్యాక్టరీ నడుపుతున్నారనే అభియోగాలతో రూ.300 కోట్లు జరిమానా వేసినట్టు సమాచారం. దీంతో కంపెనీ యాజమాన్యం లబోదిబోమని స్థానిక నేతకు మొరపెట్టుకున్నట్టు తెలిసింది. స్థానిక నేత సిఫారసు మేరకు ముఖ్యనేత కల్పించుకొని పంచాయితీ తెంపే బాధ్యత తన షాడో రోహిన్‌రెడ్డికి అప్పగించినట్టు తెలిసింది. ‘అధికారం మీ చేతిలో ఉన్నదని రూ.300 కోట్ల జరిమానా వేశారు. నా పవర్ ఏమిటో మీకు చూపిస్తా’నంటూ దక్కన్ కంపెనీ ప్రతినిధి స్వరం పెంచడంతో ‘ఏదీ చూపించు’ అంటూ సుమంత్ గన్ తీసి కంపెనీ ప్రతినిధి కణతపై గురిపెట్టినట్టు తెలిసింది.
పాయిట్ బ్లాంక్‌లో గన్ వ్యవహారంపై ఎవరు ఫిర్యాదు చేశారనేది పోలీసులు బహిర్గతం చేయలేదు. కానీ ఓఎస్డీని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు మంత్రి కొండా సురేఖ ఇంటికి వెళ్లడం, సురేఖ కూతురు సుస్మిత ఏకంగా సీఎం రేవంత్ రెడ్డినే టార్గెట్ చేయడం అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. తన తల్లి సురేఖ శాఖకు చెందిన ఫైల్ సీఎం సన్నిహితుల చేతికి ఎలా వెళ్లిందని నిలదీసింది. ఈ వీడియో క్లిప్పులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చివరికి మంత్రి సురేఖ..క్యాబినెట్ సమావేశానికి డుమ్మా కొట్టడం తో రాజకీయ హీట్ మరింత పెరిగింది. ఆమె బీసీ మంత్రి కావడంతో కొంత సేపు ఈ వ్యవహారానికి బీసీ వాదం కలర్‌కూడా పులిమారు. సురేఖ క్యాబినెట్ మీటింగ్ పకనపెట్టి , తన కూతురు సుస్మితతో కలిసి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ , పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమారను కలవడం, క్యాబినెట్ భేటీలో ముఖ్యనేత ఊహించని విధంగా సురేఖ అంశంపై చర్చ జరగటంతో ఆయన వెనక్కి తగ్గి చర్చలకు పిలిచినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో కొండా దంపతులు ముఖ్యనేతతో భేటీకావడం ప్రాధాన్యత సంతరించుకున్నది. అయితే సుస్మితా పటేల్ వ్యాఖ్యలపై ముఖ్యనేత అభ్యంతరం వ్యక్తం చేయాగా ‘ఆమె చిన్నపిల్ల, తెలిసీ తెలియని వయసు.. మనుసులో పెట్టుకోవద్దు’ అని కొండా సురేఖ దండంపెట్టి బతిలాడినట్టు సమాచారం. ఘాటైన ఆరోపణలతో తన కుటుంబ ఉనికినే ప్రశ్నించడంతో పాటు, తన షాడో టీంను బయట పెట్టిన వ్యక్తి వ్యవహారాన్ని చిన్నపిల్లల చేష్టలతో పోల్చడంతో ముఖ్యనేత గొంతులో వెలక్కాయ పడ్డట్టు అయిందని తెలిసింది. ఈ వ్యవహారం పక్కన పెట్టి భవిష్యత్తు కార్యాచరణ మీద సుదీర్ఘంగా చర్చించి, అంతా ఆత్మ సంతృప్తితోనే వెళ్లిపోయినట్టు సమాచారం.