హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రూపులను ప్రోత్సహిస్తున్నది ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్రెడ్డేనని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు చెప్పారు. బీసీ అయిన పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌కు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సహకరిస్తానని తెలిపారు. తనపై టాడా, పోటా కేసులు పెట్టినప్పుడే తానెవరికీ భయపడలేదని పునరుద్ఘాటించారు. గురువారం హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌తో మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళీధర్ సమావేశమయ్యారు. ఆమెకు 16 పేజీల లేఖను అందజేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, సీతక్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సహా అందరి నియోజకవర్గాల్లో నిరుడు లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారీగా మెజారిటీ తగ్గిందని, కొండా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ తూర్పులో కేవలం 1,130 ఓట్ల తేడా ఉన్నదని లేఖలో పేర్కొన్నారు.
కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య ముఖం ఎవరికీ తెలియకపోయినా, ఆమె ఎస్సీ కాదని, ముస్లిం యువకుడిని పెండ్లి చేసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొన్నా ఎంపీగా గెలిపించామని తెలిపారు. సినీ ప్రముఖులపై ప్రత్యేకించి నాగార్జున కుటుంబంపై సురేఖ చేసిన వ్యాఖ్యల వివరాలను ఇదివరకే ఏఐసీసీకి లేఖ ద్వారా వివరించానని తెలిపారు. తమ మీద వచ్చిన ఫిర్యాదుపై సమగ్ర విచారణ చేయాలని కోరారు. మీనాక్షి నటరాజన్‌తో భేటీ అనంతరం కొండా మురళీధర్ మీడియాతో మాట్లాడుతూ.. తాను బీసీ కార్డుతోనే రాజకీయాలు చేస్తున్నానని చెప్పారు. ఎమ్మెల్సీగా పార్టీ ఎవరిని నిలబెట్టినా గెలిపిస్తామని మీనాక్షి నటరాజన్‌కు చెప్పినట్టు వెల్లడించారు. తమ ఎదుగుదలను జీర్ణించుకోలేని కొంతమంది గ్రూపులు కట్టి మంత్రి కొండా సురేఖపై, తనపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తన కూతురి రాజకీయాభిప్రాయంతో తనకు సంబంధంలేదని పేర్కొన్నారు. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని అంటూనే పరకాల నియోజకవర్గంలో తన కూతురుకు అన్ని విషయాలు తెలుసని చెప్పారు.
తాను 500 ఎకరాల వతన్దారునని, 16 ఎకరాల భూమిని అమ్ముకునే ఎన్నికలకు వచ్చానని, రూ.70 కోట్లు ఖర్చు చేశానని ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ గురువారం మాట మార్చారు. ఈ వ్యాఖ్యల ఆధారంగా మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్‌రావు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదుచేసిన నేపథ్యంలో ఆయన స్పందించారు. వరంగల్ ఆర్యవైశ్య సత్రంలో తాను చేసిన వ్యాఖ్యలు జోక్ అని పేర్కొన్నారు. మంత్రి కొండా సురేఖకు ఉన్నది ఎకరంన్నర భూమేనని, తన పేరు మీద ఒక్కటే ఇల్లు ఉన్నదని చెప్పారు.
తన శాఖకు అన్ని విధాలా న్యాయం చేస్తున్నానని, కావాలంటే ఫైల్స్ చూసుకోవచ్చని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. తాను ఇప్పటివరకు ఎలాంటి తప్పు చేయలేదని చెప్పారు. తమ కూతురు (సుస్మితా పటేల్)లో పారేది కొండా మురళి, కొండా సురేఖ రక్తమేనని, తన కూతురు రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించి ఉండొచ్చని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లోకి వంశపారంపర్యంగా రావడం తప్పులేదని చెప్పారు. ఎవరి ఆలోచనలు వారికి ఉంటాయని తెలిపారు.